ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని అంతమాట ఎందుకన్నట్టు?

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లాలో అంటుకున్న ఆందోళనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటుకున్నాయి.;

Update: 2025-07-09 12:11 GMT
ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై కొందరు రాజకీయ నాయకులు, మరికొంత మంది టీవీ వ్యాఖ్యాతలు చేస్తున్న వ్యాఖ్యలు లేని పోని వివాదాలను తెచ్చిపెడుతున్నాయి. రాజధాని ప్రాంత మహిళల వివాదం సద్దుమణగక ముందే సరికొత్తగా నెల్లూరు జిల్లా వివాదం తెరపైకి వచ్చింది. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లాలో అంటుకున్న ఆందోళనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటుకున్నాయి. ప్రసన్నకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వందలాది మంది మహిళలు రోడ్డెక్కారు. స్థానిక మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి.. ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పలువురు నేతలు మండిపడ్డారు. ప్రసన్నకుమార్‌రెడ్డిపై తెలుగుదేశం మహిళానేతలు కోవూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్నకుమార్‌రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు.
అసలేం జరిగిందీ?
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిపై 24 గంటల కిందట దాడి జరిగింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో వైసీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ.. దారుణమైన పదజాలాన్ని వాడారు.
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని.. ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినన్నారు. ‘పదేళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావ్‌? ఆ ప్రభాకర్‌రెడ్డికి ఒకటే చెబుతున్నా.. నీ దగ్గర రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్‌. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇప్పటికే నిన్ను చంపడానికి రెండు సిట్టింగ్‌లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది’ అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు. ‘అతనో పిచ్చోడు. ఎందుకు ఈమెను పెళ్లిచేసుకున్నాడో తెలియదు. అతను అడిగి ఉంటే.. జిల్లాలో ముక్కుపచ్చలారని ఏ అమ్మాయినైనా అతనికిచ్చి పెళ్లి చేసేవాడిని’ అని అన్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశఆరు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, వైసీపీ నేతల తీరులో మార్పు రావడం లేదని, మహిళలను దూషించడం, బూతులు తిట్టడం, కించపరచడం అనేది ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుందని చంద్రబాబు అన్నారు. మహిళలను అవమానపరచడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని చంద్రబాబు తెలిపారు. చెల్లి పుట్టుకపైనా వ్యాఖ్యలు చేసిన వారి నాయకత్వంలో పనిచేస్తోన్న నేతలు అంతే దారుణంగా, అసహ్యంగా మాట్లాడుతూ వారి నీచ సంస్కృతిని చాటుకుంటున్నారన్నారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వీరు మనుషులేనా? ఇది రాజకీయమా? మహిళల, మహిళానాయకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, ప్రణాళికాబద్దంగా వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రతి పౌరుడు గమనించాలని చంద్రబాబు కోరారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠినచర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలను నారా లోకేశ్ ఖండించారు. నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని, కనీస ఇంగితజ్ఞానం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం నేరం, దారుణమని మండిపడ్డారు. తల్లి, చెల్లిని తరిమేసిన అధినేత జగన్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నట్టున్నారని విమర్శించారు. మహిళల జోలికి వచ్చినా.. ఆడవారిపై అవాకులు చవాకులు పేలినా ఊరుకునేందుకు ఇది జగన్‌ జంగిల్‌ రాజ్‌ కాదు.. మహిళలకు అండగా నిలిచే ప్రజా ప్రభుత్వమని హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
ప్రసన్నకుమార్ ఏమన్నారంటే...
ఆమె చేసిన పీహెచ్ డీలు ఏమిటో తనకు బాగా తెలుసునని వెటకారంగా అన్నారు. ఆమె వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించారు. చిత్తూరు జిల్లా నుంచి సూరత్ వరకు ఆమె చాలా వ్యవహారాలలో పీహెచ్ డీలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎవరూ దొరకనట్టు ఆమెను చేసుకున్నారని.. ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినన్నారు.
ఎవరీ ప్రశాంతి రెడ్డి?
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డి కి చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ పార్టీ నుంచి ప్రశాంతిరెడ్డిపై దారుణంగా ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆమె తన గతం గురించి కోవూరులో ఓ బహిరంగసభలో చెప్పారు. ఆమె ఆనాడు ఏమి చెప్పారంటే.. మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నా, తాను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నా, తన తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా అని వెల్లడించారు. తన చదువంతా తిరుపతిలోనే సాగిందని, అక్కడినుంచి నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చెల్లెలు ఏ ఇంటికోడలిగా వెళ్లారో.. తాను కూడా అదే ఇంటికి కోడలిగా వెళ్లానన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్థన్ రెడ్డి పెళ్లాడానని, తర్వాత ఆయన మరణించారన్నారు. తన కుటుంబ సభ్యులు, అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు, పిల్లల అనుమతి తీసుకొని ఎంతోమందికి ఉపాధి కల్పించే ప్రభాకర్ రెడ్డిని రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. మీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నాను కాబట్టి తానెవరో మీకు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కోవూరు అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు మరింత సేవ చేయడంకోసమే తాను, తన భర్త రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా తమ ఇంటికి రావొచ్చని, సమస్యలు తీరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెల్లెలి ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీసుకువస్తూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ప్రశాంతి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయింది. తెలుగుదేశం మహిళల ఫిర్యాదుతో కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. దీంతో ఈ కేసులో ప్రసన్నకుమార్‌రెడ్డికి నోటీసులు జారీ చేయనుంది.
Tags:    

Similar News