రాహుల్‌ జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వగలడా?

"J&K లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఎప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఈ విషయంలో నమ్మకంగా ఉండండి" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2024-09-07 11:26 GMT

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, రిజర్వేషన్ల విషయంలో గుజ్జర్లు, పహారీలు, బకర్‌వాల్‌లు దళితులతో సహా ఏ వర్గానికి అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జమ్ము కాశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 18న తొలిదశ పోలింగ్ జరగనుండడంతో ఎన్నికల ప్రచార నిమిత్తం అమిత్ షా రెండు రోజుల పాటు జమ్ములో పర్యటించారు. శుక్రవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రచార వ్యూహంపై చర్చించేందుకు సీనియర్ నేతలతో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించారు.

‘ప్రజలను మభ్యపెట్టొదు’

రాష్ట్ర హోదా పేరుతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీలకు అమిత్ షా సూచించారు. “హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్, ఎన్‌సి చెబుతున్నాయి. ఆలోచించండి. రాష్ట్ర హోదా ఇవ్వడం ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మాత్రమే ఆ పని చేయగలరు. ఎన్నికల తర్వాత తగిన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని పార్లమెంట్‌లో ఇప్పటికే ప్రకటిస్తాం. దానికి నేటికీ కట్టుబడి ఉన్నాం’’ అని చెప్పారు.

మళ్లీ దోచుకోడానికి ఆ మూడు కుటుంబాలు ..

“ ఇప్పటికే ఆ మూడు కుటుంబాలు (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లా కుటుంబం, పీడీపీ ముఫ్తీ కుటుంబం) జమ్మూకశ్మీర్‌ను దోచుకున్నాయి. మళ్లీ అదే పనికి పూనుకుంటున్నాయి. స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో దాని గురించి ఏ శక్తి మాట్లాడదని నేను ఖచ్చితంగా చెప్పగలను.” అని షా అన్నారు.

"J&K లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ఎప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఈ విషయంలో నమ్మకంగా ఉండండి" అని షా పార్టీ కార్యకర్తలతో అన్నారు. అభ్యర్థుల విజయానికి కృషిచేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.

చారిత్రాత్మక ఎన్నికలు..

"J&K లో రాబోయే ఎన్నికలు చారిత్రాత్మకమైనవి. ఎందుకంటే గతంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాల పద్ధతిలో కాకుండా..స్వాతంత్ర్యం తర్వాత మన జాతీయ జెండా, రాజ్యాంగం కింద తొలిసారిగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు ఒకే ఒక్క ప్రధాని ఉన్నారు. ఆయనే మోదీ’’ అని శనివారం జమ్మూలో జరిగిన బీజేపీ కార్యకర్తల ర్యాలీలో షా అన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రభుత్వం 70% ఉగ్రవాద చర్యలను తగ్గించింది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్‌ను మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Tags:    

Similar News