ఆట మీరు మొదలెట్టారు..మేం ముగిస్తాం
టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీపై ధ్వజమెత్తారు.;
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ మీద, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ధ్వజమెత్తారు. ఆట మీరు మొదలెట్టారు.. మేం ముగిస్తాం.. వైసీపీ నాయకులారా ఖబడ్దార్ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో లావాదేవీలన్నీ ఇప్పుడు బలపడుతున్నాయని, దుబాయ్ నుంచి హైదరబాద్‌కు జరిగిన ఆర్థిక లావాదేవీలు కూడా నేడు బలపడుతున్నాయని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాటాడారని, అలా చెలగాటం ఆడిన వారికి ఉరిశిక్ష వేయాలని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రేషన్ బియ్యం అక్రమాలతో కూడా లింకులు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తోడు దొంగలని, వీరిద్దరు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో గోదావరి నదిపైన నిర్మించిన ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకోలేని బుచ్చయ్య చౌదిరి నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను రాబట్టుకునేందుకు సీఎం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని, అందులో భాగంగానే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని పేర్కొన్నారు.