PUSHPA | అల్లు అర్జున్ ను మళ్లీ విచారిస్తారా? బెయిల్ రద్దు చేస్తారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తిప్పలు తప్పడం లేదు. డిసెంబర్ 24న మళ్లీ పోలీసు విచారణను ఎదుర్కోబోతున్నారు.;

Update: 2024-12-24 02:33 GMT
పుష్ప.. వైల్డ్ ఫైర్ అయింది. చినికి చినికి గాలివానగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ చీకట్లు అలుముకుంటున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రెస్ మీట్లు, అల్లు అరవింద్ ఇంటిపై రాళ్ల దాడులు, బెయిళ్ల నేపథ్యంలో అల్లు అర్జున్ కు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు మరోసారి తాకీదులు పంపారు. డిసెంబర్ 24న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

పుష్ప-2 విడుదల సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ చిక్కడపల్లి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారు. మరో 9 ఏళ్ల బాలుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు. అయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండు విధించింది. అల్లు అర్జున్‌ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.
ఈ దుర్ఘటన అనంతరం అల్లు అర్జున్, ఆయన తండ్రి అరవింద్ కేంద్రంగా చాలా వేగంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఓ ప్రకటన చేయాల్సివచ్చింది. ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. అయితే అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్‌ పతిక్రా సమావేశం నిర్వహించి, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆరోజు రాత్రి థియేటర్‌లో పోలీసులు తన వద్దకు రాలేదని అర్జున్ చెప్పిన విషయాన్ని పోలీసులు ఖండించారు. ఆరోజు రాత్రి థియేటర్‌ నుంచి అర్జున్ ను తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. అల్లు అర్జున్‌ను పోలీసులు విచారణకు పిలిచారు. ఆ దుర్ఘటన గురించి మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 5వ తేదీ వరకూ తనకు తెలియదని అల్లు అర్జున్‌ చెప్పడాన్ని ఇప్పుడు అందరూ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు మరోసారి విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. ఏయేప్రశ్నలు అడిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ విచారణను ఈ ఒక్కరోజుతో ఆపుతారా లేక ప్రతిరోజూ పోలీసు స్టేషన్ కి రమ్మంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీతేజ్ కుటుంబానికి రూ.50 లక్షల సాయం..
సంధ్య థియేటర్‌ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిలిం చాంబర్‌ డిసెంబర్ 23న కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్‌ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. టికెట్‌ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ‘పుష్ప-2’ నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి పరామర్శించారు. అతడి తండ్రికి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇక ఈ విషయాన్ని రాజకీయం చెయ్యొద్దు. సినీ హీరోల ఇళ్లపై దాడులు చెయ్యొద్దు. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అన్నారు.
కాగా.. శ్రీతేజ్‌కు చికిత్స తామే చేయిస్తున్నామంటూ అల్లు అర్జున్‌ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోందని తెలంగాణ ఆర్య, వైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కల్వ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చామని చెబుతున్న అల్లు అర్జున్‌ ఇప్పటికి ఇచ్చింది రూ.10 లక్షలేనన్నారు.
దీపాదాస్ తో అల్లు అర్జున్ మామ భేటీ..
అల్లు అర్జున్ అరెస్ట్, ఇంటిపై రాళ్ల దాడి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనల నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు. అల్లు అర్జున్ వ్యవహారాన్ని ఆమెతో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
Tags:    

Similar News