మళ్లీ రాజుకున్న పల్నాడు ఫ్యాక్షన్‌ పగ

పల్నాడు ప్రాంతంలో పగలు, ప్రతీకారాలకు కొరత లేదు. ఎన్నికలు వచ్చాయంటే ఆ పగలు పురి విప్పి దాడులకు కారణమవుతున్నాయి.

Update: 2024-05-18 15:56 GMT

ఈ సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ఫ్యాక్షన్‌ పగ ప్రతీకార దాడులకు దారి తీసింది. రెండేళ్ల క్రిత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పగలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయే తప్పా పెచ్చరిల్లలేదు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తితలు, చిన్న చిన్న దాడులకు మాచర్ల కేంద్ర బిందువైంది. పల్నాడు అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గం. ఈ నియోజక వర్గంలో పిన్నెల్లి, జూలకంటి కుటుంబాల మధ్య గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వాళ్ల అనుచరులుగా ఉన్న వాళ్లు కొట్లాడుకోవడం, ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా సార్లు జరిగాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాక్షన్‌ గొడవలకు కారణమైన ఏడుగురు వ్యక్తులను అదే ఏడాదిలో మారచర్ల, దుర్గి మధ్య నరికి చంపారు. వీళ్లు పిన్నెల్లి లక్ష్మారెడ్డి బందువులు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేరుగా రంగంలోకి దిగి లారీతో హత్యకు గురైన వారు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టించారు. కారు తిరుగబడటంతో కొందరు కారు పరెగెత్తగా మరి కొందరు బయటకు వస్తున్నారు. జూలకంటి వర్గీయులు లారీ నుంచి దిగి కారులో ఉన్న ఏడుగురిని వెంటాడి నరికి చంపారు. వీరు మాచర్ల నుంచి దుర్గి పోలీసు స్టేషన్‌లో సంతకాలు పెట్టేందుకు వస్తుండగా ఆత్మకూరు అడ్డ రోడ్డు వద్ద ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. రాజకీయ హత్యలైనప్పటికీ పోలీసులు ఫ్యాక్షన్‌ హత్యలుగానే వీటిని నిర్థారించారు. ఆ సమయంలో బ్రహ్మానందరెడ్డి తల్లి జూలకంటి దుర్గాంబ మాచర్లకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దుర్గాంబపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పిన్నెల్లి లక్ష్మారెడ్డి అప్పట్లో పోటీ చేసి ఓడి పోయారు. హత్యకు గురైన వారంతా లక్ష్మారెడ్డికి బందువులు కావడం విశేషం.

తర్వాత బ్రహ్మానందరెడ్డి 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడి పోయారు. తిరిగి మూడు సార్లు ఎన్నికలు జరిగితే బ్రహ్మనందరెడ్డి ఎన్నికల రంగంలోకి దిగ లేదు. 2024లో టీడీపీ అభ్యర్థిగా తిరిగి పోటీకి దిగారు. మొదటి నుంచి రైవల్స్‌గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలు పోటీ పడటంతో ఒక్క సారిగా పాత ఫ్యాక్షన్‌ కక్షలు కూడా బయటకు వచ్చాయి. నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైన ఓడించాలనే పట్టుదలలో బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.
మునిసిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలను నామినేషన్లు కూడా వేయనీకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఏకగ్రీవం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్‌ ఎన్నికల్లో పిన్నెల్లిని అడ్డుకుంటామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బొండా ఉమాతో పాటు మరి కొందరు నేతలు మాచర్ల వెళ్లారు. పిన్నెల్లి వర్గీయులు బొండా ఉమాతో పాటు వచ్చిన వారిని కూడా మాచర్ల పట్టణంలోకి రాకుండా కారు అద్దాలను పగులగొట్టి వెనుదిరిగేలా చేశారు. ఇదే మునిసిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల్లో ఒకరిని పిన్నెల్లి వర్గీయులు హత్య చేశారని, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు అప్పట్లో చంద్రబాబు మాచర్లకు వెళ్లారు. కార్యకర్త శవాన్ని శ్మసానానికి తీసుకెళ్తుంటే చంద్రబాబు పాడి మోసి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
2014లో కండ్లకుంట గ్రామంలో తాడిపర్తి పాపిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులయ్యాయి. 2019లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిరెడ్డిపైన దాడి జరిగింది. మాచవరం మండలం, చెన్నరాయపాలెం భూ వివాదంలో పిన్నెల్లి వర్గీయులు అక్కడ దళితులపైన దాడికి పాల్పడ్డారు. గత ఐదేళ్లల్లో 24 మంది హత్యకు గురైతే చనిపోయిన వారిలో 18 మంది టీడీపీకి చెందిన వారే అనే టాక్‌ ఉంది. చనిపోయిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా ఉన్నారని ఆ పార్టీలో చర్చ ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎన్నికల్లోను ఈ ఫ్యాక్షన్‌ గొడవలు నివురు గప్పిన నిప్పులానే ఉన్నాయి. ప్రధానంగా నియోజక వర్గంలోని కారంపూడి, రెంటాల, రెంటచింతల ప్రాంతాల్లో ఘర్షలు జరిగాయి. రెంటాల పోలింగ్‌ బూత్‌లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్న భార్యా భర్తలపై పిన్నెల్లి వర్గీయులు గొడ్డళ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసుల రక్షణతో పోలింగ్‌ ముగిసే వరకు ఏజెంటుగానే పని చేశారు. ఈ సంఘటన పలువురి దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల అనంతరం మే 14వ తేదీ మరి కొన్ని గ్రామాలైన ఒప్పిచర్ల, కంబంపాడు, తుమురుకోట, రెంటచింతల, రచ్చమళ్లపాడు తాండా, లోయపల్లి తదితర గ్రామాల్లో ఒక వర్గంపై మరొక వర్గం పరస్పరం రాళ్లు, కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో దాడులకు దిగారు. దీంతో హింస పెద్ద ఎత్తున చెలరేగింది. ఈ ఘటనల్లో చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఒక పక్క దాడులు జరుగుతోంటే మరో పక్క గాయాలకు గురైన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తూ మిగిలిన వారు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. ఈ దాడుల్లో పలు చోట్ల కార్లు, బైక్‌లను తగులబెట్టారు.
గురజాల నియోజక వర్గంలో కూడా 2024 ఎన్నికల సందర్భంగా పాత కక్షలు పురి విప్పి ఫ్యాక్షన్‌ దాడులకు దారి తీసాయి. దాచేపల్లి మండలం, తంగెడలో నాటు బాంబులు, పెట్రోలు సీసా బాంబులతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాచర్ల నియోజక వర్గంలోని కోడూరు, రెంటచింతల, మాచర్ల తదితర ప్రాంతాల్లోని సుమారు 10 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అయితే మిషన్‌లలోని చిప్పులు డ్యామేజీ కానందు వల్ల రీపోలింగ్‌కు అవసరం లేకుండా పోయింది.
ఇలా ప్రతి ఎన్నికల్లోను దాడులు జరగడం, వర్గాలుగా విడిపోవడం, కొట్టుకున్న వారిలో చని పోవడం వంటి సంఘటనల వల్ల అవి పాత క్షక్షలుగా మారి పల్నాడు ప్రాంతంలో ఫాక్షన్‌కు దారి తీస్తున్నాయి. ఎన్నికల వరకు నివురు కప్పిన నిప్పులా ఉండే గ్రామాలు ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ గొవడలు జరిగి దాడులకు పాల్పడి హత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. 2024 ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ముందుగానే గుర్తించి ఎస్పీని బదిలీ చేసి మరొకరిని నియమించింది. అయినా దాడులు జరిగాయి. ఎన్నికల అనంతరం ఈ దాడులకు బాధ్యులను చేస్తూ ఎన్నికల కమిషన్‌ ఎస్పీని సస్పెండ్‌ చేసి కలెక్టర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం సిట్‌ విచారణలో ఈ నియోజక వర్గం ఉంది.
Tags:    

Similar News