పక్కలో బల్లెంలాగ తయారయ్యాడా ?

ప్రభుత్వంలో కాని పార్టీపరంగా కాని జరుగుతున్న మైనస్సులను బహిరంగంగా ఎండగడుతున్నాడు. ఆ ప్రజా ప్రతినిధే ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న.

Update: 2024-09-24 05:21 GMT

ఈరోజుకు రేవంత్ రెడ్డి మాటకు పార్టీలో కాని ప్రభుత్వంలో కాని వ్యతిరేకించే వాళ్ళే లేరు. రేవంత్ ఏదనుకుంటే అది జరుగుతోంది. అంతమాత్రాన రేవంత్ నాయకత్వం పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమేనా అంటే అవునని కచ్చితంగా చెప్పేందుకు లేదు. ఎందుకంటే పరిస్ధితుల ప్రభావం కారణం కావచ్చు లేదా ఇంకేదైనా కారణం కావచ్చు చాలామంది సీనియర్లు రేవంత్ కు జై కొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, వీ హనుమంతరావు, జీవన్ రెడ్డి లాంటి మరికొందరు రేవంత్ ఆధిపత్యాన్ని తప్పనిస్ధితిలో మాత్రమే భరిస్తున్నారని రేవంత్ తో పాటు అందరికీ తెలుసు.

ఇలాంటి పరిస్ధితుల్లో ఒక నేత గట్టిగా చెప్పాలంటే జూనియర్ మోస్ట్ ప్రజాప్రతినిధి రేవంత్ ను పదేపదే ఇరకాటంలో పడేస్తున్నారు. ప్రభుత్వంలో కాని పార్టీపరంగా కాని జరుగుతున్న మైనస్సులను బహిరంగంగా ఎండగడుతున్నాడు. ఆ ప్రజా ప్రతినిధే ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న. ఈ మధ్యనే జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల కోటా ఎంఎల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసి మెజారిటి ఓట్లు తెచ్చుకున్న కారణంగా ఎంఎల్సీ అయ్యారు. పార్టీలో చేరేంతవరకు, ఎంఎల్సీ అయ్యేంతవరకు రేవంత్ తో తీన్మార్ కు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని రేవంత్ విధానాలను తీన్మార్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు.

తీన్మార్ కు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో రెగ్యులర్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గంలోకి బీసీలను తీసుకోవాల్సినంతమందిని తీసుకోలేదని ఒకసారి విమర్శించారు. 2028 తర్వాత కాంగ్రెస్ కు నాన్ ఓసీ ముఖ్యమంత్రి వస్తారని చేసిన వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వంలో సంచలనంగా మారాయి. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా రేవంత్ అయితే సీఎంగా ఉండరని డైరెక్టుగానే చెప్పారు. హైడ్రా కూల్చివేతలపైన కూడా నిరసన వ్యక్తంచేశారు. చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కూల్చివేతలపై తీన్మార్ మాట్లాడుతు ఆక్రమణల కూల్చివేయటంలో రెండో ఆలోచన అవసరంలేదు కాని కూల్చివేతల వల్ల నష్టపోతున్నది మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలే అని ప్రభుత్వం గుర్తించాలని సూటిగానే రేవంత్ కు చెప్పారు.

తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కచ్చితంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఒక హోటల్లో సోమవారం జరిగిన బీసీ కులాల సమావేశంలో మాట్లాడుతు రాబోయే ఎన్నికల తర్వాత బీసీ నేత ముఖ్యమంత్రి అవటం ఖాయమన్నారు. ఈమధ్యనే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎస్ఎల్బీసీ అంచనాలను రు. 4500 కోట్లు పెంచటంపైన కూడా మండిపడ్డారు. గత పాలకులు చేసిన తప్పువల్లే ఎస్ఎల్బీసీ అంచనా వ్యయం రు. 4500 కోట్లు పెంచాల్సొచ్చిందని క్యాబినెట్ తీర్మానం చేయటాన్ని కూడా తీన్మార్ ఎద్దేవా చేశారు. గత పాలకుల తప్పుల వల్లే ఇపుడు అంచనాలు పెంచాల్సొంచ్చిదంటే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవారే కదాని ఎద్దేవా చేశారు.

ఎక్కడ అవకాశం దొరికినా ప్రభుత్వ విధానాలను విమర్శంచటానికి తీన్మార్ ఏమాత్రం మొహమాటపడటంలేదు. బహిరంగంగానే బీసీ కులాల వేదికపైనో లేకపోతే తన యూట్యూట్ ఛానల్లోనో అదీకాకపోతే ఎక్కడైనా సమావేశాల్లో పాల్గొన్నపుడు కూడా బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చే అంశం ఏమిటంటే ఏ చిన్న సందర్భం వచ్చినా కేసీఆర్ కుటుంబం మీద పెద్దఎత్తున ధ్వజమెత్తుతున్నారు. బీఆర్ఎస్ ను వదిలేసి అచ్చంగా సొంత ప్రభుత్వం మీద మాత్రమే విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే అవన్నీ బీఆర్ఎస్ కు అస్త్రాలుగా ఉపయోగపడేవే అనటంలో సందేహంలేదు. ఒకవైపు ప్రభుత్వంలో జరగుతున్న తప్పులను, విధానాలను తప్పుపడుతునే మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కూడా ఎండగడుతుండటంతో కారుపార్టీ నేతలు తీన్మార్ ప్రస్తావనను పెద్దగా ప్రస్తావించటంలేదు. ఏడాది కూడా కాకుండానే తీన్మార్ సొంత ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారంటే ముందుముందు ఇంకెంతగా రెచ్చిపోతారో చూడాల్సిందే.

Tags:    

Similar News