భారీ చీటింగ్–సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న టీడీపీ మంత్రి అల్లుడు
అల్లుడు పేరుతో అతని కంపెనీకే మెస్సేజ్ పంపి కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు.;
సైబర్ నేరగాళ్ల నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా జూలు విదుల్చుతూనే ఉన్నారు. కోట్లు రూపాయలను కొట్టేస్తూనే ఉన్నారు. కామన్ మెన్ నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతూనే ఉన్నారు. భారీగా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో సారి రెచ్చిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు ఏకంగా టీడీపీ మంత్రి అల్లుడికే చిల్లు పెట్టారు. నెల్లూరుకు చెందిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌నే టార్గెట్ చేశారు. ఏకంగా అతని కంపెనీలోనే మోసానికి తెరలేపారు. పునీత్ పేరుతో మెస్సేజ్ పెట్టి భారీగా డబ్బులు కొట్టేశారు. పునీత్ పేరుతో తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని పునీత్ కంపెనీకి మెస్సేజ్ పంపారు.
అత్యవసరంగా తనకు రూ. 1.40 కోట్లు కావాలని.. ఆ మొత్తాన్ని తన అకౌంట్‌కు పంపాలనేది ఆ సైబర్ నేరగాళ్లు పంపిన మెస్సేజ్ సారాంశం. పునీత్ మెస్సేజ్ చూసిన ఆ సంస్థలోని అకౌంటెంట్ నిజంగానే అది పునీత్ పెట్టిన మెస్సేజే అని భావించి రూ. 1.40 కోట్లు ఆ అకౌంట్‌కు పంపాడు. తర్వాత తాను మోసపోయినట్లు పునీత్ అకౌంటెంట్ గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ట్రేస్ చేసి సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజీవ్, అరవింద్‌లు ఈ సైబర్ నేరానికి పాల్పడినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. ఆ నేరగాళ్ల లావాదేవీలను పోలీసులు సీజ్ చేశారు.