పారిశుధ్య కార్మికుల జీతాలపై కేబినెట్‌లో చర్చిస్తాం
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కార్మికుల జీతాలు పెంచడం చేయగలుతాను అని పవన్ కల్యాణ్ అన్నారు.;
పారిశుధ్య కార్మికుల జీతాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కార్మికుల జీతాలు పెంచడం అయితే తాను చేయగలుగుతానని, అందరికీ పెంచాలంటే దానిపైన కేబినెట్‌లో చర్చించాల్సి ఉంటుందని, అలా చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి కేంద్రాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద మొక్కను నాటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం గ్రామ స్థాయిలో సేకరించిన చెత్త వివిధ నిర్వహణ క్రమాన్ని పరిశీలించారు. మొదట పళ్లు, కూరగాయల వ్యర్ధాల నిర్వహణను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల రీ సైక్లింగ్, శానిటరీ వేస్ట్ మేనేజ్ మెంట్ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యర్ధాలతో వర్మి కంపోస్ట్ తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న మూడు రకాల బుట్టలను అధికారులు పవన్ కల్యాణ్‌కు చూపారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు విష పూరిత వ్యర్ధాలను వేరు చేసేందుకు ఇంటికి మూడు చెత్త బుట్టలు ఇస్తున్నట్టు తెలిపారు. చెత్త నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల యంత్ర పరికరాల పనితీరుని పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు.