ప్రభుత్వం వద్ద 50 లక్షల మంది సమాచారం మిస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద 50 లక్షల మంది పౌరుల సమాచారం లేదు. ఈ విషయం కలెక్టర్ ల సమావేశంలో వార్డు, గ్రామ సచివాలయాల శాఖ వెల్లడించింది. ఎందుకు ఇలా జరిగింది?

Update: 2024-12-13 03:53 GMT

ప్రభుత్వం వద్ద 50 లక్షల మంది ప్రజల సమాచారం మిస్ అయింది. కారణాలు ఏవైనా, ఉండాల్సిన సమాచారం లేకుండా పోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం జనాభా 5.40 కోట్ల మందిగా ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 4.90 కోట్ల మంది సమాచారం మాత్రమే ఉంది. ఎవరికి ఏ పథకం ఇవ్వాలన్నా పౌరుల సమాచారం అవసరం. వారి సమాచారం లేకుండా ఏ పథకాన్నీ అమలు చేయలేము. ఒక వేళ చేసినా ఆ పథకం అర్హులందరికీ చేరే అవకాశం లేదు.

జనవరి 15లోపు మ్యాపింగ్

2025 జనవరి 15లోపు డేటా మిస్ అయిన 50 లక్షల మంది జనాభా మ్యాపింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మిస్ అయిన వారి వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ సేకరించాలని సీఎం కలెక్టర్ లకు చెప్పారు. ప్రభుత్వం రకరకాల సర్వేల ద్వారా జనాభా ప్రస్తుతం ఎంత మంది ఉన్నారో నిగ్గు తేల్చింది. రెండేళ్ల క్రితం నిర్వహించిన సాధికార సర్వే ద్వారా కూడా ఇంటింటా సమాచారం సేకరించారు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ సమాచారంతో పాటు కుటుంబ ఆదాయం, ఆస్తులు, ఉద్యోగుల సంఖ్య, కూలివారు, ఇతర పనుల్లో ఉన్న వారి వివరాలు కూడా సేకరించారు. ఈ సమాచారం సేకరించడంతో పాటు వ్యక్తుల ఆధార్ నెంబర్లు కూడా తీసుకుని వారి సమాచారాన్ని కూడా ప్రభుత్వం కావాల్సిన రీతిలో నిక్షిప్తం చేస్తోంది.

గత ప్రభుత్వంలో బయో మెట్రిక్ సర్వే

గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరి వివరాలు బయో మెట్రిక్ ద్వారా తెలుసుకున్నారు. ఆధార్ కు అనుసంధానం చేసే విధంగా గ్రామ వాలంటీర్లు ఇంట్లోని ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించారు. బయో మెట్రిక్ మిషన్ లో వేలిముద్ర వేయగానే వారి వ్యక్తిగత వివరాలు అన్నీ ఆన్ లైన్ లో డిస్ ప్లే అవుతున్నాయి. సర్వేకు వచ్చిన వాలంటీర్లు ఇంటి వారి పేర్లు ముందుగానే చెబుతున్నారు. ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. అందులో ఉద్యోగులు ఎంత మంది, నిరుద్యోగులు ఎంత మంది, నిరుద్యోగులు ప్రస్తుతం ఏమి పనులు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉంటే ఏ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇన్ కం ఎంత వస్తుంది వంటి వివరాలు కూడా సేకరించారు. ఇంత పకడ్బందీగా సమాచారం సేకరించిన వార్డు, గ్రామ సచివాలయాల్లో 50 లక్షల మంది సమాచారం లేకుండా పోయిందంటే అందుకు కారణాలు ప్రభుత్వం తెలుసుకునే ఆసక్తి చూపలేదు.

అధికారులను సమర్థించే విధంగా సీఎం వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ ల సమావేశంలో డేటా గల్లంతుపై చేసిన వ్యాఖ్యలు వార్డు, గ్రామ సచివాలయ శాఖ ఉన్నతాధికారులను సమర్థించే విధంగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అవసరం లేని వారు సమాచారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవచ్చు. ఇతర పట్టణాల్లో ఉంటున్న వారి నుంచి కూడా సమాచారం తీసుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడు తీసుకోండి. పథకాలకు అర్హులు కాని వారు సమాచారం ఇచ్చేందుకు ముందుకు రారు. అటువంటి వారిని ఒప్పించి సమాచారం తీసుకోవాలి. అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గతంలో తీసుకున్న డేటా ఎందుకు, ఎలా గల్లంతైందనే విషయం మాత్రం అడగ లేదు.

Tags:    

Similar News