రాజస్థాన్‌లో ఆలయ శుద్ధి వివాదమేంటి?
దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యే సందర్శనతో అపవిత్రం అయ్యిందని బీజేపీ మాపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా ఆలయ శుద్ది చేయించారు.;
రాజస్థాన్‌లో బీజేపీ మాపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా(Gyan Dev Ahuja)ను పార్టీ సస్పెండ్ చేసింది. అలాగే షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. శ్రీరామనవమి సందర్భంగా అల్వార్‌లోని ఆలయ ప్రతిష్టోత్సవానికి కాంగ్రెస్(Congress)పార్టీ దళిత నాయకుడు, రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టికారం జూలీ (Tikaram Jully) హాజరయ్యారు. ఆ తర్వాతి రోజు ఆలయాన్నిఅహుజా గంగా జలంతో శుభ్రం చేయించడంపై రాజకీయ తుఫాను చెలరేగింది.
సమర్థించుకున్న అహుజా ..
జూలీ లాంటి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు లేదని అహుజా తన చర్యను సమర్థించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి ఉనికిని ప్రశ్నించిందని, అయోధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టోత్సవాన్ని కూడా ఆ పార్టీ బహిష్కరించిందని చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను "పాపులు, రాక్షసులు"గా అభివర్ణించారు.
జూలీ స్పందన..
‘‘నాకు జరిగిన ఈ అవమానం.. దళితుల పట్ల బీజేపీ వైఖరి ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుందనుకుంటాను’’ అని మూడుసార్లు ఎమ్మెల్యే అయిన జూలీ పేర్కొన్నారు. ఈ ఘటన వ్యక్తిగత విశ్వాసంపై దాడి మాత్రమే కాదని, అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్య అని అన్నారు. "మేం ఆలయాల్లో ప్రార్థనలు చేయడాన్ని సహించలేనంతగా బీజేపీ దళితులను ద్వేషిస్తుందా?" అని ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఇతర కాంగ్రెస్ నాయకులు అహుజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కులతత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ రాష్ట్రవ్యాప్త నిరసనలను పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అహుజా వైఖరిని తప్పుబట్టిన బీజేపీ ప్రతినిధులు.. దళితులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు..
గతంలోనూ అల్వార్‌లోని రామ్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ముస్లింలు ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకెళితే.. మేం ఐదుగురు ముస్లిం అమ్మాయిలను ఎత్తుకెళ్తాం" అని అన్నారు. గోవధ ఉగ్రవాదం కంటే పెద్దదని అభివర్ణించారు. రాజస్థాన్‌లో పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు.. అహుజా చర్యతో ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.