నేటి నుంచి నెలరోజుల పాటు ఏపీలో యోగాంధ్ర–2025
ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్పవరం యోగా అని సీఎం చంద్రబాబు అన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలన్నారు.;
By : The Federal
Update: 2025-05-21 09:08 GMT
మే 21 నుంచి జూన్ 21 వరకు నెలరోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర–2025 నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందిస్తున్న గొప్ప వరం యోగా అని అన్నారు. బుధవారం యోగాంధ్ర వెబ్ సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు. జూన్ 21న ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షలమందితో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
యోగా అనేది భారత దేశానికి వారసత్వంగా వస్తోందన్నారు. యోగా అనేది భారతీయ జీవన విధానంలో ఒక భాగమన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి చదువుకునేందుకు భారత దేశానికి వచ్చేవారని, రానురాను విదేశీయుల దాడులతో ఆ వాతావరణం అంతా కనుమరుగై పోయిందన్నారు. 2014 డిసెంబర్ లో యునైటెడ్ నేషనన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచంమంతా యోగా దినోత్సవం జరపాలని నిర్ణయించిందన్నారు. మనిషి తన దైనిందిన జీవితంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి దానికీ టెన్షన్ పడుతూ.. లైఫ్ మెకానికల్ గా మారిన ఈ తరుణంలో యోగా ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమందికి తగ్గకుండా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ సంర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలమందితో యోగా కోర్సులు చేయించి వారికి సర్టిఫికేట్లు కూడా అందజేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మని మంత్రుల బృందం చూసుకుంటుందన్నారు, ప్రతిఒక్కరు ఈ యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పట్టణాలు, నగరాల నుంచి గ్రామస్థాయి వరకూ యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మన రాష్ట్రంలో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి. అమరావతి బుద్ద స్థూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ , అఖండ గోదావరి ఇలా 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతను వివరించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.
యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్ లో కూడా పొందుపరుస్తామ్నారు. స్కూళ్లు మొదలవగానే గంట సేపు విద్యార్థులకు యోగా నిర్వహించే విధంగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. అందరూ రోజూ ఒక గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్ చేయాలని తదారా ఒత్తిడి మాయమై పోతుందన్నారు. ఇది వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు వాసుదేవ్ తో ఐఏఎస్ , ఐపీఎస్, మంత్రులకు నేను క్లాసులు పెట్టించామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.