కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు

పవన్ కల్యాణ్ తన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించారు.

Update: 2025-11-26 08:46 GMT

కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం, కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పొంగి పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. ఉప్పలగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలో తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను చూస్తూ, కొబ్బరి తోటల్లోకి నీరు చొచ్చుకురావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది, ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా, నీరు ఎంత కాలం పొలాల్లో ఉంటుంది, తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం కొబ్బరి రైతులతో భేటీ అయి, వారి సమస్యలు ఓపికగా విన్నారు.

కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తాం. కోనసీమ పరిధిలో లక్ష ఎకరాల పరిధిలో సాగవుతున్న కొబ్బరి తోటలపై లక్ష కుటుంబాల ఆధారపడి ఉన్నాయి. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం. కోనసీమ రైతాంగానికి గొంతుకనవుతా. వారి సమస్యలు పరిష్కరించే గళాన్ని అవుతా. మాటలు చెప్పి వెళ్లేందుకు కాదు. కోనసీమ కొబ్బరి రైతుకు అండగా ఉన్నామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చా. నీటిపారుదల శాఖ నిపుణులు రోశయ్య కోనసీమ కొబ్బరి రైతు సమస్యలపై, ఇక్కడి డెల్టా గురించి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని అధ్యయనం చేసి అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. రెండు వారాల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధికారులు, రైతులతో మరోసారి సమావేశం నిర్వహిస్తాం అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News