దొంగతనం నింద ఓ పసి ప్రాణాన్ని తీసింది
తమ కుమారుడు యశ్వంత్ అమాయకుడని, అపనిందలతో అతని ప్రాణం పోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పామర్రు మండలం యడదిబ్బ గ్రామంలో ఒక హృదయవిదారక ఘటన జరిగింది. దొంగతనం చేశాడనే నిందని ఓ పసి హృదయం భరించలేక పోయింది. ఆ పసి మనసుని తీవ్రంగా కలచివేసింది. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు కైలే యశ్వంత్, పొరుగింటి వ్యక్తి బొట్టు సాంబశివరావు చేసిన దొంగతనం ఆరోపణలు, బెదిరింపులతో మానసిక ఒత్తిడికి గురై, మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన ఇంట్లో రూ.1500 పోయాయని, అది యశ్వంత్ తీసుకున్నాడని పొరుగింటి సాంబశివరావు ఆరోపించాడు. తమ ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అంటూ అతను ఆ బాలుడిని బెదిరించాడు. అంతటితో ఆగకుండా, తన బంధువైన ఓ రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్ కూడా చేయించి ఆ బాలుడిని మరింత ఒత్తిడి చేశాడు. సాంబశివరావు చేసిన ఈ బెదిరింపులు 15 ఏళ్ల యశ్వంత్‌ను తీవ్రంగా కలచివేశాయి. తట్టుకోలేక పోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున ఏడ్చారు. గుండెలు బాదుకుంటూ విలపించారు. తమ కుమారుడు యశ్వంత్ అమాయకుడని, అపనిందలతో అతని ప్రాణం పోయిందని వారు కన్నీరుమున్నీరుగా వాపోతున్నారు.
యశ్వంత్ జమీదగ్గుమిల్లి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటన పామర్రు మండలం యడదిబ్బ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనవసరమైన నిందలతో పదో తరగతి చదువుతున్న బాలుడు అన్యాయంగా ప్రాణాలు పోయాయని స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లల మనస్సు సున్నితమైనదని, చిన్న మాటలు కూడా వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పిల్లలపై ఒత్తిడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.