యూరియా... నువ్వెక్కడమ్మా...
ఆంధ్రప్రదేశ్ లో యూరియా ఎరువు కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు? ఇందుకు బాధ్యులు ఎవరు?;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ లో కావాల్సిన సాగు 31.5 లక్షల హెక్టార్లు కాగా 12 వారాలు పూర్తి అయ్యే (27.7.2025) నాటికి అన్ని పంటలు కలిపి సాగు 22.12 లక్షల హెక్టార్లు సాగైంది.(71శాతం) ఇందులో వరి సాగు 11.99 లక్షల హెక్టార్లు. (29.37ల ఎకరాలు) అయినా రాష్ట్రం మొత్తం జరిగిన సాగు లో వరి పంట 54 శాతం. వరి పంటకు నత్రజని ఎరువు తప్పని సరిగా కావాలి. అందుకే యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందిస్తుంది. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కవ యూరియా స్టాక్ ఉన్నా రైతులకు అందటం లేదు. ప్రభుత్వం చెబుతున్న దానికి, గ్రామాల్లో రైతులు పడుతున్న బాధలకు అసలు పొంతన లేకుండా ఉంది.
2024-25లో 3వ అడ్వాన్స్ లెక్కల ప్రకారం
దేశ వ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తి 1490.74 లక్షల టన్నులు. ప్రధమ స్థానంలో ఉత్తర ప్రదేశ్ ఉంది. మొత్తం ఉత్పత్తి లో 14.04శాతం. ద్వితీయ స్థానం లో తెలంగాణ ఉంది. 11.47 శాతం. తృతీయ స్థానంలో పశ్చిమ బెంగాల్ 11.06 శాతం. నాలుగవ స్థానంలో పంజాబ్ 9.63 శాతం, ఐదవ స్థానంలో ఒడిస్సా 6.45 శాతం, ఆరులో మధ్య ప్రదేశ్ 6.14శాతం, ఏడులో చత్తీశ్ ఘడ్ 5.73శాతం, ఎనిమిదిలో బీహార్ 5.66శాతం, తొమ్మిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 5.38 శాతంగా ఉంది.
ఈ సంవత్సరం ఏపీ ఖరీఫ్ లో వేరుశనగ, నూనె గింజలు కలిపి తగ్గిన సాగు 2 లక్షల హెక్టార్లు. సాగైన పంటలలో మెరుగు గా ఉన్నది వరి. మొక్కజొన్న దేశ వ్యాప్తంగా ఈ ఖరీఫ్ లో సాగు పెరిగింది. ప్రధానంగా ఈ రెండు పంటలే అత్యధికంగా సాగులో ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో మన గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు
సముద్ర తీరానికి దగ్గర లో ఉండి.. ఒక మోస్తరు వర్షానికే నీరు నిల్వ ఉండే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఖరీఫ్ లో వరికి ప్రత్యామ్నాయ పంట ఏమి చూపిస్తారనేది ప్రశ్నగా మారింది. వరిని లాభసాటి పంటగా మార్చే దిశగా అలోచించడం పోయి ఏపీలో వరి సాగు ఎందుకు తగ్గిస్తున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వరి సాగు కు నత్రజని (యూరియా) కావాలి. యూరియా ని అందించకుండా ఏదేదో మాట్లాడటం ఎంత వరకూ భావ్యం అనే ప్రశ్నలు రైతు సంఘాల నాయకుల నుంచి వస్తున్నాయి. రైతులు డబ్బులు చెల్లించి యూరియా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినా రైతులకు ప్రభుత్వం అందించలేని స్థితిలో ఉందనే విమర్శలు ఉన్నాయి. పీఏసీఎస్, ఆర్ యస్ కే ల వద్ద పని పోగొట్టుకుని రైతులు బారులు తీరుతున్నారంటే అవసరం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయానికి అదును ముఖ్యం: నాగిరెడ్డి
అదునుకు అవసరమైన నత్రజని (యూరియా రూపంలో) ఎరువు వెయ్యలేక పోతే దిగుబదుల పై ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ నెలలో వరికి చిరు పొట్ట దశలో తప్పనిసరిగా నత్రజని ఎరువు వెయ్యాలి. యూరియాలో మాత్రమే నత్రజని 46శాతం ఉంటుంది. యూరియాకు పత్యామ్నాయ రసాయన ఎరువు లేదు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం రైతుల కు సరిపడా యూరియా చిత్త శుద్ధితో అందించాలి. వాస్తవ విరుద్ధ ప్రకటనలతో అన్న దాతలను మోసగించటం ఎంత వరకూ భావ్యమో ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) సభ్యుడు యంవీయస్ నాగిరెడ్డి అన్నారు.
పీఎసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న రైతులు: కేవీవీ ప్రసాద్
గంటల తరబడి వేచి ఉన్న తరువాత ఒక్కొక్క రైతుకు, ఒక యూరియా కట్ట ఇస్తాం అనటం లోనే రైతులకు సరిపడా యూరియా అందటం లేదని అర్థం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు. ‘‘ప్రైవేటు వ్యాపారులు రూ. 266.50లు ధర ఉన్న యూరియా కట్ట కోసం రూ. 1,400లు పైన ధర ఉన్న కాంప్లెక్స్ ఎరువు కట్ట గానీ, రూ. 800 నుంచి 900లు ఉన్న పురుగు మందు కానీ కొనుగోలు చేయాలంటున్నారు. అప్పుడే యూరియా కట్ట అమ్ముతామంటున్నారని రైతులు చెబుతున్న వార్త లు మీడియా లో వస్తున్నాయని’’ ప్రసాద్ అన్నారు.
దేవరాపల్లిలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు
వరి సాగుకు యూరియా అందని కౌలు రైతులు
సీజన్ ప్రారంభంలో వరి సాగు ఏరియా లో యూరియా కొరత వచ్చింది. ఈ పరిస్థితి ని ముందుగా గమనించి ఆ ప్రాంతాలకు యూరియా సరఫరా చెయ్యటం లో ప్రభుత్వ యంత్రాంగం చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం కాలేదనే విమర్శలు ఉన్నాయి. యూరియా కోసం లైన్ లలో ఉన్న రైతులను ఎక్కడ చూసినా కౌలు రైతులు, చిన్న రైతు లే కనిపిస్తున్నారు. వరి సాగు చేస్తున్నది ఎక్కువ మంది కౌలు రైతులేనని స్పష్టమవుతోంది.
సోమందేపల్లి గ్రామంలో ఎరువుల దుకాణం వద్ద పోలీస్ కాపలా
అనిశ్చితి కారణంగా ముందుగానే కొనుగోలు చేస్తున్నారంటూ ప్రచారం..
రెండో పంట కోసం ఇప్పుడే యూరియా కొనుక్కోవద్దు అని కొన్ని జిల్లాల్లో అధికారులు రైతులకు చెబుతున్నారు. గంటల తరబడి లైన్ లలో నిలబడిన తరువాత ఒక యూరియా కట్ట వ్యాపారులు ఇస్తుంటే ప్రస్తుతం సాగు చేసిన పొలానికి చాలని పరిస్థితిలో రెండో పంటకు దాచుకోవడం అనే పరిస్థితి ఎక్కడిదని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు బత్తిని సుబ్బారావు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు, ప్రభుత్వ ప్రకటనలకు పొంతన లేదని రైతు సంఘాల వారు అంటున్నారు. ఏ ప్రాంతం లో అయితే డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతానికి డిమాండ్ కు సరిపడా సప్లై చెయ్యలేక పోతే రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారనేది రైతు నాయకుల వాదన.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎస్ విజయానంద్
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని అన్ని జిల్లాల్లో సరిపడిన మేర యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ లతో నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహా సోషల్ మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలు, కథనాలపై సకాలంలో స్పందించి రిజాయిండర్ ఇచ్చి ప్రచురితం, ప్రసారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటి కప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. అంతేగాక అన్ని రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ లు ఉన్న చోట రోజువారీ ఓపెనింగ్ బ్యాలెన్సు, క్లోజింగ్ బ్యాలెన్సు వివరాలను డిస్ప్లే చేయించాలని చెప్పారు.
యూరియా కొరత లేదు: వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
2025-26లో ఆగస్టు చివరి నాటికి 2,04,096 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేసామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూరియా సరఫరా 31శాతం ఎక్కువ అని తెలిపారు. ఏ ఒక్క రైతుకు యూరియా అందని పరిస్థితి రాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని, రైతు శ్రేయస్సు కూటమి ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.
గత ఏడాది కన్నా 87,880 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ పంటలకు రాష్ట్ర రైతాంగం వినియోగించిందన్నారు. రాష్ట్రంలో యూరియా సరఫరా, పంపిణీ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని, ఎక్కడ నిరసనలు లేవని, వాటిని అణిచివేసే ధోరణి ఉత్పన్నం కాదని ఈ ప్రభుత్వం అటువంటి అణిచివేత పనులు చేయదని తేల్చిచెప్పారు.
రైతులు ఎందుకు బారులు తీరుతారు?: సజ్జల
‘యూరియా కొరత లేదని అధికారులు, మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వం కలెక్టర్ ల ద్వారా ప్రత్యేకంగా ప్రకటనలు ఇప్పిస్తోంది. ఇంతకంటే ఏమికావాలి యూరియా కొరత ఉందని చెప్పటానికి’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియా వారు యూరియా కొరతపై ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. రైతులకు ఎప్పుడూ ఈ పరిస్థితి రాలేదన్నారు. మొదులే దిగుబడులు తగ్గి, గిట్టుబాటు ధర లేక వరి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఈ పరిస్థితుల్లో నత్రజని ఎరువులు కూడా అందకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అన్నారు. పైగా ఎరువులు ముందుగానే పక్కదారి పట్టించారని పాలకులు చెబుతున్నారని, అటువంటప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు.