జనసేనకు క్యూ కట్టిన వైసీపీ నేతలు- సామినేని వైసీపీకి గుడ్ బై

వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నాయకులు అనేక మంది జనసేనకు క్యూ కట్టారు.

By :  491
Update: 2024-09-19 10:04 GMT

వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నాయకులు అనేక మంది జనసేనకు క్యూ కట్టారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలియాస్ వాసు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అదే కోవలో మరికొంత మంది ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన వైపు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుంగు అనుచరులుగా ఉన్నవారే కావడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. సెప్టెంబర్ 20న అంటే శుక్రవారం ఆయన తన అనుచరులతో భేటీ అవుతున్నారు. అనుచరులతో మీటింగ్ తర్వాత ఆయన తన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని చెప్పినప్పటికీ ఇప్పటికే ఆయన పవన్ కల్యాణ్ తో భేటీ అయినట్టు సమాచారం. ఈనెల 22న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని ఉదయభాను అనుచరులు చెబుతున్నారు.


ఇంకా పలువురు కూడా జనసేన వైపు చూస్తున్నారు. వారిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు ఉన్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి వీరందరూ గుంబనంగా ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. వైఎస్ జగన్ ఇటీవల గుంటూరు పర్యటనకు వెళ్లినపుడు కూడా రోశయ్య ఆవైపు చూసిన దాఖలాలు లేవు. కిలారు రోశయ్య వైసీపీ కీలకనేత, పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు అయిపోయినప్పటి పార్టీకి దూరంగా ఉన్నారు. సుదీర్ఘకాలం గుంటూరు మిర్చియార్డు పాలకవర్గంలో సభ్యునిగా మిర్చియార్డు ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో, వైసీపీ సీనియర్ నాయకుడుగా ఉన్న ఉదయభాను ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే. రెండుసార్లు ప్రభుత్వ విప్ గా వ్యవహించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరనున్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జనసేన నేతలు చెబుతున్నారు. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య- వీరిద్దరూ పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారే.

ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిది విచిత్ర పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రజాసమస్యలను పరిష్కరించారన్న పేరుంది. ప్రతిరోజు ఉదయం ఎంపిక చేసిన గ్రామాల్లో, వార్డుల్లో తిరిగి ప్రజాసమస్యలను పరిష్కరించారన్న పేరుంది. అయినప్పటికీ ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సమయంలో ఆయన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తానేమి తక్కువ చేశానంటూ తన నియోజకవర్గ ఓటర్లను ప్రశ్నిస్తూ విడుదల చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఎన్ఆర్ఐ అయిన కేతిరెడ్డి విద్యావంతుడు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాజకీయ నేపథ్యమునన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో తన తండ్రి మాజీ ఎమ్మెయ్యే కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి మరణానంతరం ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వైసీపీలోనే కొనసాగుతారని భావించినా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారన్న మాట వినపడుతోంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ గెలిచారు. పెండెం దొరబాబు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో బీజేపీ తరఫునే ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ లో చేరి పిఠాపురం నుంచి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో కూడా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయనకు వైఎస్ జగన్ సీటు ఇవ్వలేదు. పిఠాపురం నుంచి వంగా గీతను రంగంలోకి దించినప్పటి నుంచి ఆయన కినుకవహించారని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆయన వ్యత్రిరేకించిన పవన్ కల్యాణ్ పార్టీలోనే చేరబోతున్నారని సమాచారం.
మొత్తం మీద వైసీపీ సూప్ లో పడినట్టే కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇవన్నీ ఇబ్బంది కరమైనవే. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులే వైసీపీ నుంచి తప్పుకోవడం జగన్ కు ఓరకంగా షాకే. ఆయన సెప్టెంబర్ 19 గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి ఆ పార్టీలో చేరతారని భావిస్తున్నారు. జగన్ తో విసిగిపోయే పార్టీ వీడుతున్నట్టు బాలినేని చెప్పడం గమనార్హం.
ఇంకా చాలామంది వైసీపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు పట్టణాలలో మున్సిపల్ కౌన్సిలర్లు జనసేనలో చేరారు. మరికొంత మంది కూడా పార్టీ ఫిరాయించాలనుకుంటున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇంకా కొంతమంది జనసేనలో చేరే అవకాశాన్ని తోసిపుచ్చలేమంటున్నారు ఆ పార్టీ నాయకులు.
Tags:    

Similar News