ఇద్దరు డాక్టర్లకు.. కాంగ్రెస్ పోటు..!

ఇద్దరు డాక్టర్లు పోటీపడుతున్న నియోజకవర్గం. సత్తా చాటాలని సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి రావడంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది.

Update: 2024-04-14 14:35 GMT

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: పట్టు కోసం టిడిపి పోరాడుతోంది. ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సిపి ఆరాటపడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీలోకి దిగడంతో ఆ పార్టీలకు తలపోటు తప్పేలా లేదు. రోగుల నాడిని పరీక్షించే ఒక డాక్టర్. పబ్లిక్ పల్స్ తెలిసిన మరో డాక్టర్, వీరిద్దరి మధ్య తన సత్తా చాటాలని ఆరాటపడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్వయంకృతంతో టిడిపికి దూరమైన మహిళ మాజీ ఎమ్మెల్యే.. ఫ్యాన్ కిందికి చేరారు. వైయస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.

 

రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం లో 2024 జరుగుతున్న ఎన్నికలు నాలుగవవి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో పూతలపట్టులో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 1,99,405 మంది ఓటర్లు ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో 2,02,771 మంది ఓటర్లు ఉన్నారు. పూతలపట్టులోని ఐరాల, తవణంపల్లి, పూతలపట్టు, బంగారుపాలెం, యాదమరి మండలాల పరిధిలో 2,15,183 మంది ఓటర్లతో సింహ భాగంలో దళిత ఓటర్లే ఉండడం గమనార్హం.

వారి సంఖ్య ఎక్కువ

ఈ నియోజకవర్గంలో దళిత ఓటర్లు 50 నుంచి 55 శాతం ఉంటారు. ఇందులో అరవ మాల సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే కీలకపాత్ర. వారి సంఖ్య 30 నుంచి 35 శాతం ఉంటారనేది ఒక అంచనా. పది నుంచి 15 శాతం తెలుగు మాల సామాజిక వర్గాన్ని ఓటర్లు విజయావకాశాలను ప్రభావితం చేస్తారు. మిగతా సామాజిక వర్గాల ఓటర్లను పరిశీలిస్తే... సామాజిక వర్గం నుంచి 20 నుంచి 25 వేల ఓటర్లు, రెడ్డి సామాజిక వర్గం నుంచి దాదాపు 25 వేల మంది, బీసీలు 30 నుంచి 35 శాతం, యాదవ, ముత్రాసి, వడ్డెర, గిరిజన ఓటర్లు పదివేల మంది ఉంటారనేది సమాచారం.

డాక్టర్ల నియోజకవర్గం

పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పోటీ చేసిన అభ్యర్థుల్లో డాక్టర్లను ఆదరించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు డాక్టర్లు మధ్య సమరం జరుగుతోంది. వారిలో ప్రజల నాడిని పరీక్షించి వైద్యం చేసే డాక్టర్ పీ సునీల్ కుమార్ వైయస్సార్‌సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొదటిసారి సమాజ ఇది గతులను అర్థం చేసుకొని, ప్రజా సమస్యలు తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ (పీహెచ్డీ) ఎం మురళీమోహన్.. టిడిపి అభ్యర్థిగా పోటీ పడుతున్నారు.

 

నియోజకవర్గాల విభజన అనంతరం..

2009 : మొదట జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పి రవి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో సునీల్ కుమార్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. యధావిధిగానే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో, కుమారుడి మాట కాదనలేక జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వచనం అందించడం వల్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌కు ఈసారి మళ్లీ టికెట్ తగ్గింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారని చర్చనీయాంశం. ఆ స్థితిగతులను ఒకసారి పరిశీలిద్దాం.

టిడిపికి ఇది కోట..!

పూతలపట్టు నియోజకవర్గం టిడిపికి చెప్పడంలో సందేహం లేదు. పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పూతలపట్టును విడగొట్టి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేశారు. 2004 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించిన లలిత కుమారి.. 2009 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్‌కు 64,484 ఓట్లు లభించగా లలిత కుమారి కేవలం 950 ఓట్లతో ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు 83, 200 చక్కగా, కుమారి 902 ఓట్లతో ఓటమి చెందారు.

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబుకు 1.03, 265 లభించాయి. లలిత కుమారికి 74, 102 ఓట్లు సాధించి ఓటమి చెందారు. ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎమ్మెస్ బాబుకు పరోక్ష సహకారం అందించారని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఇవే కాకుండా ఆమె స్వయంకృతం వల్లే ఈసారి ఎన్నికల్లో లలిత కుమారికి టిడిపి అభ్యర్థిత్వం దక్కలేదని చెప్తున్నారు. లేకుంటే ఎన్నికల్లో ఆమె నుంచి వైఎస్ఆర్సిపి గట్టి పోటీ ఎదుర్కొనేది విశ్లేషకుల భావన. నియోజకవర్గంలోని నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి చేతుల్లోనే ఉన్నాయి. 25 నుంచి 28 వేల ఓట్లు ఉన్న ఆ సామాజిక వర్గానికి మాలలపై మంచి పట్టు ఉందనేది ఆ ప్రాంతం వారు చెప్పే మాట.

 

అనూహ్యంగా..

2024 ఎన్నికలకు పూతలపట్టు మండలం గొడుగుచింత గ్రామ దళితవాడకు చెందిన ఓ టీవీ ఛానల్ తిరుపతి రీజినల్ ఇన్చార్జిగా ఉన్న ఎం మురళీమోహన్‌ను టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు రంగంలోకి దించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ విద్యాసంస్థ అధిపతి అండగా ఉండడం. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆశీర్వచనాలు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అండదండలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు పూతలపట్టు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న మురళీమోహన్ విజయం కోసం ఆ పార్టీ నేతలు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.

ఇందులో ప్రధానంగా, పార్టీ శ్రేణులు పగటిపూట ప్రచారం నిర్వహించే సమయంలో అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. రాత్రుళ్లు ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు, ప్రభావితం చేయగలిగిన నాయకులతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ.. సర్దుబాట్లకు దిగినట్టు చెబుతున్నారు. "స్వేచ్ఛాయుత పోలింగ్ జరగడానికి అవసరమైన చర్యలు తీసుకున్న రీతిలో ఎత్తులు వేస్తున్నారు" స్థానిక నేతల ద్వారా తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక టీంలు కూడా నియమించి, మాల సామాజిక వర్గాల్లో రెండు తెగల వారిని ఏకం చేయడం ద్వారా పట్టు సాధించడానికి ముమ్మరంగా కృషి చేస్తున్న విషయం తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. మార్పు కోరుతున్న ఓటర్లు తనకు ఆశీర్వచనం అందిస్తారని" టిడిపి అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. టికెట్ ఆశించి భంగపడిన టిడిపి అధికార ప్రతినిధి, పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్, యాదగిరి మండలంలో కీలక నాయకుడైన వినాయక రౌండర్ సహకారంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూతలపట్టు మండలం గొడుగు చింత గ్రామానికి చెందిన డాక్టర్ మురళీమోహన్‌కు ఆ మండలంలో " స్థానిక ఇబ్బందులు" ఉన్నాయి అనేది సమాచారం. ఐరాల మండలంలో కూడా మాజీ ఎంపీపీ గిరిధర్ నాయుడు మరో వర్గం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదనేది స్థానికులు చెబుతున్న మాట. అందరినీ కలుపుకోవడంలో బాలారిష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

పథకాలే రక్ష... మాజీ ఎమ్మెల్యే అండ

"రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు రక్ష" అని భావించే రీతిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సాగుతున్నారు. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం ప్రజలతో స్వేచ్ఛగా కలవకుండా ఉన్నారనేది అక్కడి వాతావరణం. ఐరాల మండలం పైపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ సునీల్ కుమార్ సొంత మండలంలో ఉన్న నాలుగు గ్రూపులు ఏకం చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫలించినట్లు తెలుస్తోంది. యాదమరి మండలంలో జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డితో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ సర్దుబాటు చేసుకుంటే పరిస్థితి చెక్కబడుతుందని భావిస్తున్నారు.

వైయస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఐరాల మండలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ పలమనేరులో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ ఎక్కువ కాలం అక్కడే ఉంటుంటారు అనేది ఆయనపై ఉన్న అభియోగం. 2014 ఎన్నికల్లో ఆయన ఈ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రజలతో మరింతగా మమేకం కావాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు.

లాభించే అంశం:

2019 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన లలిత కుమారికి ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో ఆమె ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈమె వల్ల ఈ అంశం వైఎస్ఆర్సిపికి అదనపు బలం చేకూరినట్లు భావిస్తున్నారు.

 

టిడిపి- వైఎస్ఆర్సిపికి పోటు

పూతలపట్టు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి డాక్టర్ ఎం మురళీమోహన్‌కు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటు తప్పేలా లేదు. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎంఎస్ బాబు స్వతహాగా బెంగళూరులో ఓ బిల్డర్. సర్వేలో పనితీరు బాగా లేదనే నెపంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించారు. అందుకు ప్రధాన కారణం యధావిధిగాని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో మాదిరి ఆశీస్సులు అందించకపోవడమేననేది ఆ ప్రాంతవాసులు చెప్పే మాట. మొదట తీవ్రస్థాయిలో ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఘాటుగానే విమర్శలు సంధించారు.

ఆ తర్వాత సర్దుకున్నట్లు కనిపించిన. అకస్మాత్తుగా వెళ్లి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వద్ద ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెస్ బాబు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు. వైయస్సార్సీపి అభ్యర్థి సునీల్ కుమార్‌కు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి చేరడం వల్ల ప్లస్ పాయింట్ అయిందో... కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పోటీలోకి దిగనుండడం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భావిస్తున్న టిడిపిని ఆదరిస్తారా? పథకాలే నన్ను గట్టెక్కిస్తాయని భావిస్తున్న వైఎస్సార్సీపీని మళ్లీ ఆశీర్వదిస్తారా? వీరిద్దరికి పోటుగా నేనున్నా.. బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల ఎవరి పుట్టి మునుగుతుందో తేలాలంటే పోలింగ్ నాటి వరకు వేచి చూడాలి.

Tags:    

Similar News