తాగుడు కోసం 5 వేలకు 3 ఏళ్ల కూతుర్ని అమ్మేసిన తండ్రి

మద్యం కోసం ఓ తండ్రి తన కుమార్తెల్లో ఒకర్ని 5వేల రూపాయలకు అమ్మేసి కటకటాల పాలయ్యాడు..;

Update: 2025-08-09 02:52 GMT
మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతుర్నే అమ్మేసిన ఘటన విజయవాడ మహానగరంలో జరిగింది. ఈ ఘటన విజయవాడ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. మూడేళ్ల పాప శ్రావణి తల్లితో మళ్లీ కలిసిన క్షణం, చూసిన వారందరి కళ్లలో నీళ్లు తెప్పించింది. కానీ, ఆ పాప ఒడిలోకి చేరే వరకు వెనుక జరిగిన కథ, ప్రతి తల్లిదండ్రి గుండెను కదిలించింది.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన మస్తాన్, తాగుడుకి బానిస. భార్య వెంకటేశ్వరమ్మ. ఎనిమిది మంది పిల్లలు. ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. కానీ తండ్రి బాధ్యతను మరచి తాగుడుకు బానిసై సైకిల్ దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బును మద్యం మీదే ఖర్చు చేసే వాడు. మూడేళ్ల కిందటే తన కూతురిలో ఒకరిని డబ్బుల కోసం అమ్మేశాడు.
ఈ నెల 6వ తేదీ ఉదయం, మస్తాన్ మళ్లీ తన కుమార్తె శ్రావణిని తీసుకెళ్లాడు. చీరాల నుంచి రైల్లో విజయవాడకు వచ్చి రెండు రోజులపాటు రైల్వే ప్లాట్‌ఫారంలో తిరిగాడు. అక్కడ భిక్షాటన చేసే ఒక మహిళ, మజ్జిగ ప్యాకెట్లు అమ్మే ఓ వ్యక్తితో పరిచయం అయ్యాడు. ‘‘నా కూతురిని మీరు పెంచుకోండి, లేకపోతే భిక్షాటనకు పనికొస్తుంది’’ అని చెప్పి, రూ.5 వేలకు అమ్మేశాడు.
ఆ డబ్బుతో మద్యం తాగిన మస్తాన్, రాత్రి 11 గంటలకు రైల్వే పోలీసు స్టేషన్‌కి వెళ్లి ‘‘నా కూతురిని కిడ్నాప్ చేశారు’’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం వాసనతోనే పోలీసులకు అనుమానం వచ్చింది. వేటపాలెం పోలీసుల సహాయంతో అసలు విషయం బయటపడింది.
రైల్వే సీఐ రమణ రైల్వే, బస్టాండ్ సీసీ కెమెరాలు పరిశీలించగా, పాపను ఇద్దరికీ అప్పగించిన వీడియో దొరికింది. వారు రాజమహేంద్రవరం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే బస్సు డ్రైవర్‌ను సంప్రదించి, రాజమహేంద్రవరం పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండులోనే పాపను, ఆమెను కొనుగోలు చేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పాప తల్లికి తిరిగి చేరిన హృదయవిదారక క్షణం
విజయవాడకు పిలిపించిన తల్లి వెంకటేశ్వరమ్మకు, పోలీసులు పాపను సురక్షితంగా అప్పగించారు. ఆ క్షణం తల్లి కంటతడి చూసిన వారందరి హృదయాలను తాకింది. తండ్రి మస్తాన్‌తో పాటు నిందితులైన మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.
Tags:    

Similar News