ఆర్జీవీని, ‘వ్యూహం’ యూనిట్‌ను వెంటాడుతున్న ఏపీ ప్రభుత్వం
వడ్డీతో సహా 1.15కోట్లు చెల్లించాలని, ఆర్జీవీతో పాటు ‘వ్యూహం’ సినిమా యూనిట్‌కు ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(ఆర్జీవీ)తో పాటు, ‘వ్యూహం’ సినిమా యూనిట్‌ను వెంటాడుతోంది. రామ్‌గోపాల్ వర్మపై ఇది వరకు సోషల్ మీడియా కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం, తాజాగా మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా, నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిధులు దోచి పెట్టిందనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తాజాగా వ్యూహం సినిమా యూనిట్‌కు, ఆ సినిమా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో వ్యూస్‌కు రూ. 100 చెల్లించాల్సి ఉండగా, వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15కోట్ల వరకు అక్రమంగా వ్యూహం సినిమా యూనిట్ లబ్ధి పొందారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఆ మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో పాటుగా వ్యూహం సినిమా యూనిట్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. లీగల్ నోటీసులు జారీ చేసిన 15 రోజుల్లో వడ్డీతో సహా రూ. 1.15 కోట్లు తిరిగి చెల్లించాలని నోటీసుల్లో జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిధుల దుర్వినియోగంపై జీవీ రెడ్డి మాట్లాడుతూ వ్యూహం సినిమాకు రూ. 2.15కోట్లకు ఏపీ ఫైబర్‌నెట్‌తో ఒప్పందం చేసుకుందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అయితే వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయన్నారు. ఒక్కో వ్యూస్‌కు రూ. 11000 చొప్పున చెల్లించారని, దీనిపైన లీగల్ నోటీసులు ఇచ్చినట్లు జీవీ రెడ్డి చెప్పారు. ∙