'బొండా, కూన, బొజ్జల ఓకే, బాలకృష్ణకు క్లాస్ ఎందుకు తీసుకోలేదు సీఎం సర్!'

తప్పులు చేసి వైసీపీకి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు ఎమ్మెల్యేలకు వార్నింగ్

Update: 2025-09-27 03:54 GMT
TDP ఎమ్మెల్యేలు కొందరు శాసనసభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై సొంతపార్టీలోనే చిటపటలు వ్యక్తం అవుతున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాలను, సభలోని కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తన ఛాంబర్ లో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

"అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీదా?" అని వారితో అన్నట్టు సమాచారం. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని నియంత్రించాలి కదా.. అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్‌కు గట్టిగానే చెప్పినట్లు తెలిసింది. శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పవన్ కల్యాణ్ ను తప్పుబట్టారు. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కూన రవికుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఈ వ్యాఖ్యలన్నింటిపైనా సీఎం మండిపడినట్లు తెలిసింది.
‘పార్టీ ఎమ్మెల్యేలు కొందరు గీత దాటి మాట్లాడుతున్నారు. అది అసెంబ్లీ అనుకుంటున్నారా? పార్టీ సమావేశం అనుకుంటున్నారా? ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన చోట వ్యక్తిగత అంశాల ప్రస్తావనేంటి? ఒక సీఐ బదిలీ గురించి సుధీర్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుబడుతూ మాట్లాడటమేంటి? అధికార పార్టీ సభ్యులం అనుకుంటున్నారా? ప్రతిపక్ష సభ్యులం అనుకుంటున్నారా? ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా పరిధులు దాటి వ్యవహరించడమేంటి?’ అని చంద్రబాబు కోపగించుకున్నారు.
ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలియదా?
‘‘సభలో ఎవరేం మాట్లాడారో అన్నీ నా దగ్గరున్నాయి. సభలో ప్రతిపక్షం లేదు. కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. నేను రోజుకు 15 గంటలపాటు ఎందుకు కష్టపడుతున్నాను? ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని, అభివృద్ధి చేయాలని శ్రమిస్తున్నా. మీరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా? జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు కదా? మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మర్చిపోయారా? అప్పుడింత స్వేచ్ఛగా ఉన్నారా? వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి సాగనంపారు. మనం తప్పులు చేసి వాళ్లకు మళ్లీ అవకాశం ఇవ్వకండి’ అని ఎమ్మెల్యేలకు సీఎం మందలించారు.
మేము సరే బాలకృష్ణ సంగతేంటీ?
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు- కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డి- సీఎంకి సంజాయిషీ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత లోపల ఏం జరిగిందనే దానిపై గుసగుసలు బయల్దేరాయి. "వీళ్ల సంగతి సరే, ఆయన బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ సంగతేటీ? ఆయన వీళ్లందరికన్నా ఎక్కువగా డామేజ్ చేశారు కదా? సభలో లేని చిరంజీవి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి ఓ సామాజిక వర్గాన్నే పార్టీకి దూరం చేస్తున్నారు. ఆయన్ని మందలించలేదేం" అని ఈ ఎమ్మెల్యేల అనుచరులు వ్యాఖ్యానించారు.
పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే సహించబోనని ముఖ్యమంత్రి హెచ్చరించడం మంచిదే అయినా వాళ్ల బావమరిదికైతే ఒక రూలు మిగతా వారికో రూలు ఉండకూడదని బొండా ఉమా అనుచరుడొకరు అన్నారు.
చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ప్రకటనలు చేస్తున్నారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలోనే బాలకృష్ణ శుక్రవారం శాసనసభలో తన అల్లుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పక్కన కూర్చుని సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. వాళ్లు ఏమి మాట్లాడుకున్నారనేది బయటికి రాకపోయినా కచ్చితంగా ఈ వ్యవహారమే అయి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తం మీద పార్టీకి జరుగుతున్న డామేజీని నియంత్రించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే ఎమ్మెల్యేలు మాత్రం రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ప్రభుత్వం మీద కొన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేసేలా మాట్లాడుతున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ అంశాన్నే చెప్పేందుకు చంద్రబాబు శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత టీడీపీ శాసనసభాపక్ష సమావేశం పెట్టాలని భావిస్తున్నారు. ఒకవేళ అటువంటి సమావేశం జరిగితే చంద్రబాబు ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాసు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News