చంద్రబాబు మరో స్వీట్ డ్రీమ్- వికసిత ఆంధ్ర విజన్-2047!
'ఆశ లావు పీక సన్నం' అని తెలుగులో ఓ పాత సామెతుంది. ఆ మాదిరిగా చంద్రబాబు తెచ్చిన ఏ విజన్ డాక్యూమెంటూ పట్టాలెక్కకుండానే పక్కకుపోతున్నాయి.
By : Amaraiah Akula
Update: 2024-08-07 01:30 GMT
1999.. అన్నమో రామచంద్రా అని రాష్ట్రం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) అల్లాడుతున్న కాలంలో చంద్రబాబు 'విజన్ డాక్యుమెంటు-2020' వచ్చింది.
2014.. ఉమ్మడి రాష్ట్రం ముక్కలైన తర్వాత చంద్రబాబు తెచ్చిన 'సన్‌రైజ్ ఏపీ విజన్- 2029' తెరపై రెపరెపలాడింది.
2024.. మిగిలి పోయిన ఆంధ్రప్రదేశ్ కి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు 'విజన్ డాక్యుమెంటు వికసిత ఆంధ్ర-2047' దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
ఇవేగాక శ్వేతపత్రాలు, డాక్యుమెంట్లు, కమిషన్లు, ప్లాన్లు, ప్రణాళికలు వంటివనేకం ఆయన ఖాతాలో ఉన్నాయి. 1996లో జన్మభూమి, 1997లో క్లీన్ అండ్ గ్రీన్, 1998లో ది గ్రేట్ హైటెక్ సిటీ, 2014లో స్వర్ణాంధ్రప్రదేశ్, 2015లో సీఆర్డీఏ వంటివెన్నో తెచ్చారు. 2014 జూన్ 2 రాష్ట్రం విడిపోయింది. 23 జిల్లాల రాష్ట్రం 13కి పరిమితమైంది. అటువంటి చిన్న రాష్ట్రాల్లో విజన్ డాక్యుమెంట్లను అమలు చేయాలంటే బోలెడంత నిజాయితీ, నిక్కచ్చితనం, జవాబుదారీ తనం, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందువల్లే- చిన్నదైనా సింగపూర్ మెరిసింది. ఆధునిక, సంపన్న దేశమైంది. కేరళ చిన్నదే అయినా "విజన్ 2030" దిశగా సాగుతోంది. రాష్ట్రాన్ని విజ్ఞాన ఆధారిత సమాజంగా మార్చాలని కంకణం కట్టుకుంది. పూర్తిగా సాధించనప్పటికీ విద్య, వైద్యం, ఐటీ వంటి మౌలిక రంగాలో దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అండదండలతో గుజరాత్ "విజన్ 2020"తో దేశంలోనే అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటైంది. చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. ఇక, మన పక్కనే ఉన్న తమిళనాడు "విజన్ 2023"తో రాష్ట్రాన్ని నిలకడైన అభివృద్ధికి కేంద్రంగా మారింది. ఐటీ, ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సాధించింది.
విజన్ 2020 ఏమైందీ...
చంద్రబాబు విజన్ 2020.. పాక్షిక విజయాన్ని సాధించింది. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి తోడ్పడింది. 2014లో తెచ్చిన సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఏపీ విజన్- 2029 కొత్త రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పునాదులు వేసే వరకు తెచ్చింది. విజన్-2029లోని ప్రత్యేక హోదా సహా అన్నీ కవిలకట్టల్లోకి చేరాయి. నాయుడి విజన్ డాక్యుమెంట్ల సదుద్దేశాల పట్ల ఎవరికీ ఎటువంటి కుశంకలు లేకపోయినా అవి అమలు కాకపోవడమే ఒకింత బాధాకరం. బాబు కృషి బూడిదలో పోసిన పన్నీరవుతుందేనని విచారం. జనం కట్టిన పన్నులు వృధా అవుతున్నాయేనని దిగులు.
'ఆశ లావు పీక సన్నం' అని తెలుగులో ఓ పాత సామెతుంది. ఆ మాదిరిగా చంద్రబాబు తెచ్చిన ఏ విజన్ డాక్యూమెంటూ పట్టాలెక్కకుండానే పక్కకుపోతున్నాయి. ఇవేవీ తన పదవీ కాలంలో గాడిన పడడం లేదు. ఎంతో 'దూరదృష్టి'తో వాటిని తయారు చేయిస్తారో అంతే వేగంగా విమర్శలొస్తుంటాయి. 1999లో విజన్ 2020 తెచ్చినప్పుడు కమ్యూనిస్టులు తెగ విరుచుకుపడ్డారు. ప్రపంచ బ్యాంకు సృష్టన్నారు. ఆయన్ని ప్రపంచ బ్యాంకు ఏజెంటన్నారు. ఊరూరా మీటింగ్ లు పెట్టారు. కయ్యానికి కాలుదువ్వారు. బషీర్ బాగ్ విద్యుత్ కాల్పుల దాకా తీసుకొచ్చారు. పదవి నుంచి దించేదాకా పోయారు.
విజన్-2029లోనూ అదే జరిగింది..
విజన్- 2029 తెచ్చినపుడూ అదే జరిగింది. కాకపోతే ఈసారి కాల్పులు జరగలేదు. పాత్రలు మారాయి. కమ్యూనిస్టులకు బదులు వైఎస్ జగన్ ఆ పాత్ర పోషించారు. చంద్రబాబును ఓడించి ఆయన విజన్ ను కట్టకట్టి కృష్ణానదిలో విసిరేశారు. ఇవన్నీ పక్కన పెట్టినా చంద్రబాబు 'స్వీట్ డ్రీమ్' నెరవేరలేదన్నది వాస్తవం. దానికి ఓ ఐదారు కారణాలు చెబుతారు నిపుణులు.
1. అమలుకు ఆమడ దూరంలో: నాయుడు విజన్ డాక్యుమెంట్లు ఆచరణకు అనువుగా ఉండవన్న విమర్శలున్నాయి.
2. టెక్నాలజీపై మోజు ఎక్కువ: చంద్రబాబు విజన్ డాక్యుమెంట్లులో అభివృద్ధికి సంబంధించిన అంశాల కంటే సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వడం, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు(ఏఐ) వంటి వాటికి పెద్దపీట వేసి ప్రజాభాగస్వామ్యాన్ని పక్కన బెట్టడం, జనం అవసరాలను పట్టించుకోకపోవడం
3. సామాన్యులకు అందుబాటులో లేకపోవడం: చంద్రబాబు దార్శనిక పత్రాల్లో పౌరులు ప్రత్యేకించి పేద సాదలకు, అట్టడుగు వర్గాల అవసరాలు తీర్చే వాటికి బదులు స్థితిమంతులకు పనికి వచ్చేవి ఉంటాయనే విమర్శలు.
4. అంతుబట్టని పదజాలం- ఇన్ క్లూజివ్ గ్రోత్, గ్రోత్ కారిడార్, శాచ్యురేషన్ రేటు, గ్రోత్ రేటు, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెన్డీచర్ వంటి (మచ్చుకు కొన్ని మాత్రమే) మాటలు సామాన్యులకు ఎప్పటికీ అర్థం కావేమో. మనదేదో అమెరికా, బ్రిటన్ లాగా బాగా అభివృద్ధి చెందిన దేశమైనట్టు, వాటి పుట్టుపూర్వోత్తరాలేవో మనకు తెలిసినట్టు రాస్తుంటారు. బ్యూరాక్రసీలో వాడే భాష ఇప్పటికీ సామాన్యులకు బ్రహ్మపదార్థమనే విషయాన్ని మర్చిపోతుంటారు.
5. అంతా రాజకీయమే: ఈ దార్శనిక పత్రాల్లో దూరదృష్టి కన్నా రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ. రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత రాజకీయ పార్టీల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయనే విమర్శ.
6. వివరాలు లేకపోవడం: ఈ పత్రాలను ఎందుకు తెస్తున్నారో వీటి ప్రయోజనమేంటో ఎక్కడా స్పష్టత ఉండదు. ఊక దంపుడు వ్యాసాలతో పుంకాను పుంకాలుగా పేజీలు నింపినట్టుంటే జనానికి విసుగుతెప్పిస్తుంటాయి. అందుకే ఇవి ఆచరణాత్మక చిక్కులను ఎదుర్కొంటుంటాయి.
అభివృద్ధి కంటే ప్రచార ఆర్భాటమే ఎక్కువా?
1999లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రబాబు నాయుడు విజన్- 2020ని అందరూ "స్వీట్ డ్రీమ్స్"గా అభివర్ణించారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను "నాలెడ్జ్ హబ్"గా "సింగపూర్ ఆఫ్ ఇండియా"గా మారుస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ, బయోటెక్నాలజీకి హబ్‌గా మార్చడం వంటి అనేక వాగ్దానాలు ఇచ్చినా నెరవేరలేదు. కొన్ని సానుకూల ప్రభావాలున్నా రాష్ట్రం ఇప్పటికీ పేదరికం, నిరుద్యోగం, కనీస సౌకర్యాల కొరతను ఎదుర్కొంటూనే ఉంది.
ఏదేమైనా విజన్ డాక్యుమెంట్ ప్రభావం పరిమితం. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కంటే ఎక్కువగా మార్కెటింగ్ ప్రచారానికే బాగా తోడ్పడింది. చంద్రబాబు నాయుడు విజన్ 2020ని విమర్శిస్తూ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (EPW)లో ఆనాడు వచ్చిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. ఈ విజన్ డాక్యుమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉందని, అయితే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నది ఆ వ్యాసం సారాంశం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తన పాత డాక్యుమెంట్‌ను సన్‌రైజ్ ఏపీ విజన్ 2029 పేరుతో వెర్షన్ 2.0కి అప్‌డేట్ చేశారు. ఐదేళ్లు తిరిగే సమయానికి అది అటకెక్కింది. చంద్రబాబు ప్రభుత్వ పతనంతో వైఎస్ జగన్ పాలన 2019 నుంచి మొదలైంది. సన్ రైజ్ ఏపీ 2029, రాజధాని అమరావతి సహా పాత ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి.
అక్కడ వికసిత భారత్ ఇక్కడ వికసిత ఆంధ్ర...
2024 జూన్ లో తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ విజన్- 2047 తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా ఓపాతికేళ్ల కాలానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు నరేంద్ర మోదీ ప్లాన్ సిద్ధం చేస్తుంటే అందులో భాగం కావలని చంద్రబాబు తలపెట్టారు. చరిత్రను తిరగరాసే అరుదైన అవకాశం వచ్చిందంటున్నారు చంద్రబాబు. అంతా బాగుంటే 2024 అక్టోబర్ 2 ప్రధానమంత్రితో ఈ విజన్ డాక్యుమెంటును ఆవిష్కరింపజేయాలన్నది చంద్రబాబు ప్లాన్. ఆయన అధికారంలోకి వచ్చినపుడల్లా ఏదో విజన్ తయారు చేసుకుని ముందుకు సాగుతుంటారు. ఈసారి మోదీ తో కలిసి నడుస్తున్న చంద్రబాబు-- కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరిట ముందుకు సాగుతుంటే ఈయన.. వికసిత ఆంధ్ర పేరిట అడుగులేస్తున్నారు. ఇప్పుడు దీనికి రోడ్ మ్యాప్ తయారు చేయమని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
విజన్ 2047లో ఏముందంటే...
సూపర్ సిక్స్ పేరిట రాష్ట్ర ప్రజలకు ఆరు హామీలు ఇచ్చారు. ఇందులో ఇప్పటికి ఒక్కటే అమల్లోకి వచ్చింది. మరో ఐదు చేయాల్సి ఉంది. మళ్లీ ఇంతలో ఈ విజన్-2047 ఏమిటనేది అధికారులకు అంతుబట్టకుండా ఉంది. స్వాతంత్య్రం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. దానికి ముందస్తు సంసిద్ధత అంటున్నారు.
ఈ విజన్ లో ప్రధానంగా నాలుగంశాలుంటాయి.
అవి-- విద్యుత్ రేట్ల తగ్గింపు. ఇది ఎలాగంటే హైడ్రోజన్, అమ్మోనియా హబ్‌లు ఏర్పాటు చేసి ఇప్పుడున్న విద్యుత్ చార్జీలను 30% తగ్గించడం. రెండోది- నీటి భద్రత: నదుల అనుసంధానంతో నీటి భద్రతను సాధించడం, మూడోది- డిజిటల్ టెక్నాలజీ. అభివృద్ధి, ప్రగతిని ముందుకు తీసుకువెళ్లడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం. నాలుగోది- మానవ వనరుల వినియోగం. రాష్ట్రంలో ప్రస్తుతం యువత ఎక్కువగా ఉన్నందున వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడడం. వీటన్నింటి అమలుకు P4 మోడల్ ను అమలు చేయడం. పీ -4 అంటే పరసన్స్ (వ్యక్తులు), ప్రజలు, ప్రైవేటు భాగస్వామం. ఈ మోడ్ తో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం. చంద్రబాబుకు ప్రైవేటు భాగస్వామ్య మోడల్ కొత్తేమీ కాదు. గతంలో పీపీపీ మోడ్ ఉండేది. ఇప్పుడు పీ-4వచ్చింది. ఏపీ విజన్- 2047 ద్వారా ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించాలన్నది లక్ష్యం. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టాలి.
ఏడాది కిందటే ముసాయిదా విడుదల...
ఈ విజన్- 2047 డాక్యుమెంట్‌ను చంద్రబాబు నాయుడు 2023 ఆగస్టు 15న విశాఖపట్నంలో విడుదల చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది పనికి వస్తుందన్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు ఆ పని అప్పగించారు. ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఈ విజన్ డాక్యుమెంట్ తయారీపనిలో ఉన్నారు. ఇది తయారైన తర్వాత చంద్రబాబు నాయుడు చేయి చేసుకుంటారు. అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. 2014లో చంద్రబాబు ప్రకటించిన స్వరాంధ్రప్రదేశ్ పత్రంలోని కీలక అంశాలు ఇందులోనూ ఉండే అవకాశం ఉన్నట్టు జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు. ఏమున్నా లేకున్నా రాజధాని అమరావతి నగరం ప్రస్తావన ఉండే అవకాశం ఉంది.
పథకాలు, ప్రణాళికల ఉద్దేశాలు మంచివైతేనే సరిపోదు. చిన్న రాష్ట్రాలలో విజన్ డాక్యుమెంట్లను అమలు చేయాలంటే కత్తిమీద సామె. ఎన్నో సవాళ్లు ఉంటాయి. ప్రధానంగా
1. నిధుల కొరత (పరిమిత వనరులు)
2. బ్యూరోక్రాటిక్ చికాకులు, అడ్డంకులు
3. రాజకీయ అస్థిరత
4. కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడటం
చిన్నరాష్ట్రాలు అధిగమించాలంటే చంద్రబాబు పదేపదే చెప్పే పీ-4 మోడ్ పనికి రావచ్చు. ప్రతి ప్రణాళికలో ప్రజల్ని భాగస్వామ్యం చేయనిదే ఏదీ సాధ్యం కాదు. అవసరాలను గుర్తించి దానికి తగ్గట్టుగా కేటాయింపులుండాలి. సముచిత ప్రాంతాలపై దృష్టి సారించాలి. పటిష్టమైన వ్యవస్థలను నిర్మించాలి. జయాపజయాల నుంచి పాఠాలు నేర్చుకోవడం చాలా ప్రధానం. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్లను సమర్థవంతంగా అమలు చేయగలవు. అభివృద్ధిని చాటగలవు.
కొసమెరుపు...
చిత్రమేమిటో గాని చంద్రబాబు డాక్యుమెంట్లు తెచ్చిన ప్రతిసారీ ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఓడిపోతూనే వచ్చిన చరిత్ర ఉంది. ప్రతిసారీ అలా జరగాలన్న రూలేమీ లేదు. వయసుతో పాటు అనుభవం కూడా చాలా పాఠాలు నేర్పుతుంది. రాజకీయాలంటే అధికారమే కాదనే తత్వం బోధపడింది. అందువల్ల 2029లో జరిగే ఎన్నికల్లో ఓడిపోవాల్సిన పనేమీ లేదు. ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నంత కాలం ప్రధాని నరేంద్ర మోదీ ఎలా గెలుస్తున్నాడో అలాగే చంద్రబాబు, ఆయన పార్టీ గెలవచ్చు. గత చరిత్రను చెరిపేయవచ్చు. ఏమో ఎవరు చూడొచ్చారు గుర్రం ఎగరావచ్చు!