ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో అంత నెత్తురు ఎలా పారిందీ?

ఇంద్రవెల్లి ఎరుపెక్కడానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఆరోజు ఏం జరిగిందో తెలుసా? తెలియాలంటే ఈ కరపత్రాన్ని చదవాల్సిందే..

Update: 2024-04-20 10:11 GMT

(ది ఫెడరల్ ప్రతినిధి)

1981.. ఏప్రిల్ 20.. కొండలు గుట్టల మధ్య ప్రశాంతంగా ఉండే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎరుపెక్కింది. భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం గొంతెత్తిన గిరిజనంపై తూటాలు వర్షించాయి. ఎంతమంది చనిపోయారో లెక్కలేదు. మరెంత మంది క్షతగాత్రులయ్యారో ఊహలేదు. ఎటు చూసినా నెత్తుటి మరకలే, జనం హాహాకారాలే. ఇప్పటికి 45 ఏళ్లు అయింది. ఆ ఘటనకు సంబంధించి ఇంద్రవెల్లిలో వెలిసిన ఆ ఒక్క స్థూపం తప్ప మరే ఆనవాళ్ళు మిగల్లేదు..

ఈవేళ ఇంద్రవెల్లిలో అమరవీరులకు నివాళులు అర్పించే వారు తప్ప మరేది గుర్తులేదు. ఈ దశలో మిత్రుడు, ఆకాశవాణి మాజీ ఉద్యోగి వలేటి గోపీచంద్ ఓ కరపత్రాన్ని పంపారు. ఆ వేళ ఏం జరిగిందో ఆనాటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు) సవివరంగా అందులో ఉంది. దాన్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం.

 

ఆనాటి కరపత్రం ఇలా...

"ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు...

ఒక నెత్తుటి చుక్కలోనే ప్రళయాగ్నులు - ప్రజ్వరిల్లు...

'రగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.’

పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగంగానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి. మేలుకున్న గిరిజన ప్రజానీకం ఈ దోపిడీకి పీడనకూ వ్యతిరేకంగా ఎన్నో.. దశాబ్దాలుగా వీరోచిత పోరాటాలు సాగిస్తున్నారు. చివరికి ఈ చెదురు మదురు పోరాటాలన్నీ నక్సల్బరీ ప్రజాయుద్ధ రూపం తీసుకున్నాయి. ప్రభుత్వం అంతటా అనుసరిస్తున్న అణచివేత పద్ధతులనే ఈ గిరిజన పోరాటాల మీద కూడా ప్రయోగిస్తోంది. ఈ నెల 20వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో పోలీసులు కాల్పులు జరిపి దాదాపు 50 మంది గిరిజనులను బలిగొన్నారు. ఇంద్రవెల్లిలో ఏం జరిగింది? ఆదిలాబాద్‌లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ అబద్ధ ప్రచారం వెనుక వున్న నిజాన్ని ఈ సందర్భంగా మీకు తెలియ జేయదలచు కున్నాం..

40% అటవీ ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్: జిల్లాలో గోండు, గట్టుమన్నె పరధాను, మచ్చలీర్, టోయిటల్, వోజల్ తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. వీరిలో గోండులు రెండు లక్షల జనాభాతో అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. తర తరాలుగా ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోడువ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఈ గిరిజనుల భూములను మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన దొరలు, షావుకార్లు “ఆక్రమించడంతో గిరిజనులకు భూస్వాములకు మధ్య ఘర్షణ ప్రారంభమైంది. గిరిజనుల భూములు గిరిజనేతరులు కొనడానికి గానీ, ఆక్రమించడానికి గానీ వీల్లేదని చేసిన ప్రభుత్వ శాసనాలు గాలికి కొట్టుకుపోయాయి. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షరణకు చేసిన చట్టాలన్నీ నీటి మీద రాతలయ్యాయి. అడవి సంపదను గిరిజనుల నుంచి కొనడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంఘాలు, గిరిజనాభివృద్ధి ఏజెన్సీలు దోపిడీకి మారుపేర్లయ్యాయి. గిరిజనుల మీద పోలీసుల దమన నీతి పెరిగింది. దీనితో గిరిజనులు భూస్వాములకూ, ఫారెస్టు అధికారులకూ, పోలీసులకూ వ్యతిరేకంగా తిరగబడవలసి వచ్చింది. ఇలాంటి తిరుగుబాట్లన్నిటినీ ప్రభుత్వం.. గిరిజనులకూ గిరిజనేతరులకూ మధ్య జరిగిన ఘర్షణలుగా వక్రీకరించింది. కానీ గిరిజనుల పోరాటాలలో ఎన్నోసార్లు గిరిజనేతరులు కూడా పాల్గొన్నారు. ఈ పోరాటాలన్నీ కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలుగా తేలాయి.

ఇట్లా తమ న్యాయమైన హక్కుల కోసం, తమ మనుగడ కోసం గిరిజనులు చేస్తున్న పోరాటాలను సిపిఐఎంఎల్ [పీపుల్స్ వార్] వ్యవసాయ విప్లవం కింద సమీకరించింది. గిరిజన రైతుకూలీ సంఘం నాయకత్వాన గిరిజనులు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని తీవ్రతరం చేశారు. చంద్రవంకతో ఉండే గిరిజనుల, సాంప్రదాయకమైన ఎర్రజెండా [రగల్ జెండా] స్థానంలో సుత్తి, కొడవలి ఎర్రజెండా ఆదిలాబాద్ గిరిజన జనపదాల్లో ఎగిరింది. ఆక్రమణలో ఉన్న తమ భూస్వాములను గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొరలు, షావుకార్ల బంధనాల నుంచి వేల ఎకరాల భూమి విముక్తమయింది. తమ భూములను గుంజుకొని ఫారెస్టు అధికారులు వేసిన ప్లాంటేషన్లను సరికి భూములను దున్నుకున్నారు. అడవులను నరికి సాగు చేశారు. ఇలా కొత్తగా సాగులోనికి వచ్చిన భూమి 80 వేల ఎకరాలు. ఈ క్రమంలో వచ్చిన పోలీసు జులుంను కూడా ప్రజలు [గిరిజనులు గిరిజనేతరులు కలిసి] ధైర్యంగా తిప్పికొట్టారు.

ఈ పోరాట ఫలితాలను సమీక్షించుకోవడానికి గిరిజన రైతుకూలి సంఘం ఉట్నూరు తాలూకా ఇంద్రవెల్లి గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతుకూలి మహాసభ జరపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీ సాయంకాలం నాలుగు గంటలకు గిరిజన ప్రదర్శన, ఆరు గంటలకు బహిరంగ సభ ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా అంతటా గోండు, కొలామ్ తెలుగు భాషల్లో సోషర్లు పడ్డాయి. కరపత్రాలు పంచబడ్డాయి. ఈ ప్రదర్శనకు ముప్పై వేల మంది పైగా గిరిజనులు హాజరవుతారని అంచనా వేయబడింది. గంగవెర్రు లెత్తిన ప్రభుత్వ యంత్రాంగం ఈ సభను భగ్నం చేయ దలచింది. 'గిరిజనేతర రైతు సంరక్షణ సంఘం' సభ కూడా ఆనాడే ఉండడం వల్ల ఇంద్రవెల్లిలో గొడవ జరుగుతుందనే అనుమానంతో 144 సెక్షన్ పెడుతున్నానని ప్రకటించింది. కానీ నిజానికి అలాంటి సంఘమేదీ ఇద్రవెల్లిలో ఆనాడు సభ నిర్వహించడమే లేదు.

ఏప్రిల్ 18 నాటికి జిల్లా పోలీసు యంత్రాంగమంతా ఇంద్రవెల్లి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ [ఎపిఎస్‌పి] బెటాలియన్ ఒకటి కూడాఇంద్రవెల్లి చేరుకుంది. స్థానిక అప్పర్ ప్రైమరీ స్కూల్లో పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి ఇంద్రవెల్లి గ్రామానికి చుట్టూ 8 కిలోమీటర్ల దూరం పోలీసు వలయం ఉన్నారు. దుర్గమారణ్యాల మధ్య ఇంద్రవెల్లి ఆ రెండు రోజులూ ఖాకీ వనంగా మారిపోయింది. 19, 20 తేదీలు రెండు రోజులూ ఇంద్రవెల్లిలో అప్రకటిత కర్ఫ్యూ అమల్లో ఉన్నది. 20వ తేదీన ఆ ఊళ్లో కనబడిన తెల్లబట్టల మనుషులు ఇద్దరే ఇద్దరు ఒకరు ఆర్.డి.ఒ. ఇంకొకరు స్థానిక ఎమ్మెల్యే 20వ తేదీ ఉదయం నుంచీ మహాసభకు తరలి వస్తున్న జనాన్ని ఇంద్రవెల్లికి ఎనిమిది కిలోమీటర్ల అవతలి నుంచే తరిమి కొట్టడం ప్రారంభించారు అట్లా ఆనాడంతా ఇంద్రవెల్లిలోకి ఎవరినీ ప్రవేశించనివ్వలేదు. లాఠీ చార్జీలూ, బాష్పవాయు ప్రయోగాలూ ఆరోజంతా గిరిజన ప్రజానీకాన్ని ఇంద్రవెల్లి రాకుండా అడ్డుకున్నాయి. సాయంత్రం 5 గం॥లకు ఇంద్రవెల్లి మహాసభకు వస్తున్న జనం మీద పోలీసులు ఏ హెచ్చరికలు లేకుండా కాల్పులు సాగించారు. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయో లెక్క లేదు. ఎన్ని వందల మంది గాయపడ్డారో లెక్కలేదు. దాదాపు వందమంది గాయపడ్డారని, 50 మంది మరణిచారని తెలుస్తున్నది.

మరణించిన తమ కుటుంబ సభ్యుల కోసం ఏడిస్తే గుర్తు పడతారని ఎంతో మంది దుఃఖాన్ని లోలోపల దిగమింగారని ఒక పత్రిక రాసింది 24 శవాలను పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుండగా చూశానని ఒక ప్రత్యక్షసాక్షి చెప్పాడని ఇంకో పత్రిక రాసింది. మృతుల శవాలకు సాంప్రదాయం ప్రకారం పాతి పెట్ట వలసి ఉండగా, పాతి పెడ్తా మళ్ళీ ఎన్నడైనా విచారణలో తవ్వి తీస్తారనే భయంతో, సంఖ్యను మరుగు పరచే ఉద్దేశ్యంతో కలెక్టర్ శవాలను దహనం చేయించాడు. గిరిజన సాంప్రదాయాన్ని పాటించకుండా శవ దహనం చేసినందుకు కలెక్టర్‌పై చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.

వీరోచితంగా నిజాం వ్యతిరేక పోరాటం సాగించిన గోండు నాయకుడు కొమురం భీం వారసత్వాన్ని, శ్రీకాకుళ ప్రథమ అమరవీరులు కోరన్న, మంగన్న, రెంజింల వారసత్వాన్ని అందుకున్న ఈ 50 మంది గిరిజన కామ్రేడ్‌కు వర్గ కసితో పదును పెట్టిన లాల్ సలామ్ తెలుపుతున్నాం. ఈ 50 మంది గిరిజన కామ్రేడ్స్ పెట్టిన నెత్తుటి అప్పును చివరి నెత్తుటి బొట్టును ధార పోసైనా తీరుస్తామనీ, ఈ దుర్మార్గ వ్యవస్థను కూలదోస్తామనీ మాతృభూమి ముందు శపథం చేస్తున్నాం." ఈ సంఘటనపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాల్సిందిగా, దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ సంఘటనపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయ విచారణను తలకిందులు చేసే ప్రమాదం ఉంది కనుక విచారణ జరిగినన్ని రోజులూ ఈ హత్యాకాండకు బాధ్యులైన జిల్లా ఎస్‌పి, ఏఎస్‌పిలతో సహా పోలీసు అధికారులందరిని సస్పెండ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు గిరిజనుల శవాలు పీక్కుతింటూ మరోవైపు గిరిజన సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలు ప్రకటిస్తున్న ప్రభుత్వ కపట నీతిని త్రీవంగా ఖండిస్తున్నాం.

(రాడికల్ విద్యార్థి, యువజన సంఘం (23-4-81)’’

Tags:    

Similar News