'నాపై స్టేట్ స్పాన్సర్డ్ దాడి జరగబోతోంది'-వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ మంత్రి లోకేష్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంచలన ఆరోపణలు చేసారు.;
పులివెందులకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు,పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పులివెందుల జెడ్పీ ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని తనపై దాడి చేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు.ఈ దాడి స్టేట్ స్పాన్సర్డ్ అని సతీష్ రెడ్డి ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారని సతీష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి పోలీసులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారంటూ ,ఇక్కడున్న పోలీసుల ద్వారా న్యాయం జరిగే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.తనను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులదేనని అన్నారు.చేతనైతే తనను కాపాడాలని, దాడి జరగకుండా చూడాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.డీఎస్పీ, రూరల్ సీఐ, డీఐజీ సైతం టీడీపీ వాళ్లకు పెత్తనం ఇచ్చారని ఆయన విమర్శించారు.