రేవంత్ జీవో 29-కేసీఆర్ జీవో 55కి తేడా ఏమిటి ?

కారణం ఏమిటంటే కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో 29కి బాగా తేడా ఉందని నిరుద్యోగులు అంటున్నారు.

Update: 2024-10-19 09:39 GMT

గ్రూప్-1 మెయిన్ పరీక్షలు రాయబోతున్న నిరుద్యోగులు కొద్దిరోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో రకరకాల ఆందోళనలు చేస్తునే మరోపక్క కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుండి 27 వరకు జరగబోయే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఎలాగైనా సరే జరగకుండా అడ్డుకోవాలన్నది ఆందోళనకారుల ప్రయత్నాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీచేసిన జీవోతో తమకు అంటే రిజర్వుడు క్యాటగిరీల్లోని అభ్యర్ధులకు తీరని అన్యాయం జరుగుతుందని వీళ్ళు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకనే వెంటనే జీవోను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తునే సుప్రింకోర్టు విచారణ కోసం వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా వీళ్ళందరు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే జీవో 29ని వెంటనే రద్దుచేసి పరీక్షల తేదీని రీ షెడ్యూల్ చేయాలని.

నిరుద్యోగులు ఇంతగా ఆందోళన చేయటానికి మూలకారణం ఏమిటి ? కారణం ఏమిటంటే కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో 29కి బాగా తేడా ఉందని నిరుద్యోగులు అంటున్నారు. ఆందోళనలు చేస్తున్న గ్రూప్-1 అభ్యర్ధుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రమేష్ మస్కు ‘ది ఫెడరల్ తెలంగాణా’తో మాట్లాడుతు కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55తో పోల్చుకుంటే రేవంత్ ప్రభుత్వం జారీచేసిన జీవో 29 వల్ల రిజర్వుడు వర్గాలకు చాలాఅన్యాయం జరుగుతుందన్నారు. ఎలాగంటే ప్రభుత్వం భర్తీచేయాలని అనుకున్న గ్రూప్-1 పోస్టులు 563. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్ధులను 1:50 నిష్పత్తిలో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీజీపీఎస్సీ) ఎంపికచేసింది. దీని ప్రకారం గ్రూప్-1 563 పోస్టులకు 28,153 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపికచేశారు. అయితే అప్పట్లో నిర్వహించిన పరీక్షల ప్రశ్నల్లో తప్పులు రావటంతో కోర్టుల్లో కేసులు పడ్డాయి. దాంతో విచారణ బాగా జాప్యం జరిగి చివరకు ఒక్కపోస్టును కూడా కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. 2023లో భర్తీకి ప్రయత్నాలు జరిగినా ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది.

కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55 ప్రకారం మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్ధుల్లో రిజర్వుడు క్యాటగిరి అభ్యర్ధులకు 50 శాతం మిగిలిన అగ్రవర్ణాలకు 50 శాతం చొప్పున క్లియర్ గా విభజించారు. ఇందులోనే ఎవరైనా రిజర్వుడు క్యాటగిరిలోని అభ్యర్ధి అత్యత్తుమ ర్యాంకు సాధిస్తే అతడిని ఓసీ క్యాటగిరిలో ఎంపికచేస్తారు. దీనివల్ల రిజర్వుడు క్యాటగిరి అభ్యర్ధులకు పోటీ తగ్గి మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఓపెన్ క్యాటగిరిలో పరీక్షలు రాసే అభ్యర్ధులు దేశంలో ఏ రాష్ట్రం వారైనా అయ్యుండచ్చు. రిజర్వుడు క్యాటగిరిలో పరీక్షలు రాసేవారు మాత్రం నూరుశాతం లోకలే అయ్యుండాలని జీవోలో ఉంది.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం జారీచేసిన జీవో 55ని రద్దు చేసి ఫిబ్రవరిలో జీవో 29ని జారీచేసింది. ఈ జీవో 29నే రద్దుచేయాలని ఇపుడు నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే రేవంత్ ప్రభుత్వం జారీచేసిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్ క్యాటగిరి అన్నదాన్ని తీసేశారు. 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్ష రాయబోయే అభ్యర్ధుల్లో 100 పోస్టులకు 5 వేలమందికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు. మామూలుగా అయితే 5వేల మందిలో 2500 మంది రిజర్వుడు క్యాటగిరిల్లో, మిగిలిన 2500 మంది ఓపెన్ క్యాటగిరిలో ఉండాలి. కానీ జీవో 29 ప్రకారం మొత్తం 5 వేలమంది ఓపెన్ క్యాటగిరిలోనే మెయిన్స్ పరీక్షలు రాయాల్సుంటుంది. పరీక్షలు అయిపోయిన తర్వాత ఫలితాలు విడుదల చేసి ఉద్యోగాల భర్తీ సమయంలో రిజర్వేషన్ పాటిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోంది.

జీవో 29 ప్రకారం ఓసీ క్యాటగిరిలోని అభ్యర్ధులకే ఎక్కువ లాభం జరుగుతుంది. భర్తీ చేయాల్సిన పోస్టులు 563 ప్రకారం మెయిన్స్ పరీక్షలకు 28,160 మందికి అవకాశం రావాల్సుండగా 31,383 మందికి అవకాశం వచ్చింది. అంటే సుమారు 5 వేలమందికి పైగా ఓసీ క్యాటగిరి అభ్యర్ధులకు లబ్ది జరుగుతోంది. ఓసీ క్యాటగిరి అభ్యర్ధుల్లో 5 వేలమందికి పైగా లబ్ది జరుగుతోందంటే ఆ మేరకు రిజర్వుడు క్యాటగిరిల్లోని అభ్యర్ధులకు అన్యాయం జరుగుతున్నట్లే. తమకు అన్యాయం జరుగుతోంది కాబట్టే జీవో 29ని రద్దుచేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయటం ద్వారా తమకు న్యాయం చేయాలని గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయబోయే అభ్యర్ధులు ఆందోళనలు చేస్తున్నారు. ఓసీ క్యాటగిరీల్లోని అభ్యర్ధులు 5 వేలమందికి పైగా లబ్దిపొందుతున్నారని ఎలా చెబుతున్నారంటే నిజానికి లబ్దిపొందాల్సింది సుమారు 3 వేలమందే అయినా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నది 33 వేలు. మెయిన్స్ పరీక్షలు రాయాల్సింది 31,383 మందే అయితే 33 వేలమంది హాల్ టికెట్లు ఎలా డౌన్ లోడ్ చేసుకున్నారన్నది ఆశ్చర్యంగా ఉంది.

కేసీఆర్ ప్రభుత్వంలో జారీ అయిన జీవో 55 ప్రకారం పరీక్షలు రాయబోయే 28,160 మంది అభ్యర్ధుల్లో 14 వేలు-14వేలుగా విభజన జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో 29 వల్ల 14వేలు:14వేలు కాస్త 14వేలు:19వేలుగా మారిపోయింది. పెరిగిపోయిన 5 వేలమంది కచ్చితంగా ఓపెన్ క్యాటగిరి అభ్యర్ధులే అన్న విషయాన్ని ఆందోళనకారులు తట్టుకోలేకపోతున్నారు. ఇదే దామాషాలో మెయిన్స్ పరీక్షలు పాసైన తర్వాత ఇంటర్వ్యూలకు కూడా ఎంపిక అయి తమకు దక్కాల్సిన ఉద్యోగాల్లో ఓసీ క్యాటగిరి అభ్యర్ధులే ఎక్కువ ఉద్యోగాలను తన్నుకుపోతారన్నది ఆందోళనకారుల భయం. అందుకనే వెంటనే జీవో 29ని రద్దుచేసి తమకు న్యాయంచేయాలని ఆందోళనకారులు సుప్రింకోర్టులో కేసు వేసింది.

21వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలనుండి గ్రూప్-1 పరీక్షలు మొదలవుతుండగా అదేరోజు ఉదయం 10.30 గంటలకు సుప్రింకోర్టు జీవో 29 రద్దు కేసును విచారించబోతోంది. నిరుద్యోగుల డిమాండులో న్యాయం ఉంది కాబట్టి జీవో 29ని రద్దు చేసి పరీక్షలను రీ సెడ్యూల్ చేయాలని సుప్రింకోర్టు చెబుతుందా ? లేకపోతే పరీక్షలు మొదలైన తర్వాత రద్దు చేయటం సాధ్యంకాదు కాబట్టి జీవో 29 ప్రకారమే పరీక్షలు రాయాలని చెబుతుందా అన్నది ఆసక్తిగా మారింది. 21వ తేదీవరకు ఆందోళనకారులు తమ నిరసనలను రకరకాల రూపాల్లో తెలియజేస్తునే ఉంటారు.

Tags:    

Similar News