తెలుగు రాష్ట్రాల్లో మహిళల పరిస్ధితి ఇలాగుంది

మహిళల రక్షణకు తమ ప్రభుత్వాలు పూర్తి చర్యలు తీసుకుంటున్నాయని రెండు ప్రభుత్వాలు చెప్పటమే కాని ఆచరణలో మాత్రం ఆ చర్యలు ఎక్కడా కనబడటంలేదు.

Update: 2024-11-07 07:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో మహిళల పరిస్ధితి దాదాపు సేమ్ టు సేమ్ అన్నట్లే ఉంది. తమ హక్కులు, భద్రత కోసం మహిళలు పోరాడటమే కాదు చివరకు భర్తల ఉద్యోగాల కోసం ఒక రాష్ట్రంలో, భర్తలకు అందాల్సిన జీతాల కోసం మరో రాష్ట్రంలో మహిళలు రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన దుస్ధితి ఎదురైంది. తెలంగాణా స్పెషల్ పోలీసుల(Telangana Special Police) విభాగంలో పనిచేస్తున్న తమ భర్తలతో పోలీసు డ్యూటీలు మాత్రమే చేయించాలని డిమాండ్లు చేస్తు నల్గొండ(Nalgonda), సిరిసిల్ల, వికారాబాద్ లో యూనిట్లలోని స్పెషల్ పోలీసుల భార్యలు రోడ్లపైకి వచ్చి పెద్ద ధర్నాలే చేశారు. భార్యల బాధలు చూడలేక స్పెషల్ పోలీసులు కొందరు సంఘీభావంగా హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో నిరసన తెలిపారు. దాంతో క్రమశిక్షణ చర్యల కింద ఉన్నతాధికారులు 30 మందిని విధుల నుండి తొలగించటమే కాకుండా మరో 10 మందిని సస్పెండ్ చేశారు. దాంతో విషయం కాస్త సీరియస్ అయి ఇపుడు భర్తలు,+భార్యలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులు కూడా రోడ్లపైన నానా రచ్చ చేస్తున్నారు.

ఇదే సమయంలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ(Vizag Steels)లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి నెలరోజులుగా జీతాలు అందలేదు. ఉద్యోగులు, కార్మికుల్లో కొందరికి ప్రతినెలా 15వ తేదీన యాజమాన్యం జీతాలు చెల్లిస్తుంది. అలాంటిది ఇపుడు నెలన్నర దాటినా వందలమంది ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం జీతాలు చెల్లించలేదు. జీతాలు చెల్లించటానికి యాజమాన్యంకు నెలకు రు. 80 కోట్లు అవసరం. జీతాలకు చెల్లించేందుకు సరపడా నిధులు అందుబాటులోనే ఉన్నా ఎందుకనో యాజమాన్యం మాత్రం జీతాలు చెల్లించటంలేదని ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. దాంతో ఉద్యోగులు, కార్మికుల భార్యలు, తమ కుటుంబాలతో రోడ్డుపైకి వచ్చి పెద్ద ధర్నా చేశారు. వెంటనే తమ భర్తలకు ఇవ్వాల్సిన జీతాలను చెల్లించాలంటు డిమండ్ చేశారు. తెలంగాణాలో స్పెషల్ పోలీసుల భార్యల డిమాండ్లు ఎప్పుడు నెరవేరుతాయో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఎప్పుడు అందుతాయో అంతా దైవాదీనంగా మారిపోయింది.

పై సమస్యలకు అదనంగా మహిళలు, యువతలపై ప్రతిరోజు హత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలని కూడా చూడకుండా కొందరు యువకులు వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. మహిళల రక్షణకు తమ ప్రభుత్వాలు పూర్తి చర్యలు తీసుకుంటున్నాయని రెండు ప్రభుత్వాలు చెప్పటమే కాని ఆచరణలో మాత్రం ఆ చర్యలు ఎక్కడా కనబడటంలేదు. జరిగే అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి, ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తునే ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సుమారు వందకుపైగా మహిళలపై అఘాయిత్యాలు, హత్యాచారాలు జరిగాయంటు వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. శాంతి, భద్రతలను కాపాడటంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) ఫెయిలయ్యారని ఈమధ్యనే డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్(Dy Chief Minister Pawan Kalyan) బహిరంగంగా మండిపడిన విషయం తెలిసిందే. పరిస్ధితి ఇదే విధంగా కంటిన్యు అయితే హాంశాఖ బాధ్యతలను తానే తీసుకోవాల్సుంటుందని చేసిన హెచ్చరికలు కూటమి రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇక తెలంగాణా(Telangana) పరిస్ధితి తీసుకుంటే ఇక్కడ కూడా మహిళల భద్రత డొల్లగానే తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు, హత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. కేసుల నమోదు, దర్యాప్తులో రాజకీయ జోక్యం పెరిగిపోవటం కూడా శాంతి, భద్రతలు అదుపు తప్పటానికి కారణమనే అనుకోవాలి. మొత్తంమీద రెండు తెలుగురాష్ట్రాల్లోను లా అండ్ ఆర్డర్ పరిస్ధితి దాదాపు ఒకటేలాగుండటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News