కార్తీక మాసంలో చికెన్ ధర కొండెక్కిందేమిటీ?
కార్తీక మాసంలో తగ్గాల్సిన చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కూరగాయల రేట్లు పెరగడం, కోళ్ల పెంపకం ఖరీదు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు పౌల్ట్రీ రైతులు..
By : The Federal
Update: 2024-11-08 06:57 GMT
కార్తీక మాసంలో తగ్గాల్సిన చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ అంతటా బ్రాయిలర్ కోళ్ల ధరలు ఆశాజనంగా ఉందంటూ రైతులు సంబరపడుతుంటే మాంసం ప్రియులు మాత్రం- ఇదేం చిత్రం, కార్తీక మాసం వనభోజనాల సమయంలో కోడి మాంసం ధర పెరగడమేమిటని- ముక్కున వేలేసుకుంటున్నారు. దసరా పండుగ సమయంలో వినియోగం తగ్గింది. తిరిగి మధ్యలో పెరిగింది. ఈలోగా కార్తీకమాసం వచ్చింది. వనభోజనాల సందడి మొదలైంది. ఈ నెలలో చాలామంది మాంసాహారాన్ని ముట్టరు. వారం పది రోజుల కిందట కూడా కోళ్ల పారాల వద్ద కిలో కోడి (లైవ్) 99 రూపాయలుగా ఉంటే నవంబర్ 8 నాటికి అది 120రూపాయలకు చేరింది. దీపావళికి నాలుగైదు రోజుల ముందు నుంచి వాతావరణంలో మార్పులు రావడం, అక్కడక్కడా వానలు పడడంతో వాతావరణం చల్లబడింది. కోళ్ల ఫారాలు కూడా కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం కోళ్ల పెంపకం కూడా పెరిగినట్టు పౌల్ట్రీ అసోసియేషన్ నాయకుడు ఏ.దొరయ్య చెప్పారు.
అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ కూడా కిలో 70,80 రూపాయలుగా ఉంది. టమాటా ధరలైతే ఓ దశలో 100,120 రూపాయల వరకు వెళ్లి ఇప్పుడు 40,50 రూపాయల మధ్య ఉంటోంది. కోళ్ల ఫారాలలో వినియోగించే కోళ్ల మేత కూడా ధరలు కూడా పెరిగాయి. కోళ్ల మేత టన్ను ధర 40వేల రూపాయలుగా ఉంది. ఈ నేపథ్యంలో మాంసాహార వినియోగం, ధర పెరిగిందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా హోటల్లు, రెస్టారెంట్లలోనూ చికెన్ వినియోగం పెరిగింది.
కూరగాయల ధరలతో పాటు కోళ్ల పెంపకం కూడా వ్యయభరితం కావడంతో చికెన్ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 50 రోజుల వ్యవధిలో కోళ్ల పెంపకానికి పెట్టుబడి పెరిగింది. ఒక్కో కోడి పెంపకానికి 93 రూపాయల వరకు ఖర్చవుతుందని, ఫలితంగానే ధరలు కూడా స్వల్పంగా పెంచాల్సి వస్తోందంటున్నారు రైతులు.
పెరిగిన ధరల ప్రకారం వైట్ బ్రాయిలర్ ఫ్రెష్ చికెన్ ధర కిలో 195 రూపాయలుగా ఉంటే వైట్ బ్రాయిలర్ చికెన్ విత్ స్కిన్ రూ.210గా ఉంది. బ్రాయిలర్ సుప్రీం కిలో 391 రూపాయలుండగా నాటు కోడి కిలో రూ.360లుగా ఉంది. కడక్నాధ్ ఫ్రెష్ మీట్ కిలో 960 రూపాయలుగా ఉంది. ఎక్కువ మంది తెచ్చుకునే చికెన్ కిలో రూ.220 నుంచి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.