మెడికల్ కాలేజీల వివాదంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన

పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ఏపీ శాసన మండలి.

Update: 2025-09-22 06:17 GMT
ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ బయట నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్‌ డిస్కషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో సోమవారం శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు.

నల్ల కండువాలతో శాసనమండలికి హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్‌ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్‌ మండలిని కాసేపు వాయిదా వేశారు.

సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు.

Tags:    

Similar News