మెట్రో రైలు పట్టాలెక్కేనా?

ప్రభుత్వం మారినప్పుడల్లా డీపీఆర్ హంగామా ఆపై సమావేశాలతోనే కాలయాపన. ఏటా పెరుగుతున్న అంచనా వ్యయం. గత వైసీపీ హయాంలో అంతంతమాత్రం. ఇప్పుడు మళ్లీ మరోసారి డీపీఆర్ అంటూ హడావుడి.

By :  Admin
Update: 2024-08-30 12:43 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

విశాఖను మెట్రో రైలు ఊరిస్తోంది. ఏడాది రెండేళ్ల నుంచి కాదు.. దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి ఉసూరు మనిపిస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విశాఖకు మెట్రో రైలు తెచ్చేస్తాం.. అంటూ ఊదరగొట్టడం, ఆపై ఆ సంగతిని మర్చిపోవడం, ఐదేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం పరిపాటిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదే తంతు ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి వైజాగు మెట్రో రైలు ప్రతిపాదన 2010కి ముందే పురుడు పోసుకుంది. తొలుత 2011లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైజాగ్కు మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేశారు. ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. 2014 ఫిబ్రవరి 14న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మెట్రో రైలు ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అనంతరం ఏపీ పునర్విభజన చట్టంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా చేర్చారు.

దీంతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 జూన్ 25న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. అప్పట్లో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రూ.8,300 కోట్ల అంచనా వ్యయంతో 42.55 కి.మీల మేర మెట్రో రైలు ప్రాజెక్టును డీపీఆర్ను రూపొందించింది. 2017 సెప్టెంబర్ లో ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించడంతో ఐదుగురు బిడ్డర్లను షార్ట్ లిస్టు చేశారు. వీరిలో 2019 మార్చి నాటికి ఎస్ఎల్ ఇన్ఫ్రా సంస్థను ఖరారు చేశారు. ఆ ఏడాది మార్చిలో ఎన్నికల నేపథ్యంలో ఆ బిడ్డరు పనులను చేపట్టలేదు. అనంతరం 2019 మేలో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కొన్నాళ్ల తర్వాత టీడీపీ హయాంలో రూపొందించిన డీపీఆర్ను, ఇన్ఫ్రా సంస్థ టెండరును రద్దు చేసింది.

మునుపటి 42.55 కి.మీలకు బదులు 79.9 కి.మీల లైట్ మెట్రో రైల్ సిస్టంకు రూ.14,309 కోట్ల అంచనా వ్యయంతో 2020 మార్చిలో అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్కు మరో డీపీఆర్ను రూపొందించే బాధ్యతను అప్పగించింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు మరో 60.2 కి.మీల మేర మోడర్న్ కేటనరీ ఫ్రీ ట్రామ్ సిస్టంను కూడా జత చేసింది. దీనికి 2023 డిసెంబరులో ఆమోదం తెలిపింది. విశాఖ స్టీల్స్టాంట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 54 స్టేషన్లను నిర్మించ తలపెట్టారు. ఇంకా ఆయా స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక హంగులతో ఎస్కలేటర్లు, స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, ఎక్స్రే మిషన్లు, హ్యూమన్ స్కానర్లు, ఫైర్ సేఫ్టీ సిస్టం, స్టేషన్ సైనేజి, పబ్లిక్ అనౌన్స్మెంట్ సింటం, సోలార్ విద్యుత్ సదుపాయాలను కల్పించేలా డీపీఆర్ను రూపొందించారు.


 



ఇవికాకుండా కొమ్మాది, మధురవాడ, రైల్వే స్టేషన్, ద్వారకా బస్టేషన్, గాజువాక, సరస్వతి సర్కిల్, ఆర్కే బీచ్, స్టీల్ ప్లాంట్ జంక్షన్ స్టేషన్లను కమర్షియల్ హబ్లుగా చేయాలని తలపెట్టారు. అక్కడ వన్ఆప్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, మల్టిప్లెక్స్, మినీ ఆడిటోరియంలు, డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచించారు. అయితే పాత డీపీఆర్ను రద్దు చేసి, కొత్త డీపీఆర్ను రూపొందించినంత వేగంగా ఈ మెట్రో పనులకు కదలిక లేకుండా పోయింది. ఆఖరికి డిసెంబరు 2023లో ఈ లైట్ మెట్రో రైలుకు ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత దానిపై అడుగు ముందుకు పడలేదు. ఆ తర్వాత వైసీపీకి అధికారం దక్కలేదు.

మళ్లీ మొదటికి..

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై టీడీపీ అధికారంలోకి వచ్చింది. మూడు నెలల తర్వాత ఎప్పటిలాగే టీడీపీ మళ్లీ వైజాగ్ మెట్రో రైలు రాగం అందుకుంది. వైసీపీ హయాంలో డీపీఆర్ను పక్కనబెట్టి మరో డీపీఆర్ను సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలిదశలో తొలిదశలో రూ.11,498 కోట్లతో మూడు కారిడార్లు.. 46.23 కి.మీలు, మలిదశలో ఒక కారిడార్కు రూ.5,734 కోట్లు వెచ్చించి 30.67 కి.మీలు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

అంటే వైసీపీ ప్రభుత్వం హయాంతో పోల్చుకుంటే రూ.2,323 కోట్లు అధికమన్న మాట! అంటే పదేళ్ల క్రితంతో పోల్చుకుంటే దాదాపు రెట్టింపు అంటే.. రూ.8,932 కోట్లు ఎక్కువ. తాజా ప్రకటనతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై విశాఖ వాసుల్లో ఆశలు చిగురించినా దీనిపై కదలిక ఉంటుందన్న నమ్మకం కలగడం లేదు. పైగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మెట్రో రైలు ప్రాజెక్టుపై ఇలాంటి ప్రకటనలు సహజమేనంటూ నవ్వుకుంటున్నారు.

వైజాగ్ మెట్రో తాజా స్వరూపం ఇలా..

కారిడార్ 1: విశాఖ స్టీల్స్టాంట్ - కొమ్మాది 34.40 కి.మీలు, 29 స్టేషన్లు

కారిడార్ 2ః గురుద్వారా - పాతపోస్టాఫీసు 5.07 కి.మీలు, 6 స్టేషన్లు

కారిడార్ 3: తాటిచెట్లపాలెం - చినవాల్తేరు 6.75 కి.మీలు

కారిడార్ 4: కొమ్మాది - భోగాపురం, 7 స్టేషన్లు,

Tags:    

Similar News