అధికారంలోకి వచ్చాక..వారందరికీ సినిమా చూపిస్తా

2.0 వేరేలా ఉంటుంది. మామూలుగా ఉండదు. ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.;

Update: 2025-05-08 12:37 GMT

అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులు, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని, వారు ఎక్కడున్నా, సప్త సముద్రాల అవుతల ఉన్నా, వారు రిటైర్‌ అయినా వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సారి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్స్, వైస్‌ ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ అందరికీ హ్యాట్సాఫ్‌
ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా çహృదయపూర్వక నమస్కారం. మీరంతా తెగువ చూపిన పరిస్థితుల మధ్య, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య పవిత్ర తులసి మొక్కల్లా, తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి, వాటిని చంద్రబాబుకు చూపి, నిలబడిన మీ అందరికీ మీ జగన్‌ హ్యాట్సాఫ్‌. రాజకీయాల్లో ఉన్నప్పువు విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు
చిత్తూరు జిల్లా రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైయస్సార్‌సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, 6 గురిని ఇక్కణ్నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం 6 గురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్‌ చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైయస్సార్‌సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు.
పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు 
అదే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి మున్సిపాలిటీలో 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్‌. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలి. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో అత్యంత విలువలతో పని చేస్తున్నారు.
మనం మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు
మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్‌ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్‌ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెల్చామని అన్నారు.
అవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాం
నాడు కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిచారు. అయినా వారిని లాక్కుని, ఆ ఛైర్మన్‌ పదవి పొందాలని చూడలేదు. అందుకే చివరకు అప్పుడు నేను మన తాడిపత్రి ఎమ్మెల్యేను నేను హౌజ్‌ అరెస్టు చేయించాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా అంత విలువలతో కూడిన రాజకీయం చేస్తే.. ఇప్పుడు అదే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఊళ్లోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆయనవి, ఆయన అనుచరుల ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.
మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నాను
ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైయస్సార్‌సీపీని ప్రేమించినందుకు, నన్ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నాను. అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. వారికి అడుగుడుగునా తోడుగా, అండగా నిలబడతాను. అంటూ జగన్‌ హామీ ఇచ్చారు.
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా వెదికి పట్టుకుని.. 
పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఎవ్వరినీ వదిలిపెట్టబోం. ఈరోజు సీఎం చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం. ఇంకా వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. పట్టుకుని తీసుకొస్తాం. వారికి సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. అంటూ మరో సారి హెచ్చరించారు.
ప్రశ్నించకూడదని నిరంకుశత్వం
తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. ఏ హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్‌ చేస్తున్నారు. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు. ఇలా ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు అంటూ జగన్‌ మండిపడ్డారు.
వారికి ప్రజల్లో వెళ్లే ధైర్యం లేదు
ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేరు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది? నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో ఆయనది సమాధానం చెప్పలేని దుస్థితి.
అంతటా యథేచ్ఛగా అవినీతి
ఇంకా అవినీతి. విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడం కోసం, అది కూడా 30 ఏళ్లు ఇచ్చేలా ‘సెకీ’ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కి మనం ఒప్పందం చేసుకుంటే, అదే ఈరోజు కూటమి ప్రభుత్వంలో అదే యూనిట్‌ విద్యుత్‌ రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమిని, ఇంకా లులూ కంపెనీకి రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు.
బాండ్ల పేరుతో కొత్త అవినీతి
ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి మొదలుపెట్టారు. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా తాము కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇంత దారుణమైన అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.
మళ్లీ వచ్చేది మనమే.. సినిమా చూపిస్తాం
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తా. అది మామూలుగా ఉండదు అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
Tags:    

Similar News