రేపు విజయవాడలో తిరంగ ర్యాలీ
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.;
By : The Federal
Update: 2025-05-15 15:32 GMT
పహల్గామ్‌లో భారతీయులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌పై చేసిన ఆపరేషన్ సిందూర్ విజయం కావాడాన్ని కీర్తిస్తూ విజయవాడ నగరంలో ఐదు వేల మందితో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారని ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పహల్గామ్‌లో భారతీయులపై పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 16వ తేదీ సాయంత్రం ఐదు వేల మందితో భారత్ మాతాకు జై అంటూ నగరం మారుమ్రోగేలా తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుందన్నారు. ర్యాలీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగ ర్యాలీ బయలు దేరి బెంజ్‌సర్కిల్‌కు చేరుకుంటుందన్నారు. విద్యార్థిని విద్యార్థులు 500 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
డిజె సౌండ్ సిస్టమ్ ద్వారా జాతీయ సమైఖ్యత సమగ్రతను చాటే విధంగా జాతీయ గీతాలను వినిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీతో పాటు ముఖ్య కూడలి లో తప్పెటగుళ్ళు, గరగర నృత్యాలు, డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి జాతీయ జెండాను అందజేసేలా చూడాలన్నారు. ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చల్లని త్రాగునీటి సౌకర్యం, తాత్కాలిక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అద్భుత పోరాట పఠిమ చూపిన భారత త్రివిద దళాల సైన్యాధికారులు, సైనికులను కీర్తిస్తూ నిర్వహించే తిరంగా ర్యాలీ విజయవంతం చేసేందుకు నగర పౌరులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.