కుంభమేళాలో 'సనాతనేతరుల' దుకాణాలపై బ్యాన్ ఎందుకు?

మహా కుంభమేళాను 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013లో నిర్వహించారు. 2025లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్నారు.

Update: 2024-10-09 10:18 GMT

కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో అఖిల భారతీయ అఖారా పరిషత్ సమావేశమైంది. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను పరిషత్ చీఫ్ రవీంద్ర పూరి వెల్లడించారు. ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార పదార్థాల కల్తీ ఘటనలను( రసంలో మూత్రం కలపడం, ఆహారంలో ఉమ్మివేయడం) ఉదహరిస్తూ మేళాలో సనాతనేతరులు ఫుడ్‌ స్టాల్స్‌ పెట్టకూడదని నిర్ణయించారు. దీపావళి పండుగ తర్వాత జరిగే సమావేశంలో దీనిపై తీర్మానం చేసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పిస్తామని చెప్పారు.

ఉర్దూకు బదులు హిందీ పదాలు..

గత నెలలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయిని మహాకాల్ ఊరేగింపును 'షాహీ సవారీ'కి బదులుగా 'రాజ్సీ సవారీ' అని పిలవాలని ఆదేశించిన నేపథ్యంలో.. కుంభ్‌మేళాలో ఉర్దూ పదాలు ‘షాహి స్నాన్‌’, ‘పేష్వాయ్‌’ పదాలకు బదులుగా హిందీ పదాలు ‘రాజ్‌సీ స్నాన్‌’, 'చావ్నీ ప్రవేశ్'గా మార్చాలని నిర్ణయించినట్లు పూరి తెలిపారు.

మాంసం ముట్టని, మద్యం తాగని వారే విధుల్లో

కుంభమేళాలో 'సనాతని' ఉద్యోగులు, అధికారులు మాత్రమే విధులు నిర్వహించేలా తీర్మానం చేశారు. మేళా పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిషత్ పేర్కొంది. మాంసం తినని, మద్యం సేవించని పోలీసులకు డ్యూటీ వేయాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కుంభమేళా) రాజేష్ ద్వివేదికి సూచించారు.

జనవరిలో మహా కుంభమేళా..

మహా కుంభమేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో (హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని) 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మేళాను చివరిసారిగా 2013లో నిర్వహించారు. 2025లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్నారు. అఖారా పరిషత్‌లో నిర్మోహి, నిర్వాణి, దిగంబర్, మహానిర్వాణి, అటల్, బడా ఉదాసిన్, నిర్మల్, నిరంజని, జునా, ఆవాహన్, ఆనంద్, అగ్ని, నయా ఉదాసిన్‌తో సహా 13 ప్రధాన అఖారాలు ఉన్నాయి.

Tags:    

Similar News