వైఎస్సార్‌సీపీ సీనియర్లు పవన్‌తో పయనం

వైఎస్సార్‌సీపీలో ఉండేందుకు సీనియర్లు ఇష్టపడటం లేదు. జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. ముహూర్తం ఈనెల 26న ఉంది.

Update: 2024-09-23 09:30 GMT

ఏపీలో రాజకీయ రంగులు మారుతున్నాయి. పవర్‌ ఎక్కడుంటే అక్కడికి పవర్‌ పోయిన వారు వెళుతున్నారు. అధికార కూటమిలో ఉన్నది మూడు పార్టీలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో జనసేన వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి పార్టీలోకి ఎవ్వరినీ చేర్చుకోకుండా తలుపులు మూసేసింది. బీజేపీలో చేరేందుకు ఒక్కరు కూడా సుముఖత చూపడం లేదు.

వైఎస్సార్‌సీపీలో మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా చేరే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పార్టీలోకి వస్తున్న వారు వైఎస్సార్‌సీపీలో సీనియర్‌ నాయకులు కావడం విశేషం. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉంటూ ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరిన వారు అక్కడ ఇమడలేకపోతున్నారు. ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
Delete Edit
ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు రోజుల క్రితం పవన్‌ కళ్యాణ్‌ను కలిసి మాట్లాడారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఒంగోలు కేంద్రంగానే భారీ బల ప్రదర్శన చేసి జనసేనలో చేరాలని, మహాలయ పక్షాలు ముగిసిన మరుసటి రోజు అక్టోబర్‌ 4న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే శనివారం జగ్గయ్యపేట సీనియర్‌ వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, పొన్నూరు మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, ఆయన బంధువు ప్రకాశం జిల్లా వాసి కంది రవిశంకర్‌లు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పవన్‌కు తెలిపారు. వీరితో పాటు మరికొందరు పార్టీలో చేరబోతున్నారు. ఎవరికి వారు పార్టీలో చేరే సమయంలో తమ వద్దకు రావాలంటే పవన్‌ కళ్యాణ్‌కు సమయం దొరికే అవకాశం లేనందును చేరే వారందరినీ పార్టీ కార్యాలయం వద్దకు పిలిపించి అక్కడే పార్టీలోకి చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ కార్యాలయ ఆవరణలోనే కార్యక్రమం నిర్వహించాలా? లేదా ఏదైనా ప్రదేశంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈనెల 26న మంగళగిరిలో జనసేన పార్టీలో వైఎస్సార్‌ సీపీ నుంచి వస్తున్న వారు చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారి రోశయ్య, కంది రవిశంకర్‌లతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ యూత్‌ జోనల్‌ ఇన్‌చార్జ్‌ అవనపు విక్రమ్, విజయనగరం జిల్లా డీసీఎంఎస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ భావన, ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ యాదాల అశోక్‌ బాబు, నాగులుప్పలపాడు వైఎస్సార్‌సీపీ జడ్‌పిటీసీ సభ్యురాలు డాక్టర్‌ యాదాల రత్నభారతిలు జనసేన పార్టీలో చేరనున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు జడ్‌పిటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ కార్పొరేటర్లు జనసేనలో చేరుతారు. అలాగే విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర మునిసిపల్‌ కార్పొరేటర్లు పలువురు జనసేనలో చేరుతున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అమావాస్య రోజులు ముగియగానే భారీ స్థాయిలో జనసేన పార్టీలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. జగన్‌ మాత్రం పార్టీ నుంచి బయటకు వెళుతున్నారని తెలిసిన వెంటనే సస్పెండ్‌ చేసే పనిలో ఉన్నారు. లేదా వెళ్లే వారిని వెళ్లమనండి, ఉండే వారే మనవారు అంటూ నిట్టూరుస్తున్నారు.
ఇరువురు వైఎస్సార్‌సీపీ ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా ఏజెన్సీలో గెలిచారు. అరకు అసెంబ్లీ నియోకజవర్గం నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిరువురూ జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఈ రెండు నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు వచ్చాయి. అంటే పవన్‌ కళ్యాణ్‌కు ఏజెన్సీలో అభిమానులు బాగానే ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యే సీట్లు చివరి దశలో ఎంపిక చేశారు. పాడేరు నుంచి గెలిచిన విశ్వేశ్వరరాజు వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. రేగం మత్స్యలింగంకు కూడా ఊగిస లాటల మధ్య టిక్కెట్లు కేటాయించారు. గెలిచినా, ఓడినా జగన్‌ ఆలోచనా సరళిలో మార్పు రాలేదని, అందువల్లనే పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. వీరిద్దరు ఎమ్మెల్యేలు జనసేనలో చేరితే బాపట్ల జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చట్టసభలో వైఎస్సార్‌సీపీకి ప్రాధాన్యతే లేకుండా పోతుంది. కోస్తాలో ఒక్క సీటు కూడా వైఎస్సార్‌సీపీకి రాలేదు. ఉత్తరాంధ్రలో వచ్చిన సీట్లు ఈరెండు మాత్రమే.
Tags:    

Similar News