ఓడరేవు విశాఖ విశ్వనగరం అవుతుంది....
విశాఖ విశ్వరూపం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు;
ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈస్ట్ కోస్ట్ గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదేశమని పేర్కొన్నారు. ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్ సమ్మిట్‌లో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన ఆయన తొలుత ఆరు స్టార్టప్ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. మారిటైమ్ లాజిస్టిక్స్‌కు సంబంధించి రెండు వేర్వేరు పుస్తకాలను ఆవిష్కరించారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్‌ను ప్రారంభించారు. అనంతరం సమ్మిట్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఆయన ఏమన్నారంటే...
పోర్టుల అభివృద్ధి కోసం అడ్వైజరీ బాడీగా ఏర్పడదాం. ఆరు నెలలకోసారి సమావేశమై చర్చిద్దాం. సూచనలు, సలహాలు తీసుకుని ఓ పాలసీని తయారు చేస్తాం. త్వరలో ప్రతి పోర్టుకూ కనెక్టివిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. భవిష్యత్తులో లాజిస్టిక్ రంగానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు లాజిస్టిక్స్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాలు, అంతర్గత జల రవాణాలను అనుసంధానించాల్సి ఉంది. లాజిస్టిక్స్‌పా ర్కులు, డ్రై పోర్టులు కూడా రావలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో 1500 కిలోమీటర్లకు పైగా అంతర్గత జల రవాణా మార్గాలున్నాయి. కాకినాడ–చెన్నై మధ్య ఉన్న పురాతన బకింగ్‌హాం కెనాల్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు రాష్ట్రంలో మరికొన్ని విమానాశ్రయాలు వస్తాయి. ప్రస్తుతం ఏపీలో ఆరు పోర్టులున్నాయి. మరో నాలుగు పోర్టులు త్వరగతిన నిర్మాణం అవుతున్నాయి. వీటితో పాటు ఫిషింగ్ హార్బర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఓడరేవు ఉండాలన్నదే మా ఆలోచన. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు టౌన్‌షిప్‌లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో లాజిస్టిక్ యూనివర్సటిని, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్ పార్కులు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం.
సమ్మిట్‌లో మారిటైమ్ ప్రతినిధులతో పాల్గొన్న సీఎం చంద్రబాబు
69 మిలియన్ టన్నల కార్గో రవాణా..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు కార్గో ద్వారా ఏటా 69 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం రవాణా అవుతోంది. అలాగే 11 మిలియన్ టన్నుల బొగ్గు, 5.5 మిలియన్ టన్నుల ఎరువులు రవాణా అవుతున్నాయి. ఏపీలో మినహా తూర్పు కోస్తా తీరంలోని ఏ రాష్ట్రంలోనూ 18 మీటర్ల లోతైన ఓడరేవులు లేవు. ఇవన్నీ పోర్టుల రంగంలో ఏపీకి ఉన్న సానుకూల అంశాలు. సముద్ర రవాణాపరంగా ఏపీ రెండో స్థానంలో ఉంది. వీటికి అనుబంధంగా మూడు పారిశ్రామిక కారిడార్లున్నాయి. తెలంగాణ కూడా డ్రై పోర్టును ఏర్పాటు చేసి మచిలీపట్నం ద్వారా కార్గో రవాణా చేయాలని యోచిస్తోంది. గోదావరి నది ద్వారా అంతర్గత జల రవాణాతో మహారాష్ట్ర కూడా కార్గో రవాణా చేయాలని భావిస్తోంది. కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా ఏపీలోని పోర్టులు కనెక్టు చేసే అవకాశం ఉంది. విశాఖ, అమరావతి, తిరుపతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఎయిర్ కార్గో రవాణాకు అనుకూలంగా మారుస్తాం. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటును అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్నాం. వీళ్లు విశాఖ పోర్టు ద్వారా ఇనుప ఖనిజాన్ని తెచ్చుకుంటారు. దీనికి అనుబంధంగా టౌన్‌షిప్, ఇతర ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ వంటి ప్రాంతాల్లో 10 వేల ఎకరాల భూమి వీటి అవసరాలకు వినియోగిస్తాం.
బల్క్ నుంచి కంటైనర్ కార్గోకు మారాలి
90 శాతం బల్క్ కార్గోనే ఉంది. త్వరలో ఇది కంటైనర్ కార్గోగా మారాలి. దుగ్గరాజుపట్నం సహా వివిధ ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, రిపేర్లు, కంటైనర్లు, షిప్ రీసైక్లింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. డిజిటల్ లాజిస్టిక్స్, కార్గో ట్రాకింగ్ లాంటి సాంకేతికతలూ రావాలి. పోర్టులు గ్రీన్ హబ్స్‌గా మారాలి. ఏపీలో రైల్ లింక్డ్ టెర్మినళ్లు కూడా ఏర్పాటుకు వీలుంది. తక్కువ వ్యయంతోనే జాతీయ రహదారులతోనూ పోర్టులను అనుసంధానించేందుకు అవకాశం ఉంది. లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను కూడా ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. లాజిస్టిక్స్ పార్కులు, అంతర్గత జల రవాణా మార్గాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. దీనికోసం ఓ పాలసీని తీసుకొస్తాం. 115–20 మందితో సలహా బోర్డును ఏర్పాటు చేస్తాం. విశాఖ త్వరలోనే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. విశాఖకు పెద్ద ఎత్తున డేటా సెంటర్లు వస్తున్నాయి. సీ కేబుల్ ద్వారా ఇతర ప్రపంచం కూడా విశాఖలో అనుసంధానం అవుతుంది.
సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు
టెక్నాలజీని అనుసంధానిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్‌లో రంగం ఏదైనా టెక్నాలజీని అనుసంధానిస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. పోర్టుపరేషన్లు, వ్యవసాయం, వైద్యరోగ్యం ఇలా వేర్వేరు అంశాల కోసం డ్రోన్లను వినియోగించేలా కార్యాచరణను ఇప్పటికే చేపట్టాం. జీరో పావర్టీని తీసుకురావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలను పెంచడంపై ఫోకస్ పెట్టాం. సుస్థిరాభివృద్ధిలో భాగంగా నీటి భద్రతపై కూడా దృష్టి సారించాం. నదుల అనుసంధానానికి ప్రయత్నిస్తున్నాం. గంగా–కావేరీ నదులను అనుసంధానిస్తే నీటి భద్రతను సాధిస్తాం. భారత్‌లో నాణ్యత పెరగాలి. గ్లోబల్ బ్రాండ్లు ఎదగాలి. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి సారించి నెట్ జీరోపై ఫోకస్ పెట్టాం. దీని కోసం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలను వినియోగించుకుంటున్నాం.
రవాణా వ్యయం బాగా తగ్గాలి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యయం 8 శాతంగా ఉంటే దేశంలో అది 13 శాతంగా ఉంది. ఇది బాగా తగ్లాలి. గతంలో విద్యుదుత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండేది. సంస్కరణల ఫలితంగా ధరలు దిగొచ్చాయి. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా కూడా అందుబాటులోకి వచ్చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. తదుపరి దశ సంస్కరణల దిశగా భారత్ అడుగులేస్తోంది. షిప్ బిల్డింగ్, రైల్ కార్గో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ విషయంలో పాలసీ సమస్యను పరిష్కరిస్తాం. భారత్ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలనుకుంటే ఏపీ 160 గిగావాట్లు అందించడానికి సిద్ధంగా ఉంది.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.