మూగ జీవాల మరణ వేదన- టీటీడీలో రాజకీయ రోదన

గోవుల మరణాలపై అనుమానాలు లేవనెత్తిన భూమనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందు ఆయన ఆరోపణలు నిజమో కాదో తేల్చడానికి విచారణ జరపాలి.;

Update: 2025-04-15 11:32 GMT
BR NAIDU v/s Karunakar Reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. 3 నెలల వ్యవధిలో 3 వివాదాలు చుట్టుముట్టాయి. నెయ్యి వివాదం, తొక్కిసలాట చావుల రగడ ముగియక ముందే గోమేధం చుట్టూ రాజకీయం కమ్ముకుంటోంది. తిరుమల తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మూడు నెలల వ్యవధిలో అధికారుల నిర్లక్ష్యంతో వందకి పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.

ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.శ్యామలరావు ప్రెస్ మీట్లు పెట్టి కరుణాకర్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. టీటీడీలో అన్ని పాపాలకు 2019 నుంచి 2024 ఏప్రిల్ వరకు అధికారంలో ఉన్న వైసీపీ పాలన కారణమని తిప్పికొట్టారు. ఇరువర్గాల ఖండన మండనల మధ్య అసలు వాస్తవం ఏమిటనేది భక్తులకు తెలియకుండా పోయింది. నిజానిజాలకన్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించడం ఎలా అనే దాని చుట్టూతానే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆరోపణలు, వాటికి ఇస్తున్న జవాబులన్నీ రాజకీయంగానే ఉంటున్నాయి. వాస్తవాంశాల జోలికి ఎవరూ వెళ్లినట్టు కనిపించడం లేదు. భూమన చేసింది తప్పుడు ఆరోపణ అయితే ఆ విషయాన్ని శాస్త్రీయ, వాస్తవ ఆధారాలతో నిరూపించి ఎండగట్టడానికి బదులు భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని అనడం- తమను తాము సమర్ధించుకునేందుకు సరిపోతుందే గాని భక్తులకు సంతృప్తికరమైన జవాబులు దొరకడం లేదు. అసలింతకీ ఏమిటీ వివాదం, దాని పూర్వపరాలేమిటో చూద్దాం.
ఎస్వీ గోశాల చరిత్ర ఇదీ..
ఆధ్యాత్మికంగా గోవుకున్న ప్రాధాన్యత దృష్ట్యా టీటీడీ 1956లో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ ఏర్పాటైంది. 1956 వరకు పశు సంరక్షణ కేంద్రంగా నడిచింది. ఆ తర్వాత గోశాల, 2004 నుంచి S.V. గోసంరక్షణ శాలగా మారింది. టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన ప్రకారం ఈ గోశాలలో ప్రస్తుతం 2,700 వరకు గోవులున్నాయి. స్వామి వారి నైవేద్యం తయారీకి ఈ గోశాల నుంచే పాలు, వెన్న, నెయ్యి వెళుతుంది. ఆధునిక సౌకర్యాలున్న గోశాల ఇది. ఇక్కడున్న పశు సంపదను రక్షించేందుకు 5 వైదులు, ఇతర సిబ్బంది ఉన్నారు. భక్తులు ఈ గోశాలకు గోవుల్ని విరాళంగా కూడా ఇస్తుంటారు.
భూమన ఆరోపణలు ఏమిటీ?
ఎస్వీ గోశాలలో ఈ ఏడాదిలోని మొదటి మూడు నెలల కాలంలో 100కి పైగా గోవులు మృతి చెందాయని, అందువల్ల గోశాలను గోవధ శాలగా మార్చాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సిబ్బంది నిర్లక్షం, పర్యవేక్షణ లోపం, ఔషధాల లేమి వంటి అనేక కారణాలతో గోవులు చనిపోతున్నాయని ఆరోపించారు. చనిపోయిన ఆవులు, లేగదూడల ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.
బీఆర్ నాయుడు ఏమన్నారు?
టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు భూమనకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. గోశాలపై ఆరోపణలు తప్పని, అనారోగ్యం, వృద్ధాప్యమే గోవుల మృతికి కారణమన్నారు. భూమన ఇచ్చిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవేనని అన్నారు. భూమన టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతూ భూమన కరుణాకర్ రెడ్డి రూ.1600 కోట్లు ఇంజనీరింగ్ వర్క్స్‌కు ఆర్డర్ ఇచ్చారన్న బీఆర్ నాయుడు.. ఈ పనులు పొందిన వారి నుంచి భూమన కమీషన్లు పొందారంటూ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
భూమనపై కేసులు పెడతామని హెచ్చరించారు. ‘‘కమీషన్ల ఛైర్మన్‌గా వ్యవహరించారు’’ అన్నారు. ఈ సందర్భంలోనే బీఆర్ నాయుడు మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భూమన హస్తం ఉండవచ్చని, అప్పుడు హరినాథ్ రెడ్డి అనే మరో పోలీసు అధికారి కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టీటీడీ చరిత్రలో తిరిగి ఓ ప్రమాదకరమైన అధ్యాయానికి తెరపైకి తెచ్చాయి.
ఈవో శ్యామలరావు ఏమన్నారంటే..
టిటిడి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతోనే మాజీ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆరోపణలు చేశారని ఈవో జే శ్యామలరావు అన్నారు. నిజానికి మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు ఎస్వీ గోశాలలో చాలా అవినీతి కార్యకలాపాలు జరిగాయని, అప్పట్లో విజిలెన్స్ నివేదిక సమర్పించిన వీడియో క్లిప్పింగ్‌లు, గణాంక ఆధారాలను, టిటిడి గోశాలలో జరిగిన దుర్వినియోగాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రతి నెలా 15 ఆవుల మరణం సహజమేనట..
ప్రతి నెలా సగటున 15 ఆవులు వయోభారంతో, వ్యాధులతో చనిపోతాయని ఈవో శ్యామలరావు చెప్పారు. 2024లో 179 గోవులు చనిపోగా 2025 ఏడాదిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో 43 గోవులు మృతి చెందాయన్నారు. చనిపోయిన గోవులు వయోభారం, వ్యాధుల కారణంగా సహజ మరణాలేనని, ఈ ఏడాది ఇప్పటి వరకు 59 లేగ దూడలు జన్మించాయని శ్యామలరావు చెప్పారు. వాస్తవాలు ఇలా వుంటే టిటిడి బోర్డు మాజీ అధ్యక్షులు బి. కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్పీకి టీటీడీ బోర్డు మెంబర్ ఫిర్యాదు..
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చిత్తూరు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. భూమన పై ధర్మకర్తల మండలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
గోశాల నిర్వహణ ఎవరికి?
ఎస్వీ గోశాల నిర్వహణ నేరుగా టీటీడీ పాలక మండలి పరిధిలోకి వస్తుంది. నిర్వహణలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో అవకతవకలు జరిగాయని ఇప్పటి టీటీడీ పాలకవర్గం ఆరోపిస్తోందే తప్ప ఇప్పటి వరకు ఎవరూ నివేదికలు బయటపెట్టలేదు. గోవుల సంరక్షణకు ఎన్ని నిధులు మంజూరయ్యాయి? వాటి వినియోగంపై రిపోర్టులు ఏమయ్యాయి? వంటివన్నీ జవాబు లేని ప్రశ్నలే.
భక్తుల నమ్మకాన్ని పట్టించుకోవాలా? వద్దా?
గో శాలలో గోవుల మరణాల చుట్టూ వివాదం ముదురుతోంది. భూమన చర్యను భక్తి ముసుగులో రాజకీయంగా చూస్తున్నారు కొందరు.. మరికొందరు మాత్రం టీటీడీ పాలనలో సక్రమ విచారణ, పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పౌరసంఘాలు, పశు సంక్షేమ కార్యకర్తలు — గోవుల సంక్షేమాన్ని రాజకీయ విమర్శలతో వదిలేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్వరా?
టీటీడీ రాజకీయాలకు అనేకసార్లు వేదిక అయింది. గతంలోనూ, పాలక మండలి నియామకాల నుంచి విరాళాల వినియోగ దాకా అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. కానీ ఈసారి సమస్య మరింత తీవ్రమైనది – ఇది కేవలం రాజకీయపరమైన నిందారోపణల గోలే కాదు, జంతు హక్కులు, మానవ విలువలతో ముడిపడిన అంశం. ఈ నేపథ్యంలో కూడా వాస్తవాలను పట్టించుకోకుండా రాజకీయ లెక్కలే ముందుకు పెట్టడం ప్రమాదకరం.
వాస్తవానికి ఎదురుగా నిలవాలే గాని విరోధికి కాదు..
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం పవిత్రమైన హక్కు. దానిని ఖండించాలంటే, ఆ ప్రశ్నల వెనుక ఉన్న వాస్తవాలను సమాధానంగా ఇవ్వాలి. గోవుల మరణాలపై అనుమానాలు లేవనెత్తిన భూమనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందు ఆయన ఆరోపణలు నిజమో కాదో తేల్చడానికి విచారణ జరపాలి. అదే సమయంలో టీటీడీ తన పనితీరును ప్రజల ముందు ఉంచాలి.

రాజకీయంగా స్పందించడం కన్నా, పాలనాపరంగా చిత్తశుద్ధితో ఉండడం ముఖ్యం. గోవుల సంరక్షణ కంటే ముందు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం మరింత అవసరం.
Tags:    

Similar News