బదిలీ కావాలా, ఇంకా 18 రోజులే ఛాన్స్!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి మార్గదర్శకాలు ఇలా;

Update: 2025-05-16 10:43 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు.
ఏపీలో జూన్ 3వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది. మే 16 నుంచి జూన్‌ 2లోగా బదిలీ ప్రక్రియ పూర్తి కావాలి. తాజా బదిలీల నుంచి ఉపాధ్యాయులు, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిని మినహాయించారు.
మే 31వ తేదీ నాటికి ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా వారు పనిచేసే స్థానాల నుంచి బదిలీ కావాల్సి ఉంటుంది. ఐదేళ్లు పూర్తికాని ఉద్యో గులు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదిలోపు అంటే 2026 మే 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులను బదిలీ చేయరు. వారు ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నా ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తారు. రిటైర్మెంట్‌ దగ్గర పడిన అభ్యర్థులు స్వయంగా కోరుకున్నా, పరిపాలన కారణాలతో బదిలీ చేయొచ్చు.
ఉద్యోగి బదిలీ కోసం ఒక చోట అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని యూనిట్‌గా పరిగణిస్తారు. ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం గ్రామంలో ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. ఒకే కార్యాలయం అనే నిర్వచనం ఐదేళ్ల నిబంధనకు వర్తించదు.
ఉద్యోగుల బదిలీల్లో కంటి చూపు సమస్యలు ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని కలిగి ఉన్న ఉద్యోగులకు వారికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న నగరం, పట్టణానికి బదిలీ కోరితే ప్రాధాన్యమిస్తారు. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.
ఉద్యోగితో పాటు , ఉద్యోగి జీవిత భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరోసర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సదుపాయాలున్న చోటుకు బదిలీకి ప్రాధాన్యం ఇస్తారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు.
పదోన్నతిపై బదిలీ తప్పనిసరి
పదోన్నతి పొందాల్సిన ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు.బదిలీ కావాల్సిన స్థానంలో పదోన్నతికి సంబంధించిన పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారు.దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయిస్తారు.ఉద్యోగి స్వయంగా బదిలీ కోరితే, సాధ్యమైనంత వరకు వారు ఎంపిక చేసుకున్నచోట ఖాళీ ఉంటే అవ కాశం కల్పించవచ్చు.
దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే, వారిని ఒకేచోట లేదా దగ్గరగా ఉండే చోట్ల నియమించేలా బదిలీ చేయాలి.
ఏజెన్సీలకు ప్రాధాన్యత..
నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీల భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గ దర్శకాల్లో సూచించింది. ఐటీడీఏల్లో ఉద్యోగుల బదిలీలు పూర్తైన తర్వాత నాన్-ఐటీడీఏ పోస్టులు నింపాలి. ఐటీడీఏ ప్రాంతాలతోపాటు మారుమూల, వెనకబడిన ప్రాంతాల్లోని ఎక్కువ ఖాళీలున్న ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ఐటీడీఏ ప్రాంతాల్లోని లోకల్, జోనల్ క్యాడర్లలో పనిచేసే ఉద్యోగుల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారిని ఎంపిక చేసుకున్న స్టేషన్ కు బదిలీ చేయొచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఏళ్ల లోపు వారినే నియమించాల్సి ఉంటుంది.
ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పనిచేయని వారిని, మైదాన ప్రాంతాల్లో వాళ్ళు పని చేసిన కాలాన్ని అవరోహణ క్రమంలో పరిగణలోకి తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి.
ఐటీడీఏ ప్రాంతం నుంచి బదిలీ అయిన వారి స్థానంలో... బదిలీపై వచ్చే అధికారి రిపోర్ట్ చేసిన తర్వాతే వారిని రిలీవ్ చేస్తారు. నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్ట్ చేయాలి. అలా చేయకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్/మండల స్థాయి నేతలకు మూడు టర్మ్‌లకు మినహాయింపు ఉంటుంది. ఆఫీస్ బేరర్లకు మూడు విడతలు పూర్తయ్యే వరకు లేదా ఒకే స్టేషన్లో 9 ఏళు పూర్తయ్యే వరకు కానీ బదిలీ చేయకూడదు. తాలూకా, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్ల జాబితా సంబంధిత కలెక్టర్ ద్వారా హెచ్‌ఓడిలకు పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర సంఘం జాబితాను జీఏడీ ద్వారా మాత్రమే రాష్ట్రస్థాయి హెచ్‌ఓడీలకు పంపాల్సి ఉంటుంది.
ప్రతి శాఖలో బదిలీల కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి, అభ్యర్ధనలు పరిశీలించి ఉన్నతాధికారికి తగిన సిఫార్సులు చేయాలి. బదిలీ ప్రక్రియకు ఆయా విభాగాధిపతులే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. బదిలీ ప్రక్రియ పారదర్శకంగా, నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలు, ఫిర్యాదులకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత విభాగాధిపతులపై ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే  తీవ్రంగా పరిగణిస్తారు.
Tags:    

Similar News