Indira Gandhi/ఇందిరా గాంధీ ఫోటో వెనక కథేంటి? రాజకీయం ఏమిటి?
నేడు ఇందిరా గాంధీ 107వ జయంతి
By : Admin
Update: 2024-11-19 12:36 GMT
Remembering Indira Gandhi’s Belchi tour on her birth anniversary
ఒక ఫోటో చూద్దాం… గొప్ప ఫోటో… గొప్ప అంటే టెక్నికల్‌గా కాదు… దాని సందర్భం, దాని వెనుక కథ… ఒక నాయకుడు జనంలోకి ఎప్పుడు వెళ్లాలి… జనంలో ఎలా ఉండాలి… జనమే రాజకీయంగా బతకాలి అని చెప్పే ఫోటో…
ఇప్పటి పార్ట్ టైమ్, ట్విట్టర్, ఫామ్ హౌజ్ పొలిటిషయన్లకు అర్థం కాని ఫోటో అది… షూటింగుల మధ్య విరామాల్లో, వ్యాపారాల నడుమ దొరికే గ్యాపులో రాజకీయాలు చేయడం కాదు… రాజకీయం అనేది ఓ సాధన… ఓ కమిట్మెంటు…
ఒక ఏనుగు… దానిపై ఇందిరాగాంధీ… ఇదే ఫోటో… అబ్బే, ఏనుగుపై ఇందిరాగాంధీ ఎక్కితే గొప్పదనం ఏమిటి అని చప్పరించేయకండి… ఆ కథలోకి వెళ్దాం… ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో జనం ఇందిరాగాంధీ (Indira Gandhi) ని ఛీకొట్టారు… ఆ కథ అందరికీ తెలిసిందే కదా… ఆమె కూడా ఓడిపోయి, ఇంటి నుంచి కదల్లేదు చాలారోజులు…
అసహనంగా చూస్తోంది సరైన టైం కోసం… ఈ అతుకుల బొంత జనతా ప్రభుత్వం (Janaga party government) నాలుగు రోజులు కూడా ఉండదని ఆమెకు తెలుసు… తనను ఛీకొట్టారని జనాన్ని ఈసడించుకోలేదు ఆమె… జనం దృష్టిని తనవైపు పాజిటివ్‌గా ఎలా మళ్లించుకోవాలని మాత్రమే ఆలోచిస్తోంది…
బీహార్ లో బెల్చి (Belchhi) అనే ఓ మారుమూల అటవీ గ్రామంలో భూస్వాములు 11 మందిని నరికి చంపారు. ఈ సంఘటన 1977 మే 27న జరిగింది. అందులో 8 మంది దళితులున్నారు. మిగతవారు సోనార్ కులస్తులు అంటే బంగారు పని చేసే వారు. బీహార్ బాడ్ జిల్లాలో బెల్చి గ్రామం ఉంటుంది. కుర్మికులానికి చెందిన వారు ఈ గ్రామం మీద దాడి చేసి వాళ్లందరిని పట్టుకెళ్లి, కాల్చి చంపి, మంటల్లో దహనం చేశారు. ఈ వార్త బయటికి రావడమే లేటుగా వచ్చింది… దానితో ఇందిరాగాంధీ ఇంటి నుంచి, ఎన్నికల పరాజయ పరాభవం నుంచి బయటికొచ్చింది. విశేషమేమిటంటే, ప్రధాని పదవి నుంచి ఇందిరాగాంధీని తీసేయాలని ఉద్యమించిన బీహార్ ఇపుడు ఆమెకు రాజకీయపునర్జన్మనిస్తున్నది.
అప్పటికే ఆమెకు అరవయ్యేళ్ల. ఆమె ఓడిపోయి అప్పటికి జస్ట్, 5 నెలలు. బీహార్ రైలు ఎక్కింది. ఆగస్టు 13,1977న ఆమె పాట్నా చేరింది… అక్కడి నుంచి జీపుల్లో ఆ ఊరి వైపు బయల్దేరింది. ఒక చోట జీపు బురదలో దిగబడింది. దానికి ట్రాక్టర్ కట్టి లాగారు. ట్రాక్టర్ పని చేయలేదు. అపుడామె దిగి కొంగునడుముకు చుట్టి బురదలో నడచుకుంటూ ముందుకు వెళ్లారు. ఒక దశలో ఇక ఇందిరాగాంధీ ముందుకు సాగలేదని ఆమెచుట్టూర ఉన్నవాళ్లు అనుకున్నారు. ఇప్పుడున్నట్టు ప్రైవేటు టీవీలు, ఇంత మీడియా లేదు కదా. ఢిల్లీ నుంచి ఇద్దరు రిపోర్టర్లు, ఒక కెమెరామెన్… పాట్నాలోని నలుగురు రిపోర్టర్లు.
కొంతదూరం పోయాక వర్షం… టైర్లు దిగబడుతున్నయ్… కొంతదూరం పోగానే జీపులు మొరాయించాయి… ట్రాక్టర్ అయితే కాస్త బెటర్ అని అప్పటికప్పుడు ఎలాగోలా తీసుకొచ్చారు… అది కూడా కొంతదూరం పోయి ఆగిపోయింది… ఆమె దిగి నడక మొదలుపెట్టింది…
ఎంత దూరమైనా సరే, నడిచి వెళ్దాం అన్నది మొండిగా… ఓచోట నీటిప్రవాహం… ఆమె దిగింది… మోకాళ్లపై దాకా నీళ్లు, చీరె తడిసిపోయింది… చలి, వణుకు…
కొంతదూరం పోయాక ఒకరు ఎనుగును ఆఫర్ చేశారు. దాని పేరు మోతీ. అంబారీ కూడా లేని ఏనుగుమీద మీరు ప్రయత్నిస్తారా అని అడిగారు. ‘పర్వాలేదు, నేను చాలా కాలం తర్వాత ఎనుగు సవారీ చేస్తున్నాను,’ (It is good that I am riding an elephant after a long time) అని ఆమె చిరునవ్వుతో చెప్పి ఏనుగు ఎక్కారు. వచ్చిన వారిలో కేవలం ప్రతిభా సిన్హాను మాత్రం తీసుకుని ఆమె ఏనుగుమీద బెల్చి బయలుదేరారు. ఆ గ్రామం చేరుకునేందుకు ఆమెకు మూడున్నరగంటలు పట్టింది. గ్రామస్తులతో మాట్లాడారు. వాళ్లకి న్యాయం జరగుతుందని హామీఇచ్చి మళ్లీ ఏనుగుమీద వెనుదిరిగారు.
ఆమెతోపాటు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్నాథ్ మిశ్రా,కేదార్ పాండే,ఎపి శర్మ,దిల్ కిశోర్ ప్రసాద్ సిన్హా, భీష్మనారాయణ్ సింగ్, ప్రతిభాసిన్హా వంటి సీనియర్ నేతలున్నారు. ఆమె మొదట బీహార్ షరీఫ్ లో వారం కిందటే జరిగిన మతకల్లోలాలో మరణించిన నలురుగు ముస్లిం కుటంబాలను పరామర్శించారు.
ఒకవైపు తనపై విచారణలు, మరోవైపు పర్యటనలు. కానీ కుంగిపోలేదు, ఇంట్లో పడుకుండి పోలేదు. తను ఫైటర్… అగ్రదేశాల నేతలకే చెమటలు పట్టించిన ధీశాలి ఆమె… అలాంటి టెంపర్‌మెంట్ ఉన్న నాయకత్వం మళ్లీ ఈ దేశం చూడక పోవచ్చు బహుశా…
చివరకు ఆమె పర్యటనలతో ఏమైంది..? తరువాత కొన్నాళ్లకే ఆమె హస్తిన పీఠం ఎక్కింది… అతుకులబొంత సర్కారును జనం బంగాళాఖాతంలోకి ఈడ్చిపారేశారు… రాజకీయాల్లో ఓ టైం వస్తుంది, దాన్ని ఒడుపుగా పట్టుకున్నవాడు విజేత అవుతాడు… అదే ఈ ఫోటో చెప్పేది.