ప్రజల అవసరాల కోసం కాకుండా, ఇంకెవరో ఆర్థిక లబ్ధి కోసం చేపట్టిన కుందూనది వెడల్పు రాయలసీమకు మరణ శాసనం కాబోతున్నదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య పర్యావరణ వినాశనానికి దారితీయడమేగాక, కుందూనది మీద చట్టబద్ధంగా చిన్నకారు రైతులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న 1 లక్ష 25 వేల ఎకరాల ఎత్తిపోతల పథకాల సాగునీటికీ విఘాతం కలగజేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా నది వెడల్పు పేరుతో వారి భూహక్కులను కూడా హరించి వేస్తుందని బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుందూనది సామర్ధ్య పెంపు కార్యక్రమంలో భాగంగా పూడిక తీసివేసే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టి అర్ధాంతరంగా ఆపేసిందని, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్టుగా ఒక ప్రముఖ దినపత్రికలో వార్త వచ్చిన నేపథ్యంలో స్పందించిన బొజ్జా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా వ్యతిరేక ప్రాజెక్టులకు కూడా ‘‘సమాజ మద్దతు కూడగట్టడానికి’’ తప్పుడు భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వం తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తోందేమోనని అనుమానాలను వ్యక్తం చేశారు.
బచావత్ ట్రిబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం కృష్ణా జలాలపై హక్కులు కల్పించిన ఎస్‌ఆర్‌బిసి, తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీటిని అందించడంలో పాలకుల విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈ నిర్మాణాల కొనసాగింపుగా చేపట్టిన పైన పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడం లేదా నిర్వహణ లేకపోవడం వలన ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టుకు నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ. 1500 కోట్లు రూపాయల నిధులతో ఈ ప్రాజెక్టుల పూర్తి ఆయకట్టుకు నీరు అందించవచ్చు. ఈ అంశాలకు ప్రాధాన్యత నిచ్చి నిర్మాణాలు పూర్తి చేస్తే కరువు పీడిత నంద్యాల, కడప జిల్లాలలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరంగా నీరు అందించవచ్చు. ఆ దిశగా కార్యాచరణ చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. అందువలన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా జలాలు అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు వినియోగించుకోలేని ఈ కృష్ణా జలాలను కుందూనదికి మళ్లించి, కృత్రిమ వరదలు సృష్టిస్తూ రాయలసీమ పల్లెలు, పట్టణాలు, పంట పొలాలను జలమయం చేస్తున్నారని బొజ్జా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టవలసిన అంశాలను ప్రచరించకుండా, నదిలో పూడిక తీయడానికి కుందూనదిలో కార్యక్రమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త దిగ్భ్రాంతిని కలగజేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నీరు ప్రవహించిన తర్వాత మిగిలే ఇసుక ఆ ప్రాంతం యొక్క భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగపడే అంశం.. అయితే పాలకుల ఆజ్ఞ ప్రకారం నడుచుకునే అధికారులు నదిలో పూడిక తొలగించడం అనే సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్లనే ఇలాంటి వార్తలు వస్తున్నాయన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల కోసం కాకుండా ఎవరి లబ్ధి కోసమో చేపట్టిన కుందూనది వెడల్పు, లోతు చేసే కార్యక్రమము ‘‘ప్రజల కోసమే’’ అనే భావనను సమాజానికి కల్పించి, వారి మద్దతును కూడగట్టడానికి ఇలాంటి వార్తలను సృష్టించడంలో ప్రభుత్వాలు తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు తప్పుడు భావజాలం ఎక్కించి ప్రజల మద్దతుకు కూడగట్టుకుంటూ, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా చేపట్టే ప్రాజెక్టులపట్ల సమాజాన్ని జాగృతి చేయాల్సిన బాధ్యత ఆలోచనపరులు, మేధావులు, పర్యావరణ పరిరక్షకుల పైన మరింత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ వినాశనానికి కారణమయ్యే కుందూనది వెడల్పును నిలుపుదల చేసేలా, సాగు నీటి హక్కులతో రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీరు చేరేలాగా పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా ఆలోచనాపరులు, మేధావులు, పర్యావరణ పరిరక్షకులు కృషి చేయాలని బొజ్జా విజ్ఞప్తి చేశారు.