చిగురించనున్న చిత్తడి నేలలు
ఆంధ్రప్రదేశ్‌లో చిత్తడి నేలల గుర్తింపు, రక్షణ, పర్యాటకం కోసం భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
Byline : Vijayakumar Garika
Update: 2025-10-15 04:39 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సంపదలో భాగమైన చిత్తడి నేలలు భవిష్యత్ తరాలకు వారసత్వంగా మిగలనున్నాయి. ఈ నేలలు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, భూగర్భజలాలను పెంచి, పర్యాటక రంగాన్ని వికసింపజేసే చేసే విధంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది చిత్తడి నేలలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 16 చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది దక్షిణ భారత చరిత్రలో ఒక రికార్డు సృష్టించనుంది!
సోంపేటలో ..
ఉత్తరాంధ్రలోని సోంపేట, తవిటి మండలాల్లో వేల ఎకరాలుగా విస్తరించిన పెద్ద బీల, చిన బీల, తుంపర చిత్తడి నేలలు ప్రకృతి అద్భుతాలు. ఈ మూడింటినీ ఒకే కారిడార్‌గా అనుసంధానించి, భారీ ఎకో–టూరిజం ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. 2018లో ఈ ప్రాంతాలు ఆక్రమణలకు గురైన సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు అధికారిక రక్షణతో వాటిని పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోనున్నారు. గుర్తింపు పూర్తయిన వెంటనే, ఇక్కడ పర్యాటకులకు సైక్లింగ్ ట్రెయిల్స్, బర్డ్ వాచింగ్ స్పాట్లు, స్థానికులకు ఉపాధి అవకాశాలు – అన్నీ సిద్ధమవుతాయి. ఇది పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థిక వృద్దికి దోహదపడనుందని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్టేట్ వెట్‌ల్యాండ్ అథారిటీ సమావేశం ఈ ప్రణాళికలకు బలం చేకూర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్రంలోని 23,450 చిత్తడి నేలల్లో 99.3 శాతానికి డిజిటల్ సరిహద్దులు గుర్తించారు. ఈ నెల 28లోపు భౌతిక సరిహద్దులు పూర్తి చేయడానికి అటవీ, రెవెన్య రెవెన్యూ, సర్వే విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుండి, ఒకేసారి 16 నేలలకు టెక్నికల్, గ్రీవెన్స్ కమిటీల ఆమోదం లభించడం ఆంధ్ర విశిష్టత.
పక్షుల స్వర్గాలు, అంతర్జాతీయ గుర్తింపు
అనంతపురం జిల్లాలోని వీరాపురం, రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రం చిత్తడి నేలలు అరుదైన పక్షి జాతులకు ఆశ్రయం. ఇక్కడ ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద చిత్తడి నేల కొల్లేరు ఇప్పటికే రాంసర్ గుర్తింపు పొందింది. దీని పరిరక్షణకు ప్రత్యేక ’కొల్లేరు లేక్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మిగతా నేలలకు కూడా అంతర్జాతీయ రాంసర్ స్థాయి గుర్తింపు తేవడానికి అటవీ వన్యప్రాణి విభాగం కృషి చేస్తోంది. ఈ చిత్తడి నేలలు కేవలం నీటి నిల్వలు మాత్రమే కాదు – జీవవైవిధ్యం, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఈ దిశలో చూపిన చైతన్యం దేశానికే ఆదర్శంగా నిలువనుంది.