‘అంబుజా సిమెంట్‌’పై తిరుగుబాటు ఏం చెబుతోంది?

విశాఖ జిల్లా పెదగంట్యాడలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు తిరగబాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడం పెను సంచలనమైంది.

Update: 2025-10-09 12:15 GMT
అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న స్థానికులు

ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే, కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సమయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, ఉద్యమాలు చేపట్టడం, ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ ముందుకు సాగడం పరిపాటి. కొన్నాళ్లకు ప్రభుత్వం, పరిశ్రమను స్థాపించే కార్పొరేట్‌ సంస్థను ఎదుర్కోలేక ఆ ప్రాంత ప్రజలూ మిన్నకుండి పోతుంటారు. కానీ గంగవరం పోర్టుకు అనుబంధంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ వద్ద నాలుగు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన అదానీకి చెందిన అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ విషయంలో అలా జరగలేదు. ఈ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల వారంతా ఏకమై ఎదురు తిరిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు ముక్తకంఠంతో నిరశిస్తూ అడ్డుకున్నారు. వేల సంఖ్యలో వచ్చిన జనం ఈ పబ్లిక్‌ హియరింగ్‌ ఎలా చేస్తారో చూస్తామంటూ అధికారులకు, ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. చివరకు ప్రజాభిప్రాయం నిర్వహించే సాహసం చేయలేక అధికారులు అర్థాంతరంగా రద్దు చేసి పలాయనం చిత్తగించారు. విధిలేని పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి.


ప్రజాభిప్రాయ సేకరణలో కుర్చీలను ధ్వంసం చేస్తున్న నిరసనకారులు 

ఐక్యంగా తిరగబడి సాధించారు..
ఉత్తరాంధ్రలో కొన్నాళ్లుగా ఇటువంటి కాలుష్య కారక కర్మాగారాలు ఏర్పాటవుతున్నాయి. అయితే వాటిని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఇటీవలకాలంలో వారెవరూ ఇంతటి స్థాయిలో తిరగబడిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వం పోలీసుల సాయంతో పబ్లిక్‌ హియరింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ పెదగంట్యాడ ప్రాంత వాసులు మాత్రం బుధవారం ఉదయం నుంచి పబ్లిక్‌ హియరంగ్‌ను రద్దు చేసుకుని వెళ్లేవరకు అదానీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూనే ఉన్నారు. తమ ఆరోగ్యాలను హరించేసే సిమెంట్‌ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ బోమని తెగేసి చెప్పారు. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులను సైతం లెక్క చేయలేదు. అక్కడ పరిస్థితి ఎలా మారిందంటే.. పోలీసులు స్థానిక పౌరులు మాదిరిగా, స్థానిక పౌరులు పోలీసుల మాదిరిగా కనిపించారు. ఎప్పుడూ జనంపై విరుచుకుపడే పోలీసులు.. ఆగ్రహం కట్టలు తెంచుకున్న స్థానికులపై దురుసుగా ప్రవర్తించకుండా, లాఠీలకు పని చెప్పకుండా సంయమనం పాటించారు. ఒకవేళ పోలీసులు దుందుడుకుతనాన్ని ప్రదర్శించి ఉంటే పరిస్థితి అదుపు తప్పి జరగరానిది జరిగి ఉండేది.

కుర్చీలను విసిరి కొడుతున్న ఆందోళనకారులు 

ఎవరు కావాలో తేల్చుకోండి..
వేలాదిగా వచ్చిన నిరసనకారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం టెంట్లలో వేసిన వందలాది కుర్చీలను ఒక దగ్గరకు చేర్చి విసిరికొట్టారు. మరికొన్నింటిని ధ్వంసం చేశారు. గోబ్యాక్‌ అదానీ, సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అదానీ కోసం మా పది లక్షల మంది ఆరోగ్యాన్ని ఫణంగా పెడతారా? అంటూ నినదించారు. కాలుష్య కారక సిమెంట్‌ ఫ్యాక్టరీ మాకొద్దు. అలాంటి ఫ్యాక్టరీలో ఉద్యోగాలూ మాకొద్దు. ప్రాణాలొడ్డయినా సిమెంట్‌ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల కాలుష్యం. ఇప్పుడు అంబుజా సిమెంట్‌ వస్తే మరింత కాలుష్యం పెరుగుతుంది. ఇక ఇక్కడ బతకలేం మా పిల్లలకు భవిష్యత్తులో ఏం ఇస్తాం. రోగాలిస్తామా? గంగవరం పోర్టు వెదజల్లే కాలుష్యంతో ఇప్పటికే అవస్థలు పడుతున్నాం. అనారోగ్యం పాలవుతున్నాం. కాలుష్యంతో మా నెత్తిన కుంపటి పెడితే సహించం. ‘ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాతో కలిసి ఉద్యమించాలి.. అలా కాని పక్షంలో మేం కావాలో? మా ఆరోగ్యాలను హరించే అదానీ పక్షాన ఉంటారో తేల్చుకోండి. అని కూటమి నేతలను ఆందోళన కారులు అల్టిమేటం ఇచ్చారు.
దిగివచ్చిన కూటమి నేతలు..
సాధారణంగా తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుకు స్థానిక/అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వత్తాసు పలుకుతారు. ప్రజా వ్యతిరేకతను సైతం లెక్క చేయరు. పైగా వాటి వల్ల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని నమ్మబలుకుతారు. పెదగంట్యాడ అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలోనూ ఆ ప్రాంత కూటమి నేతలు అదే వైఖరిని ప్రదర్శించారు. కానీ బుధవారం నాటి ప్రజాగ్రహాన్ని వారు కళ్లారా చూశాక తమ తీరును అనూహ్యంగా మార్చుకున్నారు. ప్రభుత్వం తరఫున కాకుండా ఆందోళనకారుల పక్షానే తాము నిలుస్తామని ప్రకటించారు. ‘అభ్యంతరకర ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వారికుంటుంది.’ అని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే పోలీసులు అరెస్టు చేసిన నిరసనకారులను జనసేనకు చెందిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి విడిపించుకొచ్చారు.
ఇతరులకు స్ఫూర్తి నింపారు..
సిమెంట్‌ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రాంత ప్రజల జనాభా 10 లక్షలకు పైగా ఉన్నారు. దీంతో స్థానికులకు తాము వ్యతిరేకంగా ఉన్నట్టు తేలితే రాజకీయంగా తమ భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతోనే వీరు తమ వైఖరిని మార్చుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పెదగంట్యాడవాసులు అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణను తిప్పికొట్టి కాలుష్య కర్మాగారాలు ఏర్పాటవుతున్న ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచారు. వారిలో స్ఫూర్తిని నింపారు.
Tags:    

Similar News