అక్కడ ఒక్క సారే.. సెకండ్‌ టైమ్‌ నో చాన్స్‌

ఒక్క సారి గెలిపించడం ఆ నియోజక వర్గం ప్రత్యేకత. రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఒక సారి గెలిచిన వారే నేడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉన్నారు.

Update: 2024-04-30 09:26 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం ఒక విలక్షణమైన నియోజక వర్గం. ఏ పార్టీ అభ్యర్థి అయిన ఒక్క సారి మాత్రమే ఆదరించడం ఈ నియోజక వర్గం ప్రత్యేకత. ఒక సారి పోటీ చేసి గెలిచిన వారు రెండో సారి పోటీ చేసినా వారిని తిరస్కరించడం ఈ నియోజక వర్గం ఓటర్లు స్పెషాలిటీ. అదే ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. టీడీపీ నుంచి ఒక సారి గెలిచి రెండో సారి బరిలోకి దిగిన బండారు సత్యనారాయణ , కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా ఒక సారి గెలిచి రెండో దఫా బరిలోకి దిగిన ద్రోణంరాజు సత్యనారాయణలను ఓడించిన చరిత్ర పెందుర్తి అసెంబ్లీ నియోక వర్గం సొంతం. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అన్నంరెడ్డి ఆదీప్‌రాజ్‌ ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండగా, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన పంచకర్ల రమేష్‌ బాబు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇద్దరూ గతంలో ఒక సారి గెలిచిన వారే. కాంగ్రెస్‌ నుంచి పిండి భగత్, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి కన్నేపల్లి మహదేవ్‌ కల్యాణ్‌ శ్రీకాంత్‌లు బరిలో ఉన్నారు. వీరిద్దరు కొత్తగా రంగంలోకి దిగారు. అయితే ఈ సారి ఎవరిని విజయం వరిస్తుందనేది స్థానికుల్లో ఆసక్తి కంరగా మారింది. ఒక సారి గెలిచిన వారినే రెండో సారి గెలిచి పాత రికార్డును బద్దలు కొడతారా లేదా కొత్తగా రంగంలోకి దిగిన అభ్యర్థులు గెలుపొంది పాత రికార్డును కొనసాగిస్తారా అనేది స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

1978లో పెందుర్తి ఏర్పాటు
1978లో పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గం ఏర్పడింది. ఇది జనరల్‌ స్థానం. ఇప్పటి వరకు 11 పర్యాయాలు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌(ఐ) రెండు సార్లు, స్వంతంత్రులు ఒక సారి, కాంగ్రెస్‌ రెండు సార్లు, సీపీఐ ఒక సారి, మూడు సార్లు తెలుగుదేశం పార్టీ, ఒక సారి ప్రజారాజ్యం, ఒక సారి వైఎస్‌ఆర్‌సీపీలు గెలిచాయి. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ)నుంచి బరిలోకి దిగిన గుడివాడ అప్పన్న సీపీఎం అభ్యర్థి సబ్బెల గంగాధరరెడ్డిపై గెలుపొందారు. 1980లో కాంగ్రెస్‌ఐ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ గెలిచారు. 1983 ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్‌ నుంచి రెండో సారి పోటీ చేసి ఓడి పోయారు. ఈ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన పి అప్పలనరసింహం గెలిచారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆళ్ల రామచంద్రరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గుడివాడ గురునాథరావుపై గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ గురునాథరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన పల్ల సింహాచలంపై గెలిచారు. అయితే గుడివాడ గురునాథరావు కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడి పోయి ఈ సారి గెలవడం విశేషం. 1994 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎం ఆంజనేయులు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ద్రోణంరాజు శ్రీనివాస్‌పై గెలిచారు. తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెతకంశెట్టి గణ వెంకటరెడ్డి నాయుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ద్రోణంరాజు శ్రీనివాస్‌పైన గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన తిప్పల గురుమూర్తిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గుడివాడ నాగమణిపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్‌బాబు, కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగిన గండి బాబ్జీపై గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యనారాయణ, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన గండి బాబ్జీపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రెండో సారి టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు సత్యనారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి ఆదీప్‌రాజ్‌పై ఓటిమి పాలయ్యారు. అన్నంరెడ్డి ఆదీప్‌రాజ్‌ తొలి విజయం నమోదు చేసుకున్నారు.
వీరే ఇక్కడ కీలకం
పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నప్పటికీ కాపు, కొప్పుల వెలమలే కీలక పాత్ర పోషిస్తుంటారు. పెందుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో 3లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 90వేల వరకు కాపు ఓటర్లు, 70వేల కొప్పుల వెలమలు ఉన్నారు. మరో 45వేల వరకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30వేలు, 21వేల వరకు గవర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీరితో పాటుగా 15వేల వరకు శెట్టి బలిజలు, 6వేల వరకు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు.
Tags:    

Similar News