గోదావరిని వంశధారలో కలిపి పెన్నా వరకు తీసుకెళ్తాం
విద్యుత్ చార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే గోదావరి జలాలను కృష్ణా నదిలోకి కలిపామని, రానున్న రోజుల్లో గోదావరిని వంశధారకు కలిపి వాటిని పెన్నా వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం ’రైతన్నా... మీ కోసం‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయ యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. ప్రధాన పంటలు, అంతర పంటలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి భద్రత విషయంలో మెరుగైన చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చనే అంశంపై రైతుల సలహాలు కోరారు. మెరుగైన సాగు విధానాలను పాటించి వ్యవసాయం చేసిన రైతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తల చెప్పిన సూచనలను రైతులు పాటించాలని సూచించారు. ధరలు బాగా ఉన్నాయి కాబట్టి అదే పంటను వేయడం కాదు, సైంటిఫిక్‌గా ఆలోచించి ఏ పంట వేయాలో ఆ పంటే వేయాలని అన్నారు.
నేను రైతుబిడ్డనే ఒకప్పుడు వ్యవసాయం చేసేవాడిని, ఇప్పుడు పరిపాలన చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. భూగర్భ జలాలు పెంచే మార్గాలు చూడాలని, పోలవరం, తాడిపూడి లిఫ్ట్ పథకాల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. ఎరువుల వినియోగం తగ్గేలా చూడాలని, మైక్రో న్యూట్రియన్స్ వినియోగిస్తే ప్రీమియం ధర వస్తుందని సూచించారు. ఎన్టీఆర్ హయాంలో మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తెచ్చామని, ఆ తర్వాత పామాయిల్ ధరలు లభించకపోతే నేనే ధరలు కల్పించేలా చేశానని చంద్రబాబు వివరించారు. మెట్ట ప్రాంతాలంటే ఒకప్పుడు చాలా చిన్నచూపు, డెల్టా అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారని, ఇప్పుడు మెట్ట ప్రాంతాలకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. పామాయిల్ వేస్ట్‌ను ఎరువుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
పాడి రైతులందరికీ అవసరమైన గడ్డి కోసం ఉమ్మడిగా కొంత స్థలంలో గడ్డి వేసుకోండని, గడ్డి పెంపకం కోసం నరేగా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పామాయిల్ పొలాల మధ్య ఉన్న కరెంట్ పోల్స్ పక్కకు మారుస్తామని, వ్యవసాయం, ఉద్యాన పంటలు పండించడంతోపాటు వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. ప్రతి ఇంటికీ పారిశ్రామిక వేత్త అనేది ప్రభుత్వ విధానమని, రైతులు కూడా వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టుకోవాలని, ప్రభుత్వం ప్రొత్సహించడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నెలకొల్పాలని, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని, రైతులు పారిశ్రామిక వేత్తలవ్వాలని సూచించారు. రైతుల్లో చాలా మంది చదువుకున్న వారు ఉన్నారని, వ్యవసాయ రంగంతో పాటు సర్వీస్ రంగంలో కూడా రైతులు భాగస్వాములు కావాలని తెలిపారు.
గత ప్రభుత్వ విధానాలతో రైతులందరూ ఇబ్బందులు పడ్డారని అన్నారు. రెవెన్యూలో జరిగిన అవకతవకలపై మరింత ఫోకస్ పెడుతున్నానని, జగన్ మోహన్ రెడ్డి చేసిన ల్యాండ్ గోల్మాల్‌ను సరి చేసేందుకే ఎక్కువ సమయం పెడుతున్నానని చెప్పారు. గత పాలకులు భూముల విషయంలో చాలా దౌర్జన్యాలు చేశారని, తాము కోరుకున్న భూములు ఇవ్వకుంటే వాటిని 22-ఏలో పెట్టేశారని వివరించారు. వీటన్నింటినీ సరి చేసేలా నేను ప్రయత్నిస్తున్నానని, గత ప్రభుత్వం వైఖరి వల్ల రాష్ట్ర మొత్తం విధ్వంసానికి గురైందని, అభద్రతా భావంలోకి వెళ్లిపోయారని అన్నారు. వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని నాటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని, ఆ తర్వాత బీజేపీ కూడా కలిసిందని చెప్పారు. గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించేలా తీర్పును ప్రజలు ఇచ్చారని తెలిపారు.
గతానికంటే రెండు రెట్లు అభివృద్ధి-సంక్షేమం చేస్తానని ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చానని, నాడు చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అన్నదాత సుఖీభవ అమలు చేశామని చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా అందరికీ రూ. 15 వేలు ఇచ్చామని, దివ్యాంగులకు పెన్షన్లు పెంచామని, మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు ఇస్తున్నామని వివరించారు. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీపం-2.0 పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నామని, అన్ని వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమం ఇస్తున్నామని చెప్పారు. గోతుల పడ్డ రోడ్లను పూడుస్తున్నామని, సంక్రాంతి నాటికి రోడ్లపై గోతులు లేకుండా చేస్తామని తెలిపారు. చరిత్రను గుర్తు పెట్టుకోవాలని, భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.
విభజన, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అన్నట్టుగా మారిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ జెండాలో నాగలి గుర్తు ఉండేలా ఎన్టీఆర్ జెండా రూపకల్పన చేశారని, వ్యవసాయమే మన బలమని, దాన్ని మరింత బలపరుచుకోవాలని తెలిపారు. వ్యవసాయాన్ని మరింతగా బలోపేతం చేసుకునేలా పంచసూత్రాలను అమలు చేస్తున్నామని, పంచసూత్రాలను ప్రతి రైతూ ఆచరించాలని సూచించారు. వృధాగా సముద్రంలోకి పోతున్న జలాలను వినియోగించుకునేలా నదుల అనుసంధానం కార్యక్రమం చేపట్టామని, పోలవరం ద్వారా మీ పొలాలకు కాల్వల ద్వారా నీళ్లందిస్తామని చెప్పారు. తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని వివరించారు.
పంచసూత్రాల మీద అవగాహన కల్పించేందుకే రైతన్నా... మీ కోసం పేరుతో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రచారం చేపట్టామని తెలిపారు. రైతులకు సాగులో ఆదాయం రావాలని, రైతుల సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం అవసరమని చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చానని, దానికి అనుగుణంగానే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
రాజధాని అమరావతిలో 30 శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, 133.3 కి.మీల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించామని సీఎం అన్నారు. ఇందుకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని, శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని, సీజన్‌లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. 22 రోడ్లలో రెండు వైపులా బఫర్ జోన్‌లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. రైతుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని, ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్‌లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని రైతులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నామని, భూములిచ్చిన రైతులకు ఇంకా 719 ఎకరాల మేర ప్లాట్‌లు కేటాయించాల్సి ఉందని వివరించారు. 29 గ్రామాల పరిధిలో భూసమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాళ్టికీ విజ్ఞప్తి చేస్తున్నామని, రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తామని తెలిపారు. సీఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.