మత్తు వదలాలంటే వకుల్ 'వజ్రాయుధం' ప్రయోగించాల్సిందే!

విద్యార్థులను డ్రగ్స్‌కు దూరం చేయాలని తాపత్రయం. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు. విజయనగరంలో ఎస్పీ జిందల్ వినూత్న ప్రయోగం.

By :  Admin
Update: 2024-10-08 03:47 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

మాదక ద్రవ్యాల మత్తులో పడి యువత, విద్యార్థులు తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. వీటికి బానిసలుగా ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆ ఐపీఎస్ ఇతర ఐపీఎస్ ల్లా నడచుకోలేదు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఓ సత్సంకల్పానికి నడుం కట్టారు. డ్రగ్స్కు బీజం పడుతున్న చోట నుంచే కట్టడి చేస్తే మంచి ఫలితాలొస్తాయని భావించారు. తాను ఎస్పీగా విధులు చేపట్టిన కొద్దిరోజుల నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దానికి 'సంకల్పం' ఆని పేరు పెట్టారు. ఆ ఐపీఎస్ అధికారి పేరు వకుల్ జిందల్. విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలోనూ వకుల్ జిందల్ విధానాలను అనుసరించేలా చర్యలు చేపడుతున్నారు.

రెండు నెలల క్రితం బాపట్ల జిల్లా నుంచి విజయనగరానికి ఎస్పీగా వచ్చారు వకుల్ జిందల్. విజయనగరం జిల్లాలో గంజాయి ప్రభావం ఇక్కడి విద్యార్థులపై ఉందని అనతి కాలంలోనే గుర్తించారు. మాదక ద్రవ్యాల సేవనం వల్ల వారితో పాటు తల్లిదండ్రులు ఎలాంటి క్షోభకు గురవుతున్నారో అవగతం చేసుకున్నారు. తక్షణమే కార్యాచరణకు రంగంలోకి దిగారు. పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా డ్రగ్స్ వల్ల వాటిల్లే అనర్థాలను విద్యార్థులకు వివరించడానికి కాలేజీలను ఎంచుకున్నారు. తొలుత డ్రగ్స్ అలవాటున్న వారిని గుర్తిస్తున్నారు. ఇందుకోసం లఘు చిత్రాల ప్రదర్శన, డ్రగ్స్పై ప్రత్యేకంగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇందులో మాదక ద్రవ్యాల అలవాటెలా అవుతుంది? ఎలా సేవిస్తారు? ఎందుకు తీసుకుంటారు? వీటితో చదువులు, కుటుంబ సంబంధాలు ఎలా నాశనమవుతాయి? ఆర్థికంగా ఎలా నష్టపోతారు? న్యాయపరంగా ఏ చిక్కులు ఎదుర్కొంటారు? ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారకులు కావడం వంటివి సమగ్రంగా విశదీకరిస్తున్నారు. తన సంకల్పాన్ని 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. అవేమిటో ఆయన మాటల్లోనే..

'నేను ఐఐటీ ఢిల్లీలో చదువుకుంటున్న రోజుల్లో తెలివైన నా సహ విద్యార్థులు కొందరు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. దీంతో వారు ఎదగాల్సిన స్థాయిలో ఎదగలేకపోయారు. ఉన్నత అవకాశాలను చేజార్చుకున్నారు. నేను ఐపీఎస్కు ఎంపికయ్యాక విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలన్న ఆలోచన కలిగింది. నేను తొలిసారి బాపట్ల ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక దానిపై ఫోకస్ పెట్టాను. సఫలీకృతమయ్యానన్న తృప్తి కలిగింది. విజయనగరం జిల్లాకు ఎస్పీగా వచ్చాక ఇక్కడ బాపట్లకంటే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల ప్రభావం విద్యార్థులపై ఎక్కువగా ఉందని గమనించాను. డ్రగ్స్పై కాలేజీ దశలోనే అవగాహన కల్పించడం ద్వారా చాలావరకు నియంత్రించవచ్చని నెల రోజుల క్రితం ఆ దిశగా చర్యలు చేపట్టాను. జిల్లాలోని అన్ని ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో దీనిపై

అవగాహనకు శ్రీకారం చుట్టాను. డ్రగ్స్ సేవించడం వల్ల క్యాన్సర్, గుండెపోటు, హెపటైటిస్ బి, సీ, కీళ్ల నొప్పులు, అనారోగ్య జననాలు, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు, మానసికంగా డిప్రెషన్ వంటి అనర్థాలున్నాయి. వీటికి బానిసలైన వారు కుటుంబ సభ్యులు, స్నేహితులకు, సమాజానికి దూరమైపోవడం నేరాలకు పాల్పడడం, చదువులో రాణించలేక పోవడం, నేర చరిత్రతో వీసా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్యం పాలైతే చికిత్సకు, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కావడం, డ్రగ్స్ మూలంగా ఉద్యోగం లేదా పని దినాలను కోల్పోవడం, ఖరీదైన డ్రగ్స్ కొనుగోలుకు అప్పుడు పాలవడం డ్రగ్స్ వినియోగించినా, కలిగి ఉన్నా గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుందని తెలియజేస్తున్నాం.

డ్రగ్స్ బానిసల లక్షణాలిలా..

డ్రగ్స్కు బానిసలైన వారు వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాలకు గురై మరణించడమో, ఇతరుల మరణాలకు కారణమవుతారని చెబుతున్నాం. డ్రగ్స్ అలవాటున్న వారు నిద్రలేమి, చర్మ వ్యాధులు, ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడం, బరువు హెచ్చుతగ్గులు, మానసిక స్థితి బాగులేకపోవడం, ఒంటరిగా, రహస్యంగా జీవించడం, అబద్దాలు చెప్పడం, స్థిరమైన ఆలోచనలు లేకపోవడం, చోరీలకు పాల్పడడం, ఇతరులతో విభేదించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని విద్యార్థులకు తెలియజేస్తున్నాం.

 

ఎలా బయట పడాలో కూడా..

డ్రగ్స్కు అలవాటు పడ్డవారు ఆ మహమ్మారి నుంచి ఎలా బయట పడాలో కూడా పోలీసులు సూచిస్తున్నాం. మిత్రులు, బంధువుల ఒత్తిడికి తలొగ్గి డ్రగ్స్ సేవించ వద్దని, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని, ఖాళీ సమయాన్ని మంచి పనులకు కేటాయించాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు ఏర్పరచుకోవాలని, డ్రగ్స్ నుంచి విముక్తి కోసం ఇతరుల సాయం తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఒత్తిడి దూరం చేసుకోవడం, ఆహ్లాదకర వాతావరణంలో గడపడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం, ఆరోగ్యకరమైన తిండి, సంభాషణలు, స్నేహితులతో గడపడం వంటివి చేయాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఇంకా కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కాలేజీ యాజమాన్యం, పోలీసు అధికారులను భాగస్వామ్యం చేస్తున్నాం. విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ఆయా కాలేజీలకు డ్రగ్స్ అవేర్నెస్ కాలేజీగా సర్టిఫికెట్లను ఇస్తున్నాం.

కాలేజీల్లో డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి దాని నుంచి బయట పడేయడానికి కౌన్సిలింగ్, డీ అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందించి, వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నాం. ఇంకా కాలేజీలు, జనసంచార ప్రాంతాల్లో 'సంకల్పం' పేరిట డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నాం. డ్రగ్స్ చిన్న మొత్తాల్లో విక్రయించే వారిని, వినియోగించే వారిని, రవాణా చేస్తున్న వారి సమాచారాన్ని పోలీసులకు నేరుగా చెప్పడానికి వెనకడుగు వేసే వారు ఈ బాక్సుల్లో వేయాలని సూచిస్తున్నాం. అలాగే డ్రగ్స్ వ్యసనం నుంచి బయట పడటానికి ఎక్కడికెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ బాక్సుల్లో సమాచారం అందిస్తే వారికి కౌన్సెలింగ్, చికిత్సలను డీఅడిక్షన్ సెంటరు ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నాం.

డ్రగ్స్‌పై అవగాహనకు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడంతో పాటు సినిమా థియేటర్లలో స్లైడ్లను ప్రదర్శిస్తున్నాం. మలిదశలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తాం. గంజాయి రవాణాను అరికట్టడానికి జిల్లాలో ఇప్పుడున్న చెక్పోస్టుతో పాటు మరో నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి రవాణా వాహనాల తనిఖీకి రోజూ 9-10 చోట్ల ర్యాండమ్ చెకింగ్లు చేపట్టాం..' ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 20 గంజాయి కేసులు నమోదైతే.. తాను వచ్చిన ఈ రెండు నెలల్లో 38 కేసులు బుక్ చేశామని, 133 మందిని అరెస్టు చేశామని, 655 కేజీల గంజాయి, 10 వాహనాలను సీజ్ చేశామని ఎస్పీ జిందల్ వివరించారు.

గూగులే నా తెలుగు గురువు!

పంజాబ్కు చెందిన వకుల్ జిందల్ 2016లో ఐపీఎస్కు ఎంపికయ్యాక ఏపీ క్యాడరుకు కేటాయించారు. దీంతో ఆయనకు తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం ఆయన ముందుగా తెలుగు వినడం, మాట్లాడంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత రాయడం, చదవడం కూడా నేర్చుకున్నారు. ప్రతిరోజూ తెలుగు పత్రికల మొదటి పేజీలను చదవడం ద్వారా ఆయన తెలుగు భాషపై పట్టు సంపాదించారు. ఇప్పుడాయన స్వచ్చమైన తెలుగులో తడుముకోకుండా మాట్లాడుతున్నారు. రాయడంలో గూగుల్ తనకు ఎంతో సహకరించిందని, అందుకే తనకు గూగులే తన తెలుగు గురువని చెబుతారు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్!

Tags:    

Similar News