ఢిల్లీ పేలుడు: ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించిన నిందితులు

గణతంత్ర వేడుకల రోజున విధ్వంసానికి కుట్ర?

Update: 2025-11-12 09:11 GMT
Click the Play button to listen to article

ఢిల్లీ(Delhi)లోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట (Red Fort Blast) వద్ద రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడికి ప్లాన్‌ చేసినట్లు సమాచారం. పేలుడుకు వాడిన కారును నడిపిన వ్యక్తిని జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు, ఫరీదాబాద్‌కు చెందిన ముజమ్మిల్‌ షకీల్‌ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని విచారించగా.. కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్‌తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమ్మిల్‌ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్‌ చేసినా.. ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు తెలిపాయి. అతడి ఫోన్‌ డేటాను పరిశీలించగా.. ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమ్మిల్‌ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు.


అమ్మోనియం నైట్రేట్‌.. తూటాలు

పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ బృందం దాదాపు 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో రెండు తూటాలతో పాటు, రెండు వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమ్మోనియం నైట్రేట్‌ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఇక, రెండో పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ కంటే శక్తిమంతమైనది అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్‌ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

Tags:    

Similar News