ఢిల్లీ పేలుడు: ఆ 15 మంది డాక్టర్ల ఫోన్లు స్విచ్ఛాప్

పార్క్ చేసిన కారులో అప్పటికే పేలుడు సామగ్రి ఉందా? లేక ఎవరైనా ఎక్కి పేలుడు పదార్థాలు అమర్చారా?

Update: 2025-11-15 09:38 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు(Car blast) ఘటనలో 13 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం NIAతో దర్యాప్తు చేయిస్తోంది. అయితే ఘటనకు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు దర్యాప్తు అధికారులు. పార్కింగ్‌ ఏరియాలోకి ప్రవేశించిన ప్రతి వాహనం వివరాలను తెలుసుకుంటున్నారు. హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉన్న హ్యుందాయ్ i20 పార్కింగ్ ఏరియాలో ఎంతసేపు ఆగి ఉంది? అప్పటికే కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయా? లేక పార్క్ చేసిన కారులోకి ఎవరైనా ఎక్కి పేలుడు పదార్థాలు అమర్చారా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

మరోవైపు ఈ ఘటనలో అరెస్టు అయిన వైద్యుడు డాక్టర్ ముజమ్మిల్ గనై.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని అల్ ఫలా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందంతో టచ్‌లో ఉన్నాడా? వారితో జరిపిన సంభాషణలు, చాట్‌‌లపై దర్యాప్తు చేస్తున్నారు. కారు పేలుడు ఘటన తర్వాత యూనివర్సిటీకి చెందిన 15 మంది వైద్యుల జాడ తెలియడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

"కాల్ డేటా ఆధారంగా డాక్టర్ ముజమ్మిల్‌ కొంతమందితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించాం. అనుమానిత 15 మంది డాక్టర్ల సెల్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది." అని ఓ దర్యాప్తు అధికారి చెప్పారు. వీరికి ఏదైనా ఉగ్ర సంస్థ ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు.


కొత్త ఎఫ్ఐఆర్..

ఇటు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా నేరపూరిత కుట్రకు సంబంధించిన వివిధ సెక్షన్ల కింద ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద మునుపటి ఎఫ్ఐఆర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదిలీ చేశారు.

నవంబర్ 10న కారు పేలుడు ఘటన జరిగింది. కారు నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ దానిని పార్క్ చేసినప్పుడు సమీపంలో అనేక వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రతి డ్రైవర్‌ను ట్రాక్ చేసి వారు HR-26 కారును చూశారా? దానిలో ఎంత మంది ఉన్నారు? ఉమర్‌తో పాటు మరెవరైనా ఉన్నారా? అని దర్యాప్తు అధికారులు తెలుసుకుంటున్నారు.

Tags:    

Similar News