మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత మృతి

కనీసం మ్యాన్‌ హోల్‌ ఉందనే హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయని వీఎంసీ.;

Update: 2025-08-13 08:36 GMT

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరం గులాం మొహిద్దిన్‌ స్ట్రీట్‌లో నగరపాలక సంస్థ అధికారులు మ్యాన్‌ హోల్‌ను తవ్వారు. దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడంలో వీఎంసీ వైఫల్యం చెందింది. మ్యాన్‌ హోల్‌ ఉందనే హెచ్చరిక బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి ఈ మ్యాన్‌ హోల్‌ వర్షపు నీరుతో నిండిపోయి కనిపించలేదు. దీంతో అటుగా వచ్చిన 53వ డివిజన్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్‌ ఆ మ్యాన్‌ హోల్‌ లో పడి మృత్యువాత పడ్డారు. మ్యాన్‌ హోల్‌ ఉందనే హెచ్చరిక బోర్డు పెట్టిన ఉన్నా ఈ దారుణం జరిగి ఉండేది కాదు.

కూటమి ప్రభుత్వం, కూటమి ప్రజాప్రతినిధులు, వీఎంసీ నిర్లక్ష్యం వల్ల విజయవాడలో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. మృతి చెందిన టీవీ మధుసూదన్‌ను మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రజా ప్రతినిధులకు బిల్డింగ్ల మీద, అక్రమ సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజా ప్రయోజనాల మీద లేదు అని వెల్లంపల్లి మండిపడ్డారు. గుడ్‌ మార్నింగ్‌ పేరుతో డివిజన్లో తిరిగే టీడీపీ ప్రజా ప్రతినిధులు ఇటువంటి ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసి వాళ్ళ అక్రమ సంపాదన కోసం దృష్టి పెడుతున్నారు. కనీసం మ్యాన్‌ హోల్‌ తవ్వారనే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఓ వ్యక్తి నిండు ప్రాణం బలికి కారణమైనటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News