పవర్ చార్జీలు పెంచితే పాలకుల పవర్ జనం పీకేస్తారా..!

కరెంటు చార్జీలు పెంచితే పాలకుల పవర్ ప్రజలు పీకేస్తారని రాష్ట్రంలోని ఓ మంత్రి స్పష్టం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం పవర్ చార్జీలు పెంచినందుకే పడిపోయిందన్నారు.

Update: 2024-12-27 07:26 GMT

విద్యుత్ చార్జీలు పాలకులు ఇష్టానుసారం పెంచుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నా చార్జీలు చెల్లించి నిట్టూరుస్తున్నారు. అంత కష్టం మీద విద్యుత్ చార్జీలు ఎందుకు చెల్లిస్తున్నారు. విద్యుత్ లేకపోతే పనులు జరగవా? అంటే జరగవనేది జగమెరిగిన సత్యం. విద్యుత్ నిత్యావసర వస్తువు. ఒక పూట అన్నం లేకుండా ఉండొచ్చేమో కాని విద్యుత్ ఒక పూట లేకపోతే లక్షల కోట్ల ఉత్పత్తి ఆగిపోతుంది. సామాన్యుడు ఉపయోగించే నావ కూడా ముందుకు కదలదు. రైతుల పొలాల్లో సాగు నీటి కాలువ కూడా పారదు. విద్యార్థుల చేతుల్లో లాప్ టాప్ పనిచేయదు. సాఫ్ట్ వేర్ కంపెనీలు మూత పడతాయి. ఇంట్లో ఒక్క బలుపు సరిపోతుందనుకునే నిరు పేద కూడా విద్యుత్ బల్బు లేకుండా జీవించలేని పరిస్థితి ఉంది. ఇది నేటి పాలకులకు ఆయుధంగా మారింది. ఈ ఆయుధాన్ని ప్రజలపై ప్రయోగిస్తున్నారు. జనం ఈ ఆయుధం నుంచి తప్పించుకుందామనుకున్నా చేతకావడం లేదు.

గత ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచింది. గృహ వినియోగానికి గతంలో రెండు రూపాయలు యూనిట్ ధర ఉంటే ప్రస్తుతం ఆ ధర రూ. 8.75లు పడుతోంది. అంటే యూనిట్ ధర మూడు రెట్లకు పైన పెరిగింది. ఇక కమర్శియల్ అయితే చెప్పేందుకు వీలు లేదు. కేవలం అడ్వర్ టైజ్ మెంట్స్ బోర్డులకు వాడే విద్యుత్ చార్జీ మినిమం రూ. 3000లు గా నిర్ణయించారు. కళ్యాణ మండపాలకు యూనిట్ ధర రూ. 16లుగా ఉంది. ఇలా వివరించుకుంటూ పోతే వామ్మో అనాల్సిందే. జనం అవసరాన్ని సొమ్ము చేసుకోవడం పాలకులకు పరిపాటిగా మారింది. భారతదేశాన్ని బ్రిటీష్ పాలకులు పాలిస్తున్న రోజుల్లో భూమి ఎవరి చేతుల్లో ఎంత ఉందో చూసి ఆ భూమిపై పన్నులు విధించడం మొదలు పెట్టారు. అలా ప్రజల అవసరాలను గుర్తించి పన్నులు వసూలు చేస్తున్నారు. సాగునీరు అందకపోయినా మాగాణి భూముల్లో నీటి తీరువా చెల్లించాల్సిందేనని విఆర్వోలు చెవులు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది నాకు వరి పంట పండలేదు. మెట్ట పంటకు ఎంత పన్ను విధిస్తారో అంత విధించాలని కోరినా వినటం లేదు. ఎందుకంటే భూమిని ఏ వ్యక్తీ పోగొట్టుకోడు కాబట్టి బలవంతంగా వసూలు చేస్తున్నారు. అంటే నాటి బ్రిటీష్ పాలకులకు, నేటి ప్రజాస్వామ్య పాలకులకు ఏ మాత్రం తేడా లేదని స్పష్టమవుతోంది.

రెడ్రౌతు హరిప్రసాద్ అనే వ్యక్తికి విజయవాడ నగరంలోని ఆయన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లును పరిశీలిద్దాం. ఆయన కరెంటు కాల్చిన చార్జీలు రూ. 376లు. కానీ ఆయనకు వచ్చిన కరెంటు బిల్లు రూ. 788లు. ఏమిటి ఇలా వచ్చిందని అనుకుంటున్నారా? అవును అదంతే వస్తుంది. బిల్లు కట్టాల్సిందే. లేకుంటే కటాఫ్ డేట్ అయిన గంటలోపు ఆ ఇంటికి విద్యుత్ కట్ అవుతుంది. ఈ బిల్లుకు ఫిక్స్ డ్ చార్జెస్ రూ. 20లు, కష్టమర్ చార్జెస్ రూ. 45లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ చార్జెస్ రూ. 6.96లు, ట్రూ అప్ చార్జెస్ రూ. 83.55లు, FPPCA Charges (4/22), రూ. 176.58లు, FPPACA Charges (10/24) రూ. 79.20లు, విద్యుత్ లాస్ రూ. 0.21 పైసలు కలిపి మొత్తం బిల్లు రూ. 788లు అయింది. ఎవరైనా ఎన్ని యూనిట్లు విద్యుత్ వాడుకున్నారో అంత బిల్లు కడతారు. కానీ బిల్లు రూ. 376లు వస్తే అదనపు చార్జీలు రూ. 412లుగా ఉన్నాయి. ఎంత తేడా ఉందో చూడండి. ఇంత మొత్తం అదనపు చార్జీలు వినియోగదారుడు ఎందుకు కట్టాలి. అదనపు చార్జీలు పడుతున్నాయంటే అందుకు పాలకులు కారణం కాదా అనేది ఆలోచించాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు ఎందుకు పెంచాల్సి వస్తుందో చెప్పలేదు. జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల 10వేల మెగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను రాష్టం కోల్పోయిందని అంటున్నారు. అందు వల్లే కాబోలు ఆయన విద్యుత్ చార్జీలు పెంచాలని నిర్ణం తీసుకుంది. ఆ విషయాన్నయినా సష్టంగా చెబుతారా అంటే అదీ లేదు. రూ. 18,568 కోట్లు వైఎస్సార్ సీపీ ప్రజలపై భారం వేసిందని, మేము కూడా దాదాపు దానికి సమానంగా భారం వేయక తప్పడం లేదని మంత్రి మాటలు చెబుతున్నాయి.

ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మాటలు చాలా సభల్లో చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారంటే గత ప్రభుత్వం చేసిన పాపం ప్రజలను వెంటాడుతోందని విద్యుత్ శాఖ మంత్రి ద్వారా చెప్పిస్తున్నారు.

పవర్ చార్జీలు పెంచితే ఆ పార్టీ పవర్ పోతుందని, అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పవర్ పోయిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంటే పవర్ చార్జీలు పెంచితే ఎన్డీఏ కూటమికి కూడా అదే గతి పడుతుందని ఆయన ప్రత్యేకంగా చెప్పకుండా పాలకులకు బోధించారు.

Tags:    

Similar News