వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన మీద వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. ఇటీవల జగన్ చేసిన పర్యటనల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదు కావడం, రెంటపాళ్ల పర్యటనలో అయితే ఏకంగా జగన్ మీదే కేసు నమోదు కావడం, ఆ కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండటం, వచ్చే నెల జూలై 1న ఆ కేసు తిరిగి విచారణకు రానుండటం, హైకోర్టు ఈ కేసు మీద ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో రాజకీయ వర్గాలు ఎదరు చూస్తుండటం, తీర్పు జగన్‌కు అనుకూలంగా వస్తుందా? ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఉంటుందా? జగన్ పర్యటనలపైన ఏమైనా కామెంట్ చేస్తుందా? వంటి అనేక ఉద్రిక్త ప్రశ్నల నడుమ జూలై 3న జగన్ నెల్లూరు పర్యటన చేయాలని నిర్ణయించుకోవడంతో జగన్ నెల్లూరు పర్యటనపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
అసలు జగన్ నెల్లూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం పోలీసుల చేత అనుమతులు జారీ చేయిస్తుందా? రెంటపాళ్ల పర్యటన సందర్భంగా విధించినట్లే ఆంక్షలు విధిస్తుందా? ఒక వేళ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతిని ఆధారంగా చేసుకొని నెల్లూరు పర్యటనకు అనుమతులు నిరాకరిస్తుందా? అలా అనుమతులు నిరాకరిస్తే జగన్ తన నెల్లూరు పర్యటనను రద్దు చేసుకుంటారా? లేదా పంతానికి పోయి నెల్లూరు పర్యటనను కొనసాగిస్తారా? ఒక వేళ ఆంక్షలు విధిస్తే ఎలాంటి ఆంక్షలు విధిస్తుంది? రెంటపాళ్లలో మాదిరిగా కాన్వాయ్ వాహనాలను మూడుకు తగ్గించి, జగన్‌తో పాటు 100 మందికే అనుమతులిస్తారా? లేకుంటే జగన్ ఒక్కడికే అనుమతులిస్తారా? వంటి అనేక ప్రశ్నలు జగన్ నెల్లూరు పర్యటనపై రాజకీయ వర్గాలను వెంటాడుతున్నాయి.
జగన్ నెల్లూరు పర్యటన ఎందుకంటే..
కాకాణి గోవర్థన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. ప్రస్తుతం కాకాణి గోవర్థన్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని, 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్‌గేట్ ఏర్పాటు చేశారని, కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించారని, 2023లో కనుపూరు చెరువులో మెరక పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వించారనే ఆరోపణలతో కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటుగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె పూజితపై కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డితో ములాఖత్ కోసం జగన్ నెల్లూరు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసేందుకు కూడా ఇది వరకు విజయవాడ జైలుకు జగన్ వెళ్లారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేసిన పర్యటనల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పొదిలి పర్యటనలో మహిళలపై, పోలీసులపై దాడులకు పాల్పడ్డారని దాదాపు 25 మంది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. ఇక రెంటపాళ్ల పర్యటనలో ఏకంగా జగన్ మీదే కేసు నమోదు చేశారు. చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందపడి మరణించాడనే ఆరోపణల మీద కారు డ్రైవర్ రమణారెడ్డిపైన, అందులో ఉన్న జగన్‌పైన, అదే కారులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ పీఏ కేఎన్‌ఆర్‌లపైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు కొట్టివేయాలని కోరుతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు ఎలా పెడతారు అంటూ పోలీసులను ప్రశ్నించింది. తమ వాదనలు వినిపించేందుకు మరింత గడువు కావాలని కూటమి ప్రభుత్వం తరపున గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరడంతో తదుపరి విచారణను జూలై1కి వాయిదా వేస్తూ.. అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల మీద ఎలాంటి బలవంతపు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.