ఈ అత్త మామూలు మనిషి కాదు, అల్లుణ్ణే ఎత్తుకుపోయింది!
తెనాలిలో సంచలనం సృష్టించిన సంఘటన ఇది
By : The Federal
Update: 2025-10-19 13:19 GMT
వాళ్లిద్దరిది కులాంతర వివాహం చేసుకున్నారు. అది అమ్మాయి తల్లికి ఇష్టం లేకపోయింది. అంతే ఆ అత్త.. అల్లుణ్ణి కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేసింది. సమాచారం వెంటనే పోలీసులకు చేరబట్టి సరిపోయింది గాని లేకుంటే ఆ అల్లుడు ఏమయ్యేవాడో..
తెనాలి త్రిటౌన్ పోలీసుల కథనం ప్రకారం తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠ వినుకొండకు చెందిన లిఖితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. ఈ పెళ్లి జరిగి రెండేళ్లు అయినా అత్త మాత్రం అల్లుణ్ణి వదలకుండా వేధిస్తూనే వస్తోంది. పలుమార్లు ఇంటికి పిలిచినా అత్త వ్యవహార శైలి నచ్చకపోవడంతో కుమార్తె, అల్లుడు వెళ్లలేదు.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మరో నలుగురితో కలిసి తెనాలిలోని అల్లుడి ఇంటికి విజయలక్ష్మి వచ్చారు. మణికంఠపై దాడికి పాల్పడింది. కిడ్నాప్ చేయించింది. మణికంఠను కార్లో ఎక్కించుకుని తీసుకుని వెళుతుండగా మణికంఠ స్నేహితుడు 112 నెంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న మూడో పట్టణ ఎస్సై కరీముల్లాకు మణికంఠ కిడ్నాప్ విషయం తెలిసింది. వెంటనే స్పందించిన ఎస్సై.. మరో కానిస్టేబుల్‌తో కలిసి గాలింపు చేపట్టారు.
కారును వెంబడించి చేబ్రోలు మండలం చేకూరు వద్ద ఐదుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని మూడో పట్టణ పీఎస్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. కారు కూడా ప్రస్తుతం పోలీసు స్టేషన్ లో ఉంది. కారు నెంబరును బట్టి అది హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది.