అర్హులైన వారి పింఛన్లు తొలగించే ప్రసక్తే లేదు
సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్‌కు మళ్లీ అప్పీల్ చేసుకోవాలని, అర్హత ఉంటే పునరుద్దరిస్తా మని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.;
By : The Federal
Update: 2025-08-22 14:54 GMT
అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కోసం బడ్జెట్ లో రూ.33 వేల కోట్లను కేటాయించడం జరిగిందన్నారు. గత ఏడాది జూలై 1 నుండి ప్రతి మాసం 65.18 లక్షల మందికి రూ.2,700 కోట్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. పెన్షన్ పొందుతున్నవారిలో స్వర్గస్తులు అవుతున్న వారి స్థానంలో భార్యకు వితంతు పెన్షన్‌ను వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని, ఈ విధంగా దాదాపు 1.10 లక్షల స్పౌస్ పెన్షన్‌లను మంజూరు చేశామన్నారు.
ప్రస్తుతం 63.71 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. తమ ప్రభుత్వం ఎటు వంటి పింఛన్లను తొలగించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదన్నారు. అయితే పింఛను పధకం దుర్వినియోగం అవుతున్నదని, గత ప్రభుత్వ హయాంలో ఎన్నో బోగస్ పింఛన్లను మంజూరు చేయడం జరిగిందని, ప్రత్యేకించి ఆరోగ్య మరియు దివ్యాంగుల కేటగిరీలలో కొంత మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు క్షేత్ర స్థాయి నుండి పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. గత పదిహేను ఏళ్ల నుండి దాదాపు 6.00 లక్షల దివ్యాంగ పింఛన్లను ఇస్తుంటే.. గత ఐదేళ్లలోనే దాదాపు 2.07 లక్షల మందికి నూతనంగా దివ్యాంగుల పింఛన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. అనర్హులకు బోగస్ సర్టిఫికేట్లు జారీచేసి పెద్ద ఎత్తున దివ్యాంగుల పింఛన్లను దుర్వినియోగం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
ఈ విషయాన్ని త్రీవ్రంగా పరిగణిస్తూ తమ ప్రభుత్వం సర్టిఫకేట్లను రీ–వెరిపై చేయాల్సినదిగా ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. గత తొమ్మిది మాసాల నుండి ఎంతో పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుచున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 125 కేంద్రాల్లో స్లాట్ లను కేటాయించి మరీ సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అనారోగ్యుల విషయంలో వైద్యులే వారి ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా దాదాపు 7.95 లక్షల మంది సర్టిఫికేట్లను రీ–వెరిపై చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 5.55 లక్షల మందికి సంబందించి రీ–వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఈ వెరిఫికేషన్ లో దాదాపు 80 వేల మంది అనర్హులను గుర్తించడం జరిగిందని, అయితే వారి అర్హతను బట్టి మరో కేటగిరీలో అర్హులుగా గుర్తిస్తూ కన్వర్టు చేస్తామన్నారు. ఈ విధంగా 20 వేల మందిని వృద్దాప్య పింఛన్ల కేటగిరీలోకి మార్చడం జరిగిందన్నారు. 40 శాతం పైబడిన అంగవికలులకు కూడా దివ్యాంగ పింఛన్లను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రీ–వెరిఫికేషన్లలో అనర్హులుగా గుర్తించిన వారందరికీ నోటీసులను కూడా జారీచేయడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.