గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు మహూర్తం ఖరారైంది. అధికారులు ఇప్పటి నుంచే పనులు మొదలు పెడుతున్నారు.

Update: 2024-11-02 09:46 GMT

పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు ప్రజలు తరలి వస్తారు. 2027 జూన్‌లో పుష్కరాలు ఉంటాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పుష్కర ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చర్యలు ముందు నుంచే చేపట్టారు. జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈసారి జరిగే పుష్కరాలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి స్థానిక నేతల సహకారం ఉంటుంది. ముందు నుంచే స్థానిక నేతలతో జిల్లా యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోంది. పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపైన అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏమిటనేది సమయం ఇంకా ఉన్నందున త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు జరుపుతారు. ఈ మేరకు పండితుల సలహాలు, సూచనలు అధికారులు తీసుకున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం మూడేళ్ల ముందు నుంచే కార్యాచరణ చేపట్టింది. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం రోజు చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఆ కుటుంబాలు నేటికీ గోదావరిని నిందిస్తూనే ఉన్నాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ. 904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. పుష్కర ఏర్పాట్ల పైన కీలక కసరత్తు జరుగుతోంది.
Tags:    

Similar News