దుర్గమ్మను దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దంపతులు

దసరా ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దంపతులు, నీతి ఆయోగ్‌ ప్రతినిధులు దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

Update: 2024-10-11 12:17 GMT

దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ దంపతులు, నీతి ఆయోగ్‌ ప్రతినిధుల బృందం, విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు సతీసమేతంగా సందర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో రామారావు నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ దంపతులకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో సీఎస్‌ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు. అనంతరం చీఫ్‌ సెక్రెటరీ మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరగడాన్ని, ఏర్పాట్లు చేయడాన్ని అభినందించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని, దుర్గమ్మ అమ్మవారి అనుగ్రహంతో సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తు అయిన వరదల సమయంలో ఉద్యోగులు, అధికారులు బాగా కష్టపడి పని చేశారని అభినందించారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ దుర్గమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. శనివారం పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. కనక దుర్గమ్మ శక్తి స్వరూపాల్లో ఒకరు కావడంతో నవరాత్రుల సందర్భంగా దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల్లో ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి కనక దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు కావలసిన వసతీ సౌకర్యాలు కల్పించడంలో సక్సెసెస్‌ అయ్యారని చెప్పొచ్చు. నవరాత్రులు శనివారంతో ముగిస్తున్నందు వల్ల పండుగ రోజైన శనివారం భక్తులందరికీ ఉచిత దర్శనాలు కల్పించేందుకు దుర్గ గుడి పాలక వర్గం నిర్ణయించింది.

Tags:    

Similar News